దత్త మండలాలు రాయలసీమగా మారింది నేడే

                                                   (యనమల నాగిరెడ్డి)

ఇది 90 సంవత్సరాల నాటి కథ.  ఒక ప్రాంతానికి అస్తిత్వం కల్పించి, ఆ ప్రాంత వ్యక్తిత్వం లోకానికి చాటిచెప్పడానికి, ఆత్మగౌరవం నిలుపడానికి అప్పటి మహానుభావులు 1928 నవంబర్ లో శ్రీకారం చుట్టారు. ఆ ఫలితమే నేటి రాయలసీమ నామం.

తన పాలనలో ఉన్న బళ్ళారి,అనంతపురం, చిత్తూర్, కడప, కర్నూల్ జిల్లాలను, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం రెవిన్యూ డివిజన్ ను నిజాం నవాబు తన రాజకీయ అవసరాలకోసమో, అప్పటి పరిస్థితి కారణం గానో బ్రిటీషు వారికి “వదిలి” వేశారు. అప్పటి నుండి వీటిని “సీడెడ్” జిల్లాలని పిలిచేవారు.

సీడెడ్ అంటే “వదిలివేసిన” అన్న అర్థం.  ఈ పదం అవమానకరం గా ఉందన్న భావనతో కొందరు పెద్దలు ఈ ప్రాంతానికి “దత్త మండలాలు” (adopted mandals)  నామకరణం చేశారు.

కానీ ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న అప్పటి బ్రిటిష్ పాలకులు  ప్రాంతాన్ని గురించి ఈ మాత్రం పట్టించుకోకుండా, సవతి తల్లి ప్రేమ చూపించారు.

 

నంద్యాల ఆంధ్ర మహా సభ   

1928 నవంబర్ 17 న నంద్యాలలో కడప కోటిరెడ్డి అధ్యక్షుడుగా, శరభారెడ్డి ఆహ్వానసంఘం అధ్యక్షుడుగా  జరిగిన ఆంధ్ర మహాసభలలో మొట్టమొదటి “దత్తమండలాల ప్రధమ సభ” జరిగింది. ఆ సభలో ఈ ప్రాంత సమస్యలపైన, ప్రాంత అస్తిత్వం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇందులో ఈ ప్రాంతానికి ఉన్న దత్తమండలాలు అన్న పేరు సరిగా లేదని, పైగా అవమానకరంగా ఉందని అందువల్ల ఈ ప్రాంతానికి సరైన పేరు పెట్టాలని పలువురు మేధావులు పట్టు పట్టారు.

 

పేరు పెట్టింది కళింగవాసి

కళింగసీమలో జన్మించి అప్పట్లో అనంతపురం కళాశాలలో అధ్యాపకుడిగా  పని చేస్తున్న “చిలుకూరి నారాయణరావు” గారు “రాయలసీమ” పేరును మొదట ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే సభికులు ముక్త కంఠంతో రాయలసీమ, రాయలసీమ అని నినదించారు. 1928 నవంబర్ 18 న దత్త మండలాల పేరును  రాయలసీమ గా మారుస్తూ సభ తీర్మానించడం, ప్రభుత్వానికి పంపడం. ఈ పేరును రికార్డులలో చేర్చారు.

ఆ తర్వాత కాలంలో పప్పూరి రామాచార్యులు తన “సాధన పత్రిక” ద్వారా రాయలసీమ పేరును ప్రాచుర్యంలోకి తేవడానికి కృషి చేయగా, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు విశేషంగా కృషి చేసి విజయం సాధించారు.

 

నామకరణ దినోత్సవం

రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్యులుగా ఉండి అప్పిరెడ్డి హరినాధ రెడ్డి అధ్యక్షతన నడుస్తున్న రాయలసీమ సాహిత్య మరియు సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో2016 నుండి “రాయలసీమ నామకరణ దినోత్సవాన్ని” నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా  ఈ రోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.