‘మనదే గెలుపు..అన్నీ సీట్లు స్వీప్ చేస్తాం’…తాజాగా చంద్రబాబునాయుడు ప్రకటన. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ కూడా చంద్రబాబు ఇటువంటి ప్రకటన చేశారంటే దింపుడు కళ్ళెం ఆశే పెట్టుకున్నట్లు కనబడుతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలో నుండి ఎంఎల్ఏలు, ఎంపి బయటకు వచ్చేస్తున్నారు. ఇంకెంత మంది రాజీనామాలు చేసేసి బయటకు వచ్చేస్తారో కూడా తెలీదు. అమరావతిలో మాట్లాడుతూ పార్టీ నేతల్లో ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
నిజానికి చంద్రబాబు చెబుతున్నంతగా ధీమాగా అయితే లేదు పార్టీ పరిస్ధితి. చాలా నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు, మంత్రుల పరిస్ధితి ఏమాత్రం బావోలేదు. రాబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్నారు. చాలామందిపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. దాంతో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం.
గెలుపుపై చాలామంది నియోజకవర్గాల్లో విజయంపై అనుమానాలున్నది వాస్తవం. ఆ విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. వాస్తవాలు ఇలావుండగా అన్నీ సీట్లు టిడిపినే స్వీప్ చేస్తుందని చంద్రబాబు విచిత్రంగా ఉంది. పసుపు కుంకుమ, రైతుబంధు, ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, రైతు, మహిళ, యువత వర్గాలకు టిడిపిపై అపారమైన నమ్మకం ఉందని చంద్రబాబు చెప్పుకుంటుంటే నేతలకు ఏం మాట్లాడాలో అర్ధం కావటం లేదు. చంద్రబాబు చెప్పిందే నిజమైతే మరి ఎంఎల్ఏలు ఎందుకు వచ్చేస్తున్నట్లు ?