ఏలూరులో బిసి గర్జన బ్రహ్మాండంగా జరిగింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ గర్జన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుపైనే సందేహాలు మొదలయ్యాయి. అంటే బహిరంగసభలో జగన్ ఇచ్చిన హామీల్లో చాలా వరకూ పాదయాత్ర సందర్భంగా చేసిందే లేండి. అయినా ఆ హామీలన్నింటినీ గర్జన సందర్భంగా మరోసారి చెప్పటంతో అందులోని ఆర్ధిక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సరే చంద్రబాబునాయుడు అండ్ కో జగన్ హామీలపై మండిపడుతున్నారనుకోండి అదివేరే సంగతి.
జగన్ ఇచ్చిన ఆర్ధిక హామీల ఇతరత్రా గురించి మాట్లాడుకుందాం. తాను అధికారంలోకి వస్తే బిసిల సంక్షేమానికి ఏటా రూ 15 వేల కోట్లు కేటాయిస్తారట. అంటే ఐదేళ్ళల్లో రూ 75 వేల కోట్లన్నమాట. రాష్ట్రంలోని ప్రతీ క్షౌరశాలకు ఏడాదికి రూ. 10 వేలిస్తారట. చేయూత పథకం క్రింద నాలుగు విడతల్లో రూ 75 వేలిస్తారట. బిసి విద్యార్ధుల విద్య కోసం రూ 20 వేలట. బిసి పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ 15 వేలట. వేట నిషేధసమయంలో జాలర్లకు రూ 10 వేలిస్తారట. వేటకు వెళ్ళి చనిపోతే నష్టపరిహారంగా రూ 10 లక్షలు.
గొఱ్ఱెలు, మేకలు చనిపోతే రూ 6 వేలిస్తారట. చేనేతలకు ప్రతీ నెల 2 వేల రూపాయలు పెట్టుబడిక్రింద ఇస్తారట. ఎస్సీ, ఎస్టీ, బిసిల్లో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే బీమా పథకం క్రింద రూ 7 లక్షలిస్తారట. ఇవన్నీ చూసిన తర్వాత జగన్ హామీలు అమలవ్వాలంటే ఏడాదికి ఎన్ని వేల కోట్లు అవసరమో ఎవరికి వారుగా అర్ధం లెక్కలేసుకోవాలి.
ఇతరత్రా హామీల కూడా చాలానే ఉన్నాయి. బిసి సబ్ ప్లాన్ కు చట్టబద్దత కల్పించటం. మొదటి బడ్జెట్లోనే సమగ్ర బిసి చట్టం తెస్తారట. కార్పొరేషన్ల వ్యవస్ధను ప్రక్షాళన చేయటం. బిసిల్లోని ప్రతీ ఉపకులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయటం. బిసి కమీషన్ ఏర్పాటు చేయటం. ట్రస్టుబోర్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు 50 శాతం అవకాశం.
కార్పొరేషన్లలో అవకాశం, బిసి కమీషన్ వేయటం, కార్పొరేషన్ల ప్రక్షాళన, బిసిల్లోని ప్రత ఉపకులానికి ఓ కార్పొరేషన్ వేయటం వరకు ఓకే. కార్పొరేషన్లంటూ భర్తీ చేస్తే మళ్ళీ బోలెడు నిధులు అవసరం అవుతాయనుకోండి అది వేరే సంగతి. కానీ ఆర్ధిక అంశాలతో ముడిపడిన హామీలతోనే సమస్యలంతా. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇటువంటి హామీలివ్వటంతోనే రాష్ట్రం అప్పులు వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. జగన్ కూడా మళ్ళీ చంద్రబాబునే అనుసరిస్తున్నారంటే…..