గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత అవసాన దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఆయన్ను ప్రతిపపక్షంలో కూర్చొబెట్టారు. అది కూడా 23 సీట్లకు మాత్రమే పరిమితం చేసి మరీ ఇంటికి పంపారు. చెప్పిన పనులు చేయకపోతే ప్రజలు ఆగ్రహం ఎలా ఉంటుందో అనడానికి 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమే ఒక నిదర్శనం. సంక్షేమం అంటే చేయలేదు మరి అభివృద్ధి ఏమైనా చేశారా అంటే అదీ లేదు. కనీసం కొత్త రాజధాని అమరావతిని సగం కూడ కట్టలేదు. ఎంతసేపూ సింగపూర్ నమూనాలంటూ ఇడ్లీ పాత్రలను పోలిన నమూలాను చేతుల్లో తిప్పుతూ హంగామా మాత్రమే చేశారు. కట్టిన భవనాలు కూడ తాత్కాలిక భావనాలే. అందుకే దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఇక ప్రజెంట్ చంద్రబాబు జగన్ పాలనను అప్పుల పాలనగా అభివర్ణిస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. జగన్ ఏడాదికి 60 వేల కోట్లు అప్పులు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాగే చేస్తో పోతే ఐదేళ్ళలో 3 లక్షల కోట్లు అప్పులు చేస్తారని లెక్కలు చెబుతున్నారు. ఎంతసేపటికీ జగన్ 60 వేల కోట్లు అప్పు చేశారని అంటున్నారే తప్ప ఆ 60 వేల కోట్లను సంక్షేమానికి, నిర్వహణకు ఖర్చు చేశారని చెప్పలేకపోతున్నారు. జగన్ అప్పులు చేసిన మాట నిజం కానీ చేసిన అప్పులకు లెక్క ఉంది. కనుక అప్పుల భారం మీద పడుతోందనే భయంతో పాటే అప్పులకు లెక్కలున్నాయనే సంతృప్తి ఉంది. కానీ చంద్రబాబు హయాంలో చేసిన అప్పులకే లెక్కలు తేలడంలేదు.
చంద్రబాబు తన హయాంలో జగన్ కంటే తక్కువ అప్పులే చేశారనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. బాబుగారు తన హయాం ముగిసేలోపు 1,21,607 కోట్లు అప్పుల రూపంలో తెచ్చారు. ఇంత అప్పు ఎందుకైందని అడిగితే కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే ఖర్చు చేశామని, రాజధానికి, పోలవరానికి, ప్రాజెక్టులకు, రోడ్లు, భవనాలు నిర్మాణానికి వాడామని బుకాయించారు. అయితే జరిగిన అభివృద్ధి ఏదీ జనానికి కనబడలేదు. అమరావతి అరకొరగానే మిగిలిపోయింది. పోలవరం నత్తనడకన సాగింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ సైతం ఇదే విషయాన్ని చెబుతోంది. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులను సక్రమంగా వాడలేదని అంటోంది.
2014-15లో చేసిన 21,481 కోట్ల అప్పుల్లో 7,265 కోట్లు మాత్రమే సంపద సృష్టికి వాడారు. 2015-16లో తెచ్చిన 22,375 అప్పుల్లో 14,845 కోట్లను వాడారు, 2016-17లో చేసిన 30,769 కోట్లలో 15,708 కోట్లను మాత్రమే సంపద కల్పనకు వినియోగించారు. 2017-18 లో తెచ్చిన 28,203 కోట్లలో 16,272 కోట్ల వరకే వినియోగించగా 2018-19లో చేసిన 38,112 కోట్లలో 21,819 కోట్లను మాత్రమే వాడారు. ఇలా తెచ్చిన వాటికి వాడిన వాటికీ మధ్యన వ్యత్యాసం 45,698 కోట్లు ఉంది. మరి ఈ భారీ మొత్తం సంపద సృష్టికి కాకుండా ఎక్కడెక్కడ మళ్లించారో ఎందుకు వాడారో చంద్రబాబు లెక్కలు చెప్పలేదు. కానీ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని దుయ్యబడుతుంటారు.