జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి హైకోర్టుతో ఏదో ఒక రూపంలో పోరాటం చేస్తూనే ఉన్నారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని నేరుగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన లేఖ రాశారు. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల విచ్చినం జరుగుతున్నదేమోననే అనుమానం వ్యక్తం చేస్తూ పరిశీలన జరుపుతామని ఆదేశాలిచ్చింది. ఒకవేళ ఈ పరిశీలనలో విఛ్చిన్నం అయిందనే నివేదిక వస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపబడే అవకాశం ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. కనీసమా వాదనలు వినకుండా ఇలాంటి ఆదేశాలివ్వడం సరికాదని, తమ ఆదేశాలను రీకాల్ చేసుకోవాలని హైకోర్టును కోరారు ప్రభుత్వం తరపు న్యాయవాది. కానీ హైకోర్టు కుదరదని, సుప్రీం కోర్టుకు వెళ్ళమని సూచించింది.
దీంతో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మీద స్టే కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీం చీఫ్ జస్టిస్ హైకోర్టు ఆదేశాల మీద స్టే విధించారు. అంతేకాదు హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అసలు హైకోర్టుకు టీడీపీ నేత ఒకరు ప్రభుత్వం తమకు నిరసన తెలిపే స్వేచ్ఛను ఇవ్వట్లేదని పిటిషన్ వేయగా ఇంకొందరు మాత్రం పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తున్నారని, దాచిపెట్టినవారిని బహిరంగపెట్టాలని హెబియస్ కార్పస్ పిటిషన్లు వేశారు. హైకోర్టు అక్రమ నిర్బంధనలు తగవని డీజీపీకి చెప్పినా ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తూ హైకోర్టు మీద కూడ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అందుకోసం రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందనే పరిశీలన చేస్తామని సుయోమోటోగా ఆదేశాలిచ్చింది.
సుప్రీం కోర్టు హైకోర్టు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం తెలిపింది. కోర్టులు తమ ముందుకు వచ్చిన పిటిషన్లలోని అంశాలనే విచారించాలి తప్ప విస్తృత స్థాయికి వెళ్లిపోయి పిటిషనర్లు కోరని అంశాలను కూడ విచారిస్తామనడం, రాజ్యాంగవ్యవస్ధ విచ్ఛిన్నం పరిశీలన అనేవి ఆమోదయోగ్యంగా లేవని అన్నారు. అంటే ఇకపై ఈ విషయంలో హైకోర్టు ఎలాంటి పరిశీలనకూ పూనుకోరాదు. శీతాకాలం సెలవుల తర్వాత తదుపరి విచారణ జరిగేవరకు హైకోర్టు ఉత్తర్వులు అమలుకాబడవు. ఇది జగన్ సర్కారుకు పెద్ద రిలీఫ్. హైకోర్టు ఎక్కువగా కలుగజేసుకుని రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, వైఫల్యం అంటూ పరిశీలనకు వెళితే అది ప్రభుత్వానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంది. రేపు ఒకవేళ హైకోర్టు పరిశీలనలో విచ్ఛిన్నం జరిగిందని నివేదిక వస్తే ప్రభుత్వం రద్దయ్యే అవకాశం ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ప్రభుత్వానికైనా ఈ పరిణామం కోలుకోలేని దెబ్బ అవుతుంది.
ఒకవేళ విచారణలో సుప్రీం కోర్టు గనుక హైకోర్టు వ్యాఖ్యలను సమర్థించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. నిజంగానే రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవట్లేదా అనే అనుమానం ప్రజల్లో సైతం మొదలయ్యేది. కానీ చీఫ్ జస్టిస్ అందుకు తావివ్వలేదు. హైకోర్టు తీర్పు మీద ఆందోళన వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని ఆదుకున్నారు. మరోసారి కోర్టులు రాజ్యాంగ వ్యవస్థల విషయంలో మరీ లోతుగా కలుగజేసుకోకూడదని, రాజ్యాంగం మేరకు పిటిషన్లో ఉన్న అంశాలను మాత్రమే విచారించాలని గుర్తుచేశారు.