జాగ్రత్త..చంద్రబాబు రక్తం మరిగిపోతుంది

ఇంత వయస్సొచ్చినా చంద్రబాబునాయుడు రక్తం మరగిపోతోందంటే మామూలు విషయం కాదు. అసలు చంద్రబాబు రక్తం మరిగిపోయే పరిస్ధితి ఎందుకు వచ్చింది ? ఎందుకేంటే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు అడిగిన ప్రశ్నలే ఎవరైనా చంద్రబాబును అడిగితే రక్తం మరగక ఏమవుతుంది ? చంద్రబాబు చెబుతున్న ప్రకారం సీమాంధ్రుల ఆస్తులు, వ్యాపారాలు హైదరాబాద్ లో ఉండొచ్చు. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడైనా సరే ఉండవచ్చు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి తప్ప.

మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి. జగన్ కు లోటస్ పాండులో ఏమిపని అన్నట్లుగా ప్రశ్నించారు. తెలంగాణాలో కూర్చుని ఏపి రాజకీయాలు చేయటమేంటండి ? అంటూ ఆక్షేపించారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధులను కూడా హైదరాబాద్ లో కూర్చునే జగన్ డిసైడ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేయటమే విచిత్రంగా ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జగన్ అమరావతి పరిధిలో సొంతిల్లు కట్టుకున్నారు. చంద్రబాబుకు అది కూడా లేదు. చంద్రబాబు సొంతిల్లు ఎక్కడుందంటే హైదరాబాద్ లోనే అని ఎవరైనా చెబుతారు. ప్రతిపక్ష నేతేకేమో హైదరాబాద్ లో ఏం పని అడుతున్న పెద్ద మనిషికి సొంతిల్లు, హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీసు మాత్రం హైదరాబాద్ లోనే ఉండవచ్చు.

ఇక జగన్ ఖరారు చేస్తున్న టికెట్ల విషయాన్ని కూడా ప్రస్తావించారు. నిజానికి జగన్ ఎక్కడ కూర్చుని టికెట్లు ఖరారు చేస్తే చంద్రబాబుకు ఎందుకు ?  రేపటి ఎన్నికల్లో ఖర్మకాలి చంద్రబాబు ఓడిపోతే ఎక్కడుంటారు ? అమరావతిలోనా ? లేకపోతే హైదరాబాద్ లోనా ? అసలు హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదిలేసి ఎందుకొచ్చేశారో అందరికీ తెలుసు. జగన్ పై బురద చల్లేందుకు చంద్రబాబు ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టే అర్ధమైపోతోంది. ఎవరైనా చంద్రబాబును ఎదురు ప్రశ్నిస్తే రక్తం మరిగిపోతుందంతే.