1999 ‘అన్న టిడిపి’: హరికృష్ణ రథసారథి ఎవరో తెలుసా?

ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టి రాష్ట్రమంతా చైతన్యరథం మీద తిరుగుతున్నపుడు రథ సారధి నందమూరి హరికృష్ణ అని అందరికి తెలిసిందే. నందమూరి హరికృష్ణ *అన్నటిడిపి* పార్టీ పెట్టి  ప్రచారం చేస్తున్నపుడు ఆయన రథసారథి ఎవరు?  ఇది చదవండి

హరికృష్ణ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నపుడు తప్పనిసరిగా ప్రస్తావించాల్సిన పేరు కొడాలి నాని. నాని ఇపుడు గుడివాడ వైసిపి ఎమ్మెల్యే.  హరికృష్ణ , నాని సాన్నిహిత్యం తెలుగుదేశం ా పార్టీ తో నే మొదలయింది. అయితే, అది అత్యంత హృదయపూర్వక అనుబంధంగా మారింది. పార్టీలకు అతీతంగా కొనసాగింది. ఈ మధ్యనే హరికృష్ణ కొడాలి నానిని కలుసుకున్నారు. ఆ సమావేశం రాజకీయాలకు అతీతంగా జరిగినా, రకరకాల వూహాగానాలకు తావిచ్చింది. శిష్యుడు నాని,గురువు హరి కృష్ణని వైసిపిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని బాగా ప్రచారం అయింది. అయితే, వాళ్లిద్దరి అనుబంధం గురించి తెలిసిన వారికి అలాంటి వ్యాఖ్యానాలు రావు.  కొడాలి నాని ఎందుకు టిడిపి వెళ్లారో హరికృష్ణ కు బాగా తెలుసు. అందువల్ల పార్టీ మారినంత మాత్రాన ఆయన స్నేహితులను,ఆత్మీయులను వదులుకోలేదు. ఉదాహరణకు యార్లగడ్డ లక్ష్మీ  ప్రసాద్ చంద్రబాబును వ్యతిరేకించిన ఒక నాటి ఎంపి. ఆయన హరికృష్ణకు బాగా సన్నిహితుడు.తెలంగాణకు చెందిన మోత్కు పల్లి నరసింహులు కూడా ఆయన సన్నిహితులు. 

 

ఈ రోజు  హరికృష్ణ మరణ వార్త తో  షాక్ అయిన  కొడాలి నాని హుటాహుటినప్రమాదస్థలానికి తరలి వచ్చారు. కామినేని  ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం హైదరాబాద్‌కు భౌతికకాయాన్ని తరలించే సమయంలోనూ జూనియర్  ఎన్టీఆర్ వెంటే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఓదార్చారు. హరికృష్ణ భౌతికకాయాన్ని అంబులెన్స్ నుంచి కిందికి దించడంలో ఒక చేయి వేశారు. హరికృష్ణ అకాల మరణం దిగ్భ్రాంతి నుంచి కోలుకున్నట్లు లేరు. ‘నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి హరికృష్ణ‘ అని ఆయన ఆవేదనతో చెప్పారు.  ’కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా  నన్ను నియమించింది ఆయనే.  హరికృష్ణ లేకపోతే, నాకు  రాజకీయ జీవితమే లేదు,’  కొడాలి నాని చెప్పారు.

ఇక్కడ ఇంకొక ముఖ్యమయిన విషయం కూడా ఉంది. 1999లో హరికృష్ణ ‘అన్నటిడిపి’ పార్టీ స్థాపించారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాల్గొన్నాారు. తన పార్టీ అభ్యర్థుల ప్రచారం కూడా చేశారు. పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందనేది వేరేవిషయం .అయితే, అపుడు హరికృష్ణ వాహనం నడిపిందెవరనుకున్నారు, కొడాలి నానియే.

ఈ అనుబంధం వల్లే ఈ రోజు గుడివాడ వైసిపి హరికృష్ణకు ఘనంగా నివాళులర్పించింది.