ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం తీవ్రస్థాయిలో వేడెక్కుతుంది. వైసీపీ, టీడీపీ ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల ఓట్లు గంతగుప్పగా తమకు పడాలనే ప్రయత్నం చంద్రబాబు చేశారని.. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో అవి నిట్టనిలువుగా చీలాయనే చర్చ పవన్ ఫ్యాన్స్ లో నడుస్తుందని అంటున్నారు. అందుకు రెండు కారణాలు చెబుతున్నారు!
అందులో ఒకటి.. “జనసేనకు కేవలం 24 సీట్లు ఇచ్చి.. వారి ఓట్లు మిగిలిన 151 స్థానాల్లోనూ పొందాలనే ఆలోచనకు జనసైనికులు పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేయడం” కాగా… “తాడేపల్లిగూడేంలోని “జెండా” సభలో కాపులను కించపరుస్తూ పవన్ చేసిన ప్రసంగం మరొకటని” అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఇక టీడీపీకి ఒరిజినల్ వారసుడు అని చెప్పే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఓట్ల పరిస్థితి ఇప్పుడు ఏమిటి అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.
గతకొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు టీడీపీ శ్రేణుల నుంచి ఎదురవుతున్న అవమానాలు, చీత్కారాల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఇటీవల కాలంలో టీడీపీకి సంబంధించిన ఆల్ మోస్ట్ అన్ని బహిరంగ సభల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై అటు చంద్రబాబు, ఇటు చినబాబు సూచనల మేరకు వారి వారి కార్యకర్తలు ఫైరవుతూనే ఉన్నారు. వారిని ఈడ్చి పాడేయండని బాబు ఆజ్ఞాపించగా… టీడీపీ కార్యకర్తలు జూనియర్ అభిమానులపైకి దూకుతున్నారు!
ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో వారికి పరోక్షంగా ఒక విలువైన సూచన చేశారు కొడాలి నాని. ఇందులో భాగంగా… 2009 ఎన్నికల ప్రచారంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన జూనియర్.. తన తాతపెట్టిన పార్టీకోసం ఎంతో కష్టపడి పనిచేశారని అన్నారు. అయితే… ఆయన్ని చంద్రబాబు తొక్కేశారని కొడాలి నాని ఆరోపించారు. జూనియర్ పై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఇదే సమయంలో సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంతా కలిసి చంద్రబాబుని గొయ్యి తీసి పాతిపెట్టాలని.. అప్పుడే టీడీపీ బ్రతికి బట్టకడుతుందని కొడాలి నాని వారి వారి అభిమానులకు సూచించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మేలుకోరి ఆయన అభిమానులంతా కలిసి ఈ ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించాలని పిలుపునిచ్చారు. దీంతో… కొడాలి సూచనలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ మేరకు సానుకూలంగా తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.