ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. జూనియర్ ఎన్టీయార్ అభిమానులు తమ అభిమాన నటుడి ఫొటోతో కూడిన జెండాల్ని తెలుగు దేశం పార్టీ మీటింగుల్లో ఎగరేస్తున్నారు. ‘జై ఎన్టీయార్’ అంటున్నారు, ‘సీఎం ఎన్టీయార్’ అని కూడా నినదిస్తున్నారు. దాంతో, టీడీపీ శ్రేణులకు ఒళ్ళు మండిపోతోంది.
ఈ మొత్తం వ్యవహారం జూనియర్ ఎన్టీయార్ కనుసన్నల్లోనే జరుగుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కానీ, జూనియర్ ఎన్టీయార్ ప్రస్తుతం రాజకీయాలకు పోవడంలేదు. తన సినిమాల పనుల్లో బిజీగా వున్నాడాయన.
కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్.. ఇద్దరూ రాజకీయాలు మాట్లాడటానికి అస్సలు ఇష్టపడటం లేదు. దాన్ని అలుసుగా తీసుకుని కొందరు రాజకీయ నాయకులు, జూనియర్ ఎన్టీయార్ పేరుని అడ్డగోలుగా వాడేస్తున్నారు.
జూనియర్ ఎన్టీయార్‌ని రాజకీయంగా తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళతో.. నిత్యం ఏదో ఒక రచ్చ జరుగుతూనే వుంది. టీడీపీ ఓడితే, జూనియర్ ఎన్టీయార్ చేతికి ఆ పార్టీ వస్తుందని తాజాగా వైసీపీ నేత కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంకోపక్క ‘రా ఎన్టీయార్’ పేరుతో అభిమానులు కొందరు, సేవా కార్యక్రమాలంటూ రాజకీయాలు మొదలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారాలపై జూనియర్ ఎన్టీయార్ సీరియస్ అయ్యాడని తెలుస్తోంది. రేపో మాపో, జూనియర్ ఎన్టీయార్ నుంచి ఓ కీలక ప్రకటన రాబోతోందని సమాచారం.
రాజకీయాల్లోకి తనను లాగొద్దనే సీరియస్ వార్నింగ్‌ని జూనియర్ ఎన్టీయార్ అందరికీ గంపగుత్తగా ఇచ్చేయబోతున్నాడట.