గమనించారా… వైసీపీలో పెరుగుతున్న జూనియర్ బలం!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో జూనియర్ ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలయ్య హుకుం జారీ చేయడం చర్చనీయాంశం అయ్యింది. దీంతో… మరోసారి జూనియర్ బలంపై చర్చ మొదలైంది.

వాస్తవానికి నందమూరి వారసుల్లో అత్యంత బలమైన క్రౌండ్ పుల్లర్ గా, వక్తగా, జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న పేరు మరొకరికి లేదన్నా అతిశయోక్తి కాదేమో. ఇక ఆర్.ఆర్.ఆర్. సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఆయన ఫ్లెక్సీలను కుటుంబ సభ్యులు అనబడేవారే తొలగించాలని కోరడంపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి. ఈ సమయంలో జూనియర్ అభిమానులతో పాటు న్యూట్రల్ గా ఉండే సినీ అభిమానులు, సామాన్య ప్రజానికం సైతం ఈ విషయంలో బాలయ్య తీరును తప్పుపట్టాయి.

ఆఫ్ ద రికార్డ్… చంద్రబాబు కూడా బాలయ్య తీరుపై అసహనం వ్యక్తం చేశారని కథనాలొస్తున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో ప్రతీ ఓటూ అత్యంత కీలకం అని భావిస్తున్న తరుణంలో… ఇలాంటి చేష్టల వల్ల ఎవరి ఉపయోగం అని ప్రశ్నించినట్లు ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ సమయంలో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఫలితంగా.. ఇది టీడీపీకి ఓటు బ్యాంక్ రాజకీయాల్లో క్లిష్ట సమస్యగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సమయంలో… అధికార వైసీపీలో జూనియర్ ఎన్టీఆర్ అనుచరుల సంఖ్య పెరుగుతుందనే చర్చ మొదలైంది. దీంతో వారు ఎవరెవరు అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

హరికృష్ణ కుటుంబానికి కొడాలి నాని వీరవిధేయుడనేది తెలిసిన విషయమే. అసలు టీడీపీలో కొడాలి నానికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందే జూనియర్ ఎన్టీఆర్ అని అంటుంటారు. అలాంటి కొడాలి నాని టీడీపీ వ్యతిరేక పార్టీ అయిన వైసీపీలో చేరి అందరికి షాక్ ఇచ్చారు. ఈ సమయంలో ఎన్టీఆర్ అనుమతి, అంగీకారంతోనే కొడాలి నాని వైసీపీలోకి వెళ్లారనే చర్చ అప్పట్లో బలంగా నడించింది.

ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మరో అనుచరుడైన వల్లభనేని వంశీ సైతం టీడీపీకి గట్టి షాకే ఇచ్చారని చెప్పాలి. 2019 ఎన్నికల్లో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. జగన్ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. ఇలా ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇద్దరు బలమైన నేతలు, జూనియర్ అనుచరులుగా పేరున్న నాయకులు ఫ్యాన్ కిందకు చేరిపోయారు. వీరిద్దరూ జూనియర్ అనుమతి, అంగీకారం లేకుండా వైసీపీలో చేరారంటే చాలామంది ఇప్పటికీ అంగీకరించరు.

తాజాగా ఎన్టీఆర్‌ కు ఇష్టమైన వ్యక్తుల్లో ఒకరు, ఎన్టీఆర్ కి బ్లాక్ బాస్టర్ రుచి చూపించిన దర్శకుడు వివి. వినాయక్ సైతం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు! ఇందులో భాగంగా ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తుంది. అన్నీ అనుకూలంగా జరిగితే రాజమండ్రి ఎంపీగా ఆయన బరిలో దిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో రాజమండ్రిలో ఆయనకు జూనియర్ ఫ్యాన్స్ నుంచి భారీ మద్దతు లభించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.

దీంతో… జూనియర్ అనుచరులు, స్నేహితులు, సన్నిహితులు అంతా వైసీపీ గూటికి చేరుతున్నారనే చర్చ మొదలైంది. దీనివెనుక తారక్ అనుమతి, అంగీకరాం, మద్దతు కూడా ఉందనే చర్చ బలంగా నడుస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదే నిజమైతే… టీడీపీకి పెద్ద డ్యామేజీ జరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. కాగా… జూనియర్ ఎన్ టీఆర్ సొంతమామ నార్నే శ్రీనివాసరావు గత ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన సంగతి తెలిసిందే.