అవినీతి వద్దంటే ఎమ్మెల్యేల సంగతి ఏంటి జగనన్న?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా ప్రస్తావిస్తున్న ఒక అంశం అవినీతి. జగన్ చెప్తున్న ప్రధాన అంశం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని అవినీతిని అన్ని స్థాయిలలో బయటకు తీసి దోషులను శిక్షిస్తామని చెబుతున్నారు.

ఆ దిశగా జగన్ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రధాన కర్తవ్యం సాగునీటి ప్రాజెక్టులలో జరిగిన అవినీతిని బయట పెట్టడం. ఆ కమిటీకి జగన్ విశేష అధికారాలు కట్టబెట్టారు. ఆ కమిటీ ముందుగా పోలవరం ఆ తర్వాత హంద్రీనీవా కేసీ కెనాల్ ప్రాజెక్ట్ లలో జరిగిన అవినీతిని బయటకు తీయాలని జగన్ ఆదేశించారు. అలాగే ఆయా ప్రాజెక్టుల లో పెండింగ్లో ఉన్న అనేక పనులకు రివర్స్ టెండర్లు ఎంత మేరకు సాధ్యము పరిశీలించాలని జగన్ కోరారు.

ఇందుకు ప్రధానమైన కారణం గత తొమ్మిది సంవత్సరాలుగా జగన్ అసెంబ్లీ లోపల గాని బయటగాని ఏ విషయం ప్రస్తావించిన  తెలుగు దేశం నుండి  ఒకటే సమాధానం వచ్చేది. జగన్ ఒక పెద్ద అవినీతి పరుడు జగన్ ఒక ఆర్ధిక తీవ్రవాది అనే ఎదురు దాడితో జగన్ ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చాలా వరకు డిఫెన్స్ లో పడేశారు. అందుకే జగన్ పూర్తిగా తనమీద పడిన అవినీతి మరకలు తన ప్రభుత్వ పనితీరుతో చెరిపేయాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే అటు అధికారులకు ఇటు పార్టీ ఎమ్మెల్యేలకు నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు

పనిలో పనిగా మొదటి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లో జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు అవినీతికి దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్నికల సమయంలో లో వారికి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు పార్టీ అందించింది అటువంటప్పుడు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడవలసిన అవసరం ఏముంది అనేది జగన్ వెర్షన్. అయితే ఎమ్మెల్యేలు పార్టీ నాయకుల ఆలోచనలు మరో విధంగా ఉంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి దాదాపు తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది. ఈ కాలం మొత్తం పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించింది. ఆ సమయంలో అటు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ నుండి ఇటు చంద్రబాబు గవర్నమెంట్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సహాయనిరాకరణ ఎదురైంది. ఆ సమయంలో లో పార్టీ ఎమ్మెల్యేలు మరియు నాయకులు కార్యకర్తలు తన జేబులో నుండి పెద్ద మొత్తంలో చేశారు. పార్టీ పటిష్టతకు పార్టీ కార్యక్రమాలకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు.

2019 ఎన్నికల్లో ఖర్చు చేసింది పార్టీ ఇచ్చినప్పటికీ గడిచిన 9 సంవత్సరాలలో ఖర్చు చేసిన మొత్తం ఎలా తిరిగి వస్తుంది అనేది ప్రశ్న. జగన్ ఇది కేవలం పబ్లిసిటీ కోసమే మాట్లాడుతున్నారు అని కొందరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ చొరవతో సిమెంట్ ఫ్యాక్టరీ లు ఉన్న ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ ఓనర్ లని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి విషయాల్లో జగన్ తన ఎమ్మెల్యేల ని కట్టడి చేసి అవినీతి విషయంలో  తన సీరియస్గా ఉన్నట్టు ఒక స్పష్టమైన సందేశం సంకేతం పార్టీకి పార్టీ శ్రేణులు కి పంపాలి. 

ఇది కాకుండా అనేక నియోజకవర్గాల్లో డీఎస్పీ స్థాయి అధికారులు ఆర్డిఓ స్థాయి అధికారులు ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వానికి మంచి పేరైనా చెడ్డ పేరైనా వచ్చేది మండల స్థాయి నియోజకవర్గ స్థాయి అధికారుల పనితీరుతోనే. ఈ పోస్టింగ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనుకూలమైన అధికారులను పోస్టింగ్ వేసుకుని ప్రత్యర్థి పార్టీల మీద, కార్యకర్తల మీద కక్షసాధింపునకు పాల్పడితే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి ఎంతో కాలం పట్టదు. తెలుగుదేశం పార్టీ మరీ ఘోరమైన ఓటమిని అవి చూడడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులు తెలుగుదేశం ఆఫీసు లాగా పని చేయడం వల్ల సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఓటు వినియోగించారు

ఆ పరిస్థితి రాకుండా ఉండాలన్నా, జగన్ తన కోరుకున్న అవినీతిరహిత పాలన కొనసాగించాలన్న కిందిస్థాయి పోస్టింగు లే ముఖ్యం. వాటిలో రాజకీయ జోక్యం లేకుండా సమర్ధతకు పెద్ద పీట వేసి సమర్ధులైన అధికారులని నియమిస్తే తప్ప జగన్ పాలన గత పాలన కంటే ఏమీ భిన్నంగా ఉండదు.