శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో చిక్కుకున్న 53 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంశధార నదిలో నీరు చేరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గొట్టా బ్యారేజి నుంచి అధికారులు రాత్రి నీటి విడుదల చేశారు. దీనిని గమనించకుండా పురుషోత్తపురం రేవు ఇసుక ర్యాంపు వద్ద కూలీలు, 20 లారీలు ఇసుకను తోడేందుకు నదిలోకి వెళ్లాయి. నీటి ప్రవాహానికి వారు నదిలో చిక్కుకుపోయారు. ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వటంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది ముందుగా 24 మంది కూలీలను ఆ తర్వాత మిగతా వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. వర్షాకాలం సందర్భంగా నదుల్లోకి వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు మత్స్యకారులకు సూచించారు. బాధితులను క్షేమంగా ఒడ్డుకు చేర్చిన అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా పశువల్లంక వద్ద గల్లంతయిన చిన్నారుల కోసం గాలింపు కొనసాగుతుంది.