ముగ్గురు మంత్రులకు షాక్… శ్రీకాకుళం ఎస్సీ, బీసీ టిక్కెట్లు జనసేనకు?

గత కొన్ని రోజులుగా “రా.. కదలిరా” బహిరంగ సభలతో బిజీగా గడిపిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రస్తుతం ఆ కార్యక్రమానికి చిన్నపాటి విరామం ఇచ్చారు. ఈ సమయంలో… పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాట్లు, ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక మొదలైన విషయాలపై దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఈ సమయంలో టీడీపీకి బలమైన జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు మాజీమంత్రులకు ఈదఫా టిక్కెట్లు దక్కవనే చర్చ తెరపైకి వచ్చింది.

వాస్తవానికి పొత్తులో భాగంగా సీట్ల సర్ధుబాటు అనేది ఇప్పుడు చంద్రబాబు మీద ఉన్న పెను సవాలనే చెప్పాలి. పైగా… నిజంగా 50 – 60 సీట్లవరకూ జనసేన పట్టుబడితే కచ్చితంగా ఆ వ్యవహారం టీడీపీకి అతిపెద్ద క్లిష్ట సమస్య అనే భావించాలి. ఈ సమయంలో చాలామంది కీలక నేతలు, సీనియర్లు సైతం ఈదఫా త్యాగాలు చేయడం తప్పదని తెలుస్తున్న నేపథ్యంలో… ఒకే జిల్లా నుంచి ముగ్గురు మాజీ మంత్రులకు ఎఫెక్ట్ పడనుందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా… కిమిడి కళా వెంకట్రావు పేరు ప్రముఖంగా తెరపైకి వస్తుంది. మాజీమంత్రి, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు, టీడీపీకి విధేయుడు అనే పేరున్న ఈయనకు ఈ దఫా టిక్కెట్ దక్కకపోవచ్చని తెలుస్తుంది. వాస్తవానికి ఈసారి ఎచ్చర్ల టిక్కెట్టు తనకు కానీ, తన కుమారుడికి కానీ ఇవ్వాలని కళా కోరుతున్నారు. అయితే.. ఈ సీటు ఈదఫా పొత్తులో భాగంగా జనసేన ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో ఎచ్చర్ల నుంచి పోటీచేసిన కళావెంకట్రావు 4,741 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిగా గెలవగా.. 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 52.3%, టీడీపీకి 42.4% ఓట్లు రాగా… జనసేనకు 2.7% (5,068) ఓట్లు పోలయ్యాయి.

ఇదే సమయంలో మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహనరావుకు కూడా ఈసారి టిక్కెట్ దక్కదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్న ఈయన రాజాం అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ కూడా ఇదే సీటును కోరుతున్నారని తెలుస్తుంది. దీంతో… మధ్యేమార్గంగా అన్నట్లుగా జనసేనకు ఈ సీటు ఇస్తారని అంటున్నారు.

ఈ రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో 2014, 2019లో వరుసగా వైసీపీ గెలుస్తూ వచ్చింది. ఈ క్రమంలో 2014లో 47.0% ఓట్లు సాధించిన ఆ పార్టీ… 2019కి వచ్చేసరికి 52.6% ఓట్ షేర్ సాధించింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో వైసీపీకి 83,561 (52.6%) ఓట్లు, టీడీపీకి 66,713 (42.0%) ఓట్లు రాగా… జనసేనకు 4,987 (3.1%) ఓట్లు పోలయ్యాయి!!

ఇదే క్రమంలో… పలాస సీటు నుంచి మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ ఫ్యామిలీ నుంచి చేజారనుందనే ప్రచారం ఉంది. ఈ సీటులో 2009, 2014లలో పోటీచేసిన ఆయన… 2009లో ఓటమిపాలైనా.. 2014లో 12.8% ఓట్ల మెజారిటీతో భారీ విక్టరీ సాధించారు. అనంతరం 2019లో ఆయన రాజకీయ వారసురాలిగా గౌతు శిరీష పోటీ చేసి సిదిరి అప్పలరాజు చేతిలో ఓటమి చవిచూశారు.

ఈ క్రమంలో 2024లోనూ ఆమె పోటీకి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈదఫా ఈ టిక్కెట్ టీడీపీకే ఇవ్వాలని తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. అయితే… ఈ స్థానం కూడా జనసేనకే కేటాయిస్తున్నారని తెలుస్తుంది. దీంతో… ముగ్గురు మాజీ మంత్రులకూ ఈ దఫా టిక్కెట్స్ దక్కే అవకాశం లేదని అంటున్నారు. మరోపక్క ఎస్సీ, బీసీల సీట్లు జనసేనకు కేటాయించడంపై తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారని.. ఇది వైసీపీకి బలం చేకూర్చే విషయమని వాపోతున్నారని తెలుస్తుంది!!