కాశీబుగ్గలో భక్తి కన్నీటి సముద్రం.. భయంకర తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి..!

శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని కాశీబుగ్గ గ్రామం.. చిన్న తిరుపతి గా పేరుగాంచిన ఈ పవిత్ర స్థలం శనివారం భయంకర విషాదాన్ని చూసింది. కార్తీక మాసం, ఏకాదశి పర్వదినం కావడంతో తెల్లవారుజామున నుంచే వేలాదిగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తరలివచ్చారు. భక్తుల ఉత్సాహం, ఆధ్యాత్మికతతో నిండిన ఈ పవిత్ర వేళలో.. ఒక అచేతన క్షణంలో ఆ భక్తి ఆనందం ప్రాణాలను బలిగొన్న దారుణ దృశ్యంగా మారిపోయింది.

ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య అకస్మాత్తుగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. చిన్న ఆలయ ప్రాంగణంలో క్యూలైన్‌లు అల్లకల్లోలమయ్యాయి. కొద్దిసేపట్లోనే నియంత్రణ తప్పి తొక్కిసలాట చోటుచేసుకుంది. అరుపులు, కేకలతో ఒక్కసారిగా ఆ ప్రాంతం గందరగోళానికి గురైంది. స్వామి దర్శనం కోసం క్యూలో నిలబడ్డ భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలతో నేలకొరిగారు. గాయపడిన వారిని వెంటనే పలాస ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.

ఘటన తెలిసిన వెంటనే కాశీబుగ్గ పోలీసులు, స్థానిక స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్యూలైన్‌లలో చిక్కుకున్న భక్తులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు సాగాయి. ఆలయ పరిసరాల్లో భయం, ఆర్తనాదం, రోదనలు చోటుచేసుకున్నాయి. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు కన్నీరు మున్నీరై విలపించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తమ బంధువుల వివరాల కోసం ఆలయానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. పోలీసులు ఆలయ పరిసరాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించలేదు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు.

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ దుర్ఘటనపై సమగ్ర నివేదిక కోరారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. విశాఖపట్నం నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కూడా బయలుదేరింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులు ప్రజలను శాంతంగా ఉండాలని, తమ బంధువుల గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఉపయోగించాలని సూచించారు. కార్తీక మాసపు పవిత్రత మధ్య ఈ దుర్ఘటన భక్తి సముద్రాన్ని విషాద సముద్రంగా మార్చేసింది. ప్రతి ఏటా వేలాదిగా జరిగే దర్శన యాత్ర ఈసారి భయానక స్మృతులను మిగిల్చింది. ఆలయ పరిసరాల్లో ఇంకా భయం, రోదనల వాతావరణం అలముకున్నది.