ఎన్టీఆర్ బయోపిక్ లో వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ ..!?

 

ఇప్పుడు బయోపిక్ ల మీద తెలుగు సినిమా పరిగెడుతుందని చెప్పవచ్చు . మహానటి సావిత్రి జీవిత కథతో నాగ్ అశ్విన్ రూపొందించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది . ఒకప్పుడు తెలుగు తమిళ రంగాల్లో సావిత్రి మహానటిగా వెలిగిపోయింది . నాటకాలు వేసుకొనే ఓ పల్లెటూరు అమ్మాయి మద్రాస్ సినిమాలో కాలుపెట్టి ఊహించని విధంగా తారాపథానికి చేరడం అన్నది మామూలు విషయం కాదు . అయితే ఆ జిలుగు వెలుగుల వెనుక చీకటి పరుచుకొని ఉంటుందని సావిత్రి ఆలస్యంగా తెలుసుకుంది . కానీ అప్పటికే ఆమె బతుకు తెల్లారిపోయింది .

 

1981లో సావిత్రి చనిపోయింది . 37 సంవత్సరాల తరువాత సావిత్రి జీవితం మీద తీసిన సినిమాను ఆదరించారంటే ఆమె నిజంగా ఆమె మహా నటే ఈ సినిమా స్పూర్తితో వైఎస్సార్ జీవిత కథతో యాత్ర సినిమా సిద్దమవుతుంది . డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ నటుడు మమ్ముట్టి పోషిస్తున్నాడు . ఇక నందమూరి తారక రామా రావు జీవిత చరిత్రతో ఆయన కుమారుడు నిర్మిస్తున్న చిత్రం “ఎన్టీఆర్ “. ఈ చిత్రంలో రామారావు పాత్రను బాలకృష్ణ ధరిస్తున్నాడు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది .

మొదట ఈ సినిమాకు దర్శకుడు తేజను నియమించారు . ముహూర్తం కూడా భారీగా జరిగింది . రెగ్యులర్ షూటింగ్ జరగడానికి ముందు తేజ ఈ సినిమా చెయ్యలేను అని చెప్పి తప్పుకున్నాడు . ఆ తరువాత పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి . చివరిగా క్రిష్ ను ఎంపిక చేశారు . క్రిష్ , బాలయ్య కలసి చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం విజయం సాధించింది . ఈ నమ్మకంతోనే క్రిష్ ను బాలయ్య ఎంపిక చేశాడట .
తేజను దర్శకుడుగా అనుకున్నప్పుడు స్క్రిప్టును ఫైనలైజ్ చేశారు . 1982 నుంచి 1989 వరకు అనుకున్నారట . 1990లో తెలుగు దేశం అధికారాన్ని కోల్పోయింది . 1993లో రామారావు లక్ష్మి పార్వతిని వివాహం చేసుకున్నారు . అందుచేత 1989 వరకు రామారావు అధికారం లో వున్నప్పటి దాకా చూపిస్తే సరిపోతుందని అనుకున్నారట . అందుకే లక్ష్మి పార్వతి పాత్రవుండదని ప్రకటించారు .

అయితే క్రిష్ దర్శకుడు అయిన తరువాత స్క్రిప్టులో మార్పులు ,చేర్పులు చోటు చేసుకున్నాయట . మహానటుడు, నాయకుడు ఎన్టీ రామారావు 1996లో చనిపోయాడు . అంటే రామారావు చనిపోయి 22 సంవత్సరాలు అవుతుంది . చాలామంది స్మృతి పథం నుంచి ఎన్టీఆర్ బొమ్మ చెరిగిపోలేదు . కాబట్టి ఈ సినిమా చేయడం సాహసమనే చెప్పవచ్చు . క్రిష్ రామారావు జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలను చుపించాలను కుంటున్నట్టు తెలిసింది . ఇందుకు బాలయ్యను కూడా ఒప్పించాడట .

 

1995 ఆగష్టు 23న రామారావును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా , ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు . అప్పుడు రామారావు గెలిపించుకున్న శాసన సభ్యులను హైదరాబాద్ వైస్రాయి హోటల్ లో ఉంచారు . తన సహచరులను కలుసుకోడానికి రామారావు చైతన్య రథం పై వైస్రాయ్ వెళ్ళాడు . అప్పుడు రామారావు మీద చెప్పులను వేయించారు . ఈ ఘటన రామారావును మానసికంగా బాగా దెబ్బ తీసింది . అలా చెప్పులు వేయించింది చంద్ర బాబేనని అప్పట్లో చెప్పుకున్నారు . ఇది చాలా ముఖ్యమైన ఘట్టం . ఇది పెట్టాలా ? వద్దా ..! అనే మీమాంసలో ఉన్నారట. . ఈ విషయంలో బాలయ్యదే తుది నిర్ణయమని దర్శకుడు క్రిష్ చెప్పాడట.! ఒకవైపు తండ్రి మరోవైపు బావ మరియు వియ్యంకుడు .. ఏంచేస్తాడో బాలయ్య ?**