‘యాక్షన్ కవచధర’ సప్తగిరి – ట్రైలర్ రివ్యూ!

 

        రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తూంటాడు. కొండ పరిసరాల్లో వూరు మసగ్గా కన్పిస్తూంటుంది. ఒక వాయిస్ పలుకుతుంది – “నువ్వెళ్ళే దారి చావు బతుకుల మధ్యలో వుంటుంది. ఈ వూళ్ళో వుండేవాళ్ళు గుడిలోకి వెళ్లరు. నువ్వు లోపలికి వెళ్ళాలంటే అక్కడున్న వాళ్ళందరికీ నీ మీద నమ్మకం కలగాలి. జనం భయంలో దెయ్యాన్ని, పూనకంలో దేవుణ్ణి చూస్తారు. నువ్వేసే వేషం కూడా అలాటిదై వుండాలి” అని.

      దీంతో కాషాయ వేషంలో స్వామీజీలా స్వాముల గుంపుతో సప్తగిరి ఎంటరవుతాడు. మాయ మంత్రాలతో కామెడీగా జనాల్ని నమ్మిస్తాడు. వెంటనే యాక్షన్ సీన్లో దుండగులతో ఫైటింగ్ మొదలెడతాడు. ఒక వజ్రం చేతిలో పెట్టుకున్న ఫ్రెండ్ “దీని ఖరీదు 150 కోట్లు” అంటాడు. విలన్ కన్పిస్తాడు. ఆ వజ్రం తనక్కావాలంటాడు. మళ్ళీ ఫైట్…ఇలా కథ చెప్పేశారు ట్రైలర్ లో. గోవిందా అనే దొంగ వజ్రం కోసం స్వామీజీ వేషంలో, విలన్ తో ఎత్తుకుపైఎత్తుల కథలా వుంది.

      ట్రైలర్ లో సప్తగిరిని యాక్షన్ హీరోగా చూపించి ఆకట్టుకోవాలన్న ప్రయత్నమే ఎక్కువుంది. రెండు నిమిషాల ట్రైలర్ లో ఆరుసార్లు ఫైట్లు వేశారు. కామెడీకి ప్రాధాన్యాన్నివ్వలేదు. ఫైట్స్ లో కూడా కామెడీ కన్పించడం లేదు. ఈ మూవీ యాక్షన్ కామెడీనా, లేక సీరియస్ యాక్షనా అన్న అంచనా ప్రేక్షకులకి అందకుండా చేశారు. ఇది ఈ ప్రమోషనల్ ట్రైలర్ లో పెద్ద లోపం. పెద్ద స్టార్లే యాక్షన్ కామెడీలతో అలరిస్తున్నప్పుడు సప్తగిరి హీరోగా ఎదగాలని సీరియస్ యాక్షన్ చేయలేదని ఆశిద్దాం.

       ఈ సీరియస్ యాక్షన్ ప్రధానంగా వున్న ట్రైలర్ లో, కామెడీతో బాటు రోమాన్స్ కి కూడా చోటు కల్పించలేదు. హీరోయిన్ వైభవీ జోషిని చూపించారు గానీ, ఆమె ఎవేగా సప్తగిరి చేస్తున్న ఫైట్స్ ని ఆందోళనగా చూస్తున్న షాట్స్ మాత్రమే వేశారు. మ్యూట్ లో సప్తగిరి లేకుండా ఆమెతో ఒక సాంగ్ బిట్ వేశారు, అంతే. ట్రైలర్లో రొటీన్ కథ చెప్పేసి ఫైట్స్ చూపించడం తప్ప ఏ క్రియేటివిటీ లేదు. కాకపోతే ఆ వజ్రం కథేమిటి, ఎందుకోసం సప్తగిరి ప్రయత్నిస్తున్నాడన్నది టికెట్లు తెగడం కోసం సస్పెన్స్ లో పెట్టారు.

       
      ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’, ‘సప్త గిరి ఎల్ ఎల్ బీ’ల తర్వాత హీరోగా సప్తగిరి మూడో మూవీ ఇది. అరుణ్ పవార్ దర్శకుడు. ఇతనే సప్తగిరితో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ తీశాడు. అది ఏవరేజీగా ఆడింది. ఈసారి ఏవరెజీని దాటాలి. రొటీన్ గా వున్నా వజ్రం కథకి ఎంత బాగా, ఎంటర్ టైనింగ్ గా ట్రీట్ మెంట్ చేశాడన్న దాని ఆధారపడుతుంది.

       సప్తగిరితో బాటు, వైభవీ జోషీ, అర్చనా వేద, శ్రీనివాస రెడ్డి, సత్య, సత్యం రాజేష్, వేణులు నటించారు. సంగీతం విజయ్ బుల్గానిన్, ఛాయాగ్రహణం ప్రవీణ్ వనమాలి. బ్యానర్ శివ శివం ఫిలిమ్స్, నిర్మాతలు ఇ. నరేంద్ర, జివిఎన్ రెడ్డి.

      “ఇదే లాస్ట్ సిగరెట్, ఇదే లాస్ట్ పెగ్ అన్న మగాడి మాట, ఇదే లాస్ట్ షాపింగ్ అన్న ఆడవాళ్ళ మాట జనాలు నమ్మినట్టు చరిత్రలో లేదు” – ట్రైలర్ ముగింపులో సప్తగిరి డైలాగ్. సప్తగిరిని మాత్రం జనాలు నమ్ముతున్నారు తనలోని కమెడియన్ని మర్చిపోడని. ‘వజ్ర కవచధర గోవింద’ జూన్ 14 న విడుదల.

―సికిందర్