ఎన్టీఆర్ గుబురు గ‌డ్డం వెనుక..ఇంత క‌థ ఉందా?!


త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన అర‌వింద స‌మేత వీర రాఘ‌వలో దాదాపు క్లీన్ షేవ్‌తో క‌నిపించారు ఎన్టీఆర్‌. కానీ మొన్న ఆదివారం జరిగిన ఆర్‌.ఆర్‌.ఆర్ లాంచింగ్ సమయంలో మాత్రం… గుబురు గ‌డ్డంతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. అరే మొన్నే కదా గెడ్డం లేకుండా చూసాం..అప్పుడే ఇంత ఎప్పుడు పెంచేసావ్ బాస్ ..అని ఆయనతో చనువున్న వాళ్ళు అడుగుతుంటే ఆయన సరదాగా ఓ నవ్వు నవ్వేస్తున్నారు.

కానీ నిజానికి దాదాపు రెండు నెల‌ల నుంచీ ఎన్టీఆర్ గెడ్డం పెంచే ప‌నిలో ఉన్నాడనే విషయం తెలియదు చాలా మందికి. అయితే హఠాత్తుగా గెడ్డం పెంచటం మాత్రం త్వరలో ప్రారంభమయ్యే .. `ఆర్‌.ఆర్‌.ఆర్`లోని త‌న పాత్ర కోస‌మే అని తెలిసింది. ఈ గెడ్డం ఇలాగే పెంచుతాడట. ఇప్పుడు మనం చేసే గెడ్డం కన్నా ..ఎక్కువ గుబురు గ‌డ్డంతో ఎన్టీఆర్ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నాడని సమాచారం.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం…ఎన్టీఆర్ ఇందులో ఓ ఘ‌రానా దొంగ. అత‌ని పాత్ర అట‌వీ నేప‌థ్యంలో సాగుతుంది. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎన్టీఆర్ ఓ అడ‌వి మ‌నిషి గా కనిపించబోతున్నారు. అంటే అడవి దొంగ క్యారక్టరైజేషన్ అన్నమాట. అయితే అడవి మనిషి అనగానే… ఆ మాత్రం గెడ్డం ఉండాలి క‌దా? అంటున్నారు.

 

ఇక ఎన్టీఆర్ పాత్రే కాదు.. ఆయన మాట్లాడే మాట‌లు కూడా కాస్త చిత్రంగా ఉండ‌బోతున్నాయి. ఎన్టీఆర్‌, అత‌ని చుట్టూ ఉన్న కొన్ని పాత్ర‌లు అట‌వీ భాష మాట్లాడ‌తాయని, అందుకోసం ప్ర‌త్యేకంగా ఓ భాష‌ని కూడా పుట్టిస్తున్నార‌ని వినిపిస్తోంది.

వింటానికి అంతా బాగానే ఉంటుంది. ఇందుకోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడాలి. ఎన్టీఆర్ అదే పనిలో ఉన్నారు. త‌న పాత్ర కోసం ఎన్టీఆర్ రాత్రింబవళ్లూ ప్ర‌త్యేక క‌స‌ర‌త్తులు చేస్తూ కష్టపడుతున్నాడు. అవును..ఆయన ఇందుకోసం ఓ ట్రైన‌ర్‌ని కూడా నియ‌మించుకున్నాడు. ` `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లోనూ ఎన్టీఆర్ తన సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నారు.

ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కార్కీ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రమా రాజమౌళి, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్, వి.ఎఫ్‌.ఎక్స్‌ సూపర్‌వైజర్‌: శ్రీనివాస్‌ మోహన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్, ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.పార్వతి.