సప్తగిరి ధైర్యానికి చెప్పుకోవాలి..లేకపోతే మళ్లీ ఇదేంటి?

కమిడియన్ నుంచి హీరోగా మారిన వారిలో సప్తగిరి ఒకరు. సప్తగిరిలో మంచి హీరో ఉన్నాడో లేడో కానీ మంచి నటుడు మాత్రం ఉన్నాడు. కానీ ఈ మధ్యన ఆయనకు వేషాలు తగ్గాయి. అందుకు కారణం ఆయన కమిడియన్ గా తగ్గించుకుని, హీరోగా బిజీ అవ్వాలని ప్రయత్నించటమే. అందుకు ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ రూట్‌ని ఏర్పరచుకుందామని ప్రయత్నం చేసి బోల్తా పడ్డాడు.

కానీ వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నట్లుగా ఉన్నాడు. మళ్లీ హీరోగా చేసే ప్రయత్నాలు చూసి అతని ధైర్యానికి మెచ్చుకోవాలి అంటున్నారు. అందులోనూ తనకు ప్లాఫ్ ఇచ్చిన డైరక్టర్ తో మరో సినిమా చేస్తున్నాడంటే ఎంత నమ్మకం ఉండాలి ఆ ప్రాజెక్టు పైన..ఏమంటారు..ఆ ప్రాజెక్టు వివరాలు క్రింద చూడండి.

తాజాగా సప్తగిరి నటిస్తోన్న చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’.‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఫేమ్‌ అరుణ్‌ పవార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైభవీ జోషీ హీరోయిన్ గా నటిస్తున్నారు. శివ శివమ్‌ ఫిలింస్‌ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వజ్ర కవచధర గోవింద’అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ సందర్భంగా అరుణ్‌ పవార్‌ మాట్లాడుతూ– ‘‘ఇందులో సప్తగిరి పాత్ర పేరు గోవిందు. పేరుకి చిలిపి దొంగ అయినా ఓ లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం అతనేం చేశాడన్నదే ఈ సినిమా కథాంశం. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు ఉన్నాయి’’ అన్నారు.

‘‘ఇదొక హిలేరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అని నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి అన్నారు. అర్చనా వేద, ‘టెంపర్‌’ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్‌ కొట్టోలి, వీరేన్‌ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: జి.టి.ఆర్‌. మహేంద్ర, సంగీతం: విజయ్‌ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్‌ వనమాలి, ఎడిటింగ్‌: కిషోర్‌ మద్దాలి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : సలాన బాలగోపాలరావు, స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: అరుణ్‌ పవార్‌.