120 కెమెరాలతో …‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ : నిజమైతే అద్బుతమే

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా … ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా హీరోలు ఇద్దరిపై ఫైట్ సీన్స్ తో ప్రారంభించారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫైట్ సీన్స్ కు జక్కన్న 4డి టెక్నాలజీ కలపనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సన్నివేశాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అలాగే రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.0’ సినిమాకు వాడిన టెక్నాలిజీ కంటే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కు వాడే టెక్నాలజీ ఎఫెక్ట్సే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని ఫిలిం వర్గాల సమాచారం. కేవలం ఈ ఫైట్స్ ను షూట్ చేయటానికే 120 కెమెరాలను ఉపయోగిస్తున్నారట. ఫైట్‌ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల హావభావాలు, ముఖకవళికలు అన్నీ 4డి టెక్నాలజీతో క్యాప్చర్‌ చేయనున్నారట. అదే కనుక నిజమైతే రేపు తెరమీద ఓ అద్బుతం చూడబోతున్నాం అన్నమాట.

‘ఆర్‌ ఆర్ ‌ఆర్’ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో కథానాయికలు ఎవరన్నదీ ఇంకా ప్రకటించలేదు.‌ ఈ సినిమా కోసం చరణ్‌, తారక్‌ కొత్త లుక్‌లో సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు.

హైదరాబాద్‌ శివార్లలో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకి సంబంధించిన ఓ భారీ సెట్‌ను తీర్చిదిద్దారు. ఈ సెట్లోనే దాదాపు సగం సినిమాను చిత్రీకరించనున్నారు. ఎక్కువ రోజులు ఈ సెట్‌లోనే గడపాలి కాబట్టి రాజమౌళి అక్కడే ఓ ఇల్లు కూడా కట్టించేశారట. ఈ సినిమా కథ ప్రకారం అటవీ నేపథ్యంలో సాగే కొన్ని సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఆ సీన్స్ కోసం రాజమౌళి కొత్త భాషను కనిపెట్టే పనిలో ఉన్నట్లు సమాచారం.