‘సైరా’లో రెండు సన్నివేశాల్లో మాత్రమే క‌నిపిస్తుందట!

జస్ట్… రెండు సన్నివేశాలంటే రెండు సన్నివేశాలంతే! ఒక్కో సన్నివేశంలో చిన్నదంటే చిన్న డైలాగ్ ఒక్కొక్కటి! మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ‘సైరా’లో నిహారిక కొణిదెల కనిపించేది. అభిమానులంతా ముద్దుగా మెగా డాటర్, మెగా ప్రిన్సెస్ అని పిలుచుకునే నాగబాబు కూతురు పెదనాన్న చిరంజీవి సినిమా ‘సైరా’లో నటిస్తుందనే విషయం ఎప్పుడో బయటకు వచ్చింది. ఈరోజు దానిపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

 

“పెదనాన్నతో ‘ఖైదీ నంబర్ 150’లో చేయాలనుకున్నా. కానీ, కుదరలేదు. ఈసారి మాత్రం ఛాన్స్ మిస్ చేసుకోకూడదని చరణ్ అన్న (చిరంజీవి కుమారుడు, ‘సైరా’ నిర్మాత రామ్ చరణ్)ను విపరీతంగా బతిమాలా. ‘నిర్మాతగా నేను ఆర్టిస్టులను రికమండ్ చేయను. డైరెక్టర్ సురేందర్ రెడ్డికి అడుగు. ఆయనకు ఓకే అంటే నాకు ఓకే’ అన్నాడు. కరెక్టుగా అప్పుడే సురేందర్ రెడ్డిగారు వచ్చారు. ఆయన్ని అడిగా. ‘నిజంగా చేస్తారా?’ అని ప్రశ్నించారు. ‘అయ్యో… మీకు తెలియదండీ. ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలు’ అన్నాను. వెంటనే ‘డైలాగ్స్ లేకపోయినా ఫర్వాలేదా?’ అన్నారు. పర్లేదన్నా. అప్పుడు బోయ అమ్మాయి పాత్ర ఇచ్చారు” అని ‘సైరా’లో తనకు అవకాశం ఎలా వచ్చిందో నిహారిక చెప్పుకొచ్చారు. 

 

సినిమాలో పాత్ర గురించి నిహారిక మాట్లాడుతూ “మూడు వందలమంది బోయ అమ్మాయిలు వుంటారు. ఆ గుంపులో నేను ఒక అమ్మాయిని. చాలా చిన్న పాత్రే. ఒక రెండు సన్నివేశాల్లో కనిపిస్తా. రెండు డైలాగులు వుంటాయేమో. కొన్ని రోజులు షూటింగ్ చేశా. మళ్ళీ వచ్చే ఏడాది నా షూటింగ్ వుంటుందని చెప్పారు” అని అన్నారు. నా వికీపీడియాలో పెదనాన్న చిరంజీవి సినిమా పేరు కనబడితే చాలు. అందుకని రెండు సన్నివేశాలు ఏంటి? రెండు ఫ్రేముల్లో అయినా నటించేదానిని అని నిహారిక తెలిపారు.