‘మహర్షి’ లీక్ వీడియో: పొలంలో మహేష్ మైక్ పెట్టాడు!

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్‌ ఫొటోలు , వీడియో లీకయ్యాయి. పొలాల మధ్యలో మహేష్ నడుచుకుంటూ వెళుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఓ సీన్ షూట్‌ చేస్తున్న వీడియో కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. పల్లెటూరి ప్రాంతంలో షూటింగ్ జరుపుతుండడంతో మహేష్ ని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. దాంతో వారిని అదుపు చేయలేని పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

ఆ గుంపులో నుంచి ఓ వ్యక్తి షూటింగ్‌ సన్నివేశాలను వీడియో తీశాడు. ఆ వీడియోను మహేష్ అభిమానులే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం గమనార్హం.

ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ పొల్లాచ్చి షెడ్యూల్‌ని పూ ర్తి చేసి ఆఖరి దశకు చేరుకుంది. ‘భరత్ అనే నేను’ మూవీలో మహేష్ మీడియాతో మాట్లాడే సన్నివేశం హైలైట్ నిలిచింది. తాజాగా ‘మహర్షి’ చిత్రంలోనూ అలాంటి సన్నివేశమే ఉండబోతున్నట్టు లీకైన పిక్‌ని బట్టి తెలుస్తోంది.


కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట మహేష్. పొలాచ్చిలో పల్లెటూరి వాతావరణంలో పంట పొలాల మధ్య ఉన్న మహేష్.. మీడియాతో మాట్లాడుతూ ఉన్న షూటింగ్ ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రంలో మహేష్ గుబురు గడ్డంతో కొత్త లుక్‌లో కన్పించబోతున్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. తర్వాతి షెడ్యూల్‌ ఫిబ్రవరిలో మొదలవుతుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.