ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై ఎన్ వి. నిర్మల్ దర్శకత్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్ మ్యాచ్`. డిసెంబర్ 6న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు, స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దేశపతి శ్రీనివాస్, శ్రీవిష్ణు సహా ఎంటైర్ యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. బిగ్‌సీడీని తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు, స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. బిగ్ టికెట్‌ను విక్టరీ వెంకటేశ్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా..తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ – “శ్రీరాంగారిపై ఉన్న గౌరవంతో నేను ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు సినిమాల్లో కొత్త భావనలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కథలతో, కొత్త దర్శకులు, నటీనటులు అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. ‘మిస్ మ్యాచ్’ కూడా అదే కోవలో కనపడుతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథా చిత్రమిదని నాకు అర్థమైంది. ఓ ప్రేమికురాలి విజయం కోసం ప్రేమికుడు పడే తపనను చూపించే చిత్రమిది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రమని అర్థమవుతుంది. ప్రేమ మనిషిని విజయ పథం వైపు నడిపించాలి. అలా పాజిటివ్ డైరెక్షన్‌లో ఉండాలే కానీ.. వికృత రూపం తీసుకోకూడదు. ఉదయ్‌శంకర్ 15 సంవత్సరాల వయసులోనే గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్. నిజ జీవితంలోలాగానే తెలివైన ఐఐటీ స్టూడెంట్‌గా యాక్ట్ చేశాడు. సినిమాల్లో మంచి సందేశం ఉండాలి. సినిమాలతో గౌరవం పెరగాలి. వ్యక్తిత్వం ప్రతిబింబించేలా సినిమాలుండాలి. మహిళల గౌరవం పెరిగేలా సినిమాలుండాలి. అలాంటి ఓ మంచి సినిమా ఇదని అర్థమవుతుంది. `మిస్ మ్యాచ్` సమాజంతో మ్యాచ్ కావాలని, మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నీషియన్ నా హృదయానికి ఎంతో దగ్గరైనవారు. వారందరికీ ఆల్ ది బెస్ట్. ఉదయ్‌శంకర్ గురించి చెప్పాలంటే తన తొలి చిత్రం ఆటగదరా శివలో అద్భతుంగా నటించాడు. ఇప్పుడు ‘మిస్ మ్యాచ్’లో మరో అద్భుతమైన పాత్రలో నటించాడు. తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి దగ్గరైన పాత్ర. తను 15ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం గొప్ప విషయం. తను హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి. ఐశ్వర్యారాజేష్ మరో అద్భుతమైన పాత్రలో నటించింది. తనకు కూడా అభినందనలు. నిర్మాతలు భరత్, శ్రీరామ్‌కు అభినందనలు. భూపతిరాజాగారు వండర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను అందించారని అర్థమవుతుంది. అమ్మాయిలు ఉన్నతస్థాయికి ఎదిగే స్క్రిప్ట్స్‌ను నేను బాగా ఇష్టపడతాను. రాజా, సూర్యవంశం వంటి అలాంటి సినిమాల్లో నేను కూడా నటించాను. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు చూశాను. తప్పకుండా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ నిర్మల్ కుమార్ టాలెంటెడ్ డైరెక్టర్. డిసెంబర్ 6న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ఉదయ్‌శంకర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విక్టరీ వెంకటేశ్, పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి చెప్పారు. ఐశ్వర్యా రాజేష్ గురించి చెప్పాలంంటే ఆవిడ అమ్మగారు గురించి చెప్పాలి. ఆవిడ ఎంతో కష్టపడి ఎదిగారు. నాతో పాటు 50-60 సినిమాలకు కలిసి పనిచేశారు. కౌసల్య కృష్ణమూర్తితో ఐశ్వర్య తెలుగులో సిక్సర్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాలో తను చేసే బాక్సింగ్‌తో బాక్సాఫీస్ బద్దలవుతుంది. నిర్మల్ కుమార్ తొలి సినిమా సలీమ్‌ను చక్కగా తెరకెక్కించాడు. డిసెంబర్ 6న సినిమా విడుదలవుతుంది
అన్నారు.