వరుస హిట్లతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఫిదా, తొలిప్రేమ హిట్ సినిమాల తర్వాత వరుణ్ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 చేస్తుండగా మరో మూవీ ఘాజీ వంటి వినూత్న సినిమా తీసిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్లో రానుంది. ఈ సినిమా అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ మేకర్స్ రిలీజ్ డేటును ప్రకటించారు. షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుందని, డిసెంబర్ 21 న రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు.
కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి కనిపించనున్నారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో స్టంట్స్ ఉండబోతున్నట్టు సమాచారం. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ జిబెక్, రోమన్, టోడోర్ లాజరవ్ ఈ మూవీ కోసం వర్క్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని స్టంట్స్ సన్నివేశాలలో హీరో వరుణ్ డూప్ లేకుండా నటించారట. వరుణ్ తేజ్, హీరోయిన్ అదితిరావుపై కొన్ని సన్నివేశాలను ౩డ్ స్కాన్ చేశారట. ఈ టెక్నాలజీ సినిమాకి మరింత హెల్ప్ అవుతుందని మూవీ టీం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.