పా (రో) త ప్రేమలో కొత్త నీహారిక! ‘సూర్యకాంతం’ (మూవీ రివ్యూ)

‘సూర్యకాంతం’ 
రచన, దర్శకత్వం : ప్రణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి
తారాగణం : నీహారికా కొణిదెల, రాహుల్ విజయ్,  పెర్లెన్ భేసానియా , సుహాసిని, శివాజీ రాజా,  సత్య తదితరులు 
సంగీతం : మార్క్ కె రాబిన్, ఛాయాగ్రహణం : హరి జాస్తి 
బ్యానర్ : నిర్వాణ సినిమాస్
నిర్మాతలు : సందీప్,  సృజన్, రామ్ నరేష్
విడుద‌ల‌: మర్చి 29, 2019

2 / 5

          మెగా డాటర్ నీహారికా కొణిదెల ఫ్రెష్ గా యూత్ ఫుల్ గా వచ్చేసింది. మొదటి రెండు సినిమాల చేదు అనుభవాల్ని దాటేందుకు ‘సూర్యకాంతం’ అనే టైటిల్ రోల్ తో అట్టహాసంగా
వచ్చేసింది. కొత్త అయిడియాలుండే అవకాశమున్న కొత్త దర్శకుడికి అవకాశమిచ్చి చూద్దామని ఓ ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఇంకో రోమాంటిక్ కామెడీ / డ్రామా నటించింది. మరి ఈసారైనా విజయం సాధించిందా లేక మరో ఆశ నిరాశేనా చూద్దాం…

కథ 

          సూర్యకాంతం (నీహారిక) తల్లిదండ్రులు విడిపోయి తల్లితో వుంటుంది. తల్లిదండ్రులు విడిపోవడం ఆమె జీవితంపై ప్రభావం చూపిస్తుంది. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయి ఎప్పుడొస్తుందో తెలీదు. తల్లి (సుహాసిని) చేసే పెళ్లి ప్రయత్నాల్ని తిప్పి కొడుతూంటుంది. ఈ నేపథ్యంలో అభిషేక్ (రాహుల్ విజయ్) ఆమెని చూసి వెంటపడతాడు. అతడికామె అర్ధంగాదు, అంతు చిక్కదు. నానా తిప్పలు పడి  ప్రేమిస్తున్నట్టు చెప్పేస్తాడు. ఆమె మాయమై పోతుంది. ఏడాది దాకా కనపడదు. ఇక పూజా (పెర్లెన్ భేసానియా) అనే అమ్మాయితో ఇంట్లో వేరే సంబంధం చూస్తే ఒప్పుకుంటాడు. ఇక నిశ్చితార్ధం జరగబోతోందనగా వచ్చేస్తుంది సూర్యకాంతం. వచ్చేసి అభిషేక్ కి, పూజ కీ మధ్య సమస్యగా మారుతుంది. ఇప్పుడు అభిషేక్ ఏం నిర్ణయం తీసుకున్నాడు? అభిషేక్ తీసుకున్న నిర్ణయంపై సూర్యకాంతం ఇంకేం నిర్ణయం తీసుకుంది? …ఇదీ మిగతా కథ. 

ఎలావుంది కథ 

          అదేపనిగా వచ్చిపడిన ముక్కోణ ప్రేమ సినిమాలు మర్చిపోయి చాలా కాలమైంది. మళ్ళీ ఆ ఫ్లాప్స్ ని గుర్తు చేస్తూ ఇదొచ్చేసింది. ‘ముద్దపప్పు ఆవకాయ’ అంటూ వెబ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న దర్శకుడు ఏదో సామెత చెప్పినట్టు ఈ పాత చింతకాయ తీశాడు. వెబ్ సిరీస్ కి కూడా ఇంత మూస ఫార్ములా వుండదు. నేటి రియలిస్టిక్ ప్రేమల కాలంలో, వందల సార్లు వచ్చేసిన పాత మూస ముక్కోణ కథతో చాలా సహనపరీక్ష పెట్టే విధంగా ఈ సినిమా దర్శకత్వం వహించాడు. దర్శకుడుగా తను కొత్త కాబట్టి తనకిది కొత్తగా అన్పించిందేమో. ప్రేక్షకులకి చాలా పాత. ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరోయిన్; లేదా ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, అప్పుడా హీరో లేదా హీరోయిన్ ఎవర్ని ఎంపిక చేసుకోవాలనే జమానా నాటి లైటర్ వీన్  ప్రేమ కథలకి ఇన్స్ పైర్ అయి తీసిన ఈ ముక్కోణ ప్రేమ సినిమా  అన్నివిధాలా అందరికీ – నిహారిక సహా – ఒక వృధా ప్రయాసే తప్ప మరేం కాదు.ఇది వరకు ఇలా బలహీనంగా తీసే సినిమాలని టీవీ సీరియల్ అనేవాళ్ళు. ఇప్పుడు షార్ట్ పిలిమ్స్, వెబ్ సిరీస్ మేకర్లు వస్తున్నాకా ఇంకా దారుణంగా తయారయ్యింది పరిస్థితి. ఎందుకంటే ఈ దర్శకుల కథలు అరగంటో, పావు గంటో వుంటాయి – వీటిని సినిమాగా రెండు గంటలు సాగదీయాలనుకోవడం దగ్గరే బోల్తాపడుతున్నారు, బోరు కొట్టిస్తున్నారు.

ఎవరెలా చేశారు 

          నిజానికి నిహారిక కిది ఫ్రెష్ పాత్ర. ‘అంతులేని కథ’ లో జయప్రదది ఎవరికీ అర్ధంగాని సీరియస్ పాత్రయితే, నిహారికది ఎవరికీ అర్ధంగాని అల్లరి పాత్ర. చాలా ఫన్నీగా, మంచి ఈజ్ తో నటిచింది. ఈ బోరు సినిమాలో తను కన్పించినప్పుడల్లా మాత్రమే హుషారు వస్తుంది. అయితే సమస్యలో పడ్డాక పాత్ర చిత్రణ చేతగాక పోవడంతో తనూ నిలబెట్ట లేకపోయింది ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాని. పడ్డ శ్రమంతా వృధా అయిపోయింది.

          కొత్తగా పరిచయమైన హీరో రాహుల్ విజయ్ కి టాలెంట్ వుంది. ఇలా సినిమాలే ముగిసిపోయిన సినిమాలు చేయకుండా వుంటే బావుంటుంది. లేకపోతే కొత్త బిచ్చగాడు పొద్దెరగడు సామెత దర్శకుడితో బాటే తనకీ నిజమవుతుంది. ఐతే ఎంత టాలెంట్ వున్నా కొత్త హీరోలకి రెండో సినిమా రావడం అరుదు. ఎందుకంటే ప్రతీ దర్శకుడూ ఇంకో కొత్త హీరోనే తీసుకుంటాడు. కొత్త హీరోయిన్ల విషయంలో కూడా ఇంతే. రెండో హీరోయిన్ గా నటించిన పెర్లెన్ టాలెంట్ చూసి ఇంకో అవకాశ మివ్వడమంటూ జరగదు – సినిమాకొక కొత్త హీరోయిన్ అనే పథకాన్ని అమలు చేస్తున్న కాలంలో. కాబట్టి కొత్త హీరోహీరోయిన్లు బాగా నటించారని చెప్పుకుని కూడా ఉపయోగం లేదు. 

          హీరోయిన్ తల్లిగా మధ్యలో చనిపోయే పాత్ర సుహాసినిది. హీరో తండ్రిగా నామమాత్రపు పాత్ర శివాజీ రాజాది. హీరో పక్క కమెడియన్ గా సత్యది మరో గుర్తుండని పాత్ర. ఈ కాలం చెల్లిన ప్రేమ సినిమాకి మార్క్ రాబిన్ మ్యూజిక్ మాత్రం పాటలప్పుడు మంచి ఊపు తీసుకొస్తుంది. పార్టీ సాంగ్ చెప్పుకోదగ్గ ప్రయోగం. ఇంత యూత్ ఫుల్ గా, ట్రెండీగా వున్న మ్యూజిక్ తో దర్శకుడి కథాకథనాలు మాత్రం పోటీపడలేక పోయాయి. ఇక నిర్మాతల చలవ వల్ల రిచ్ నిర్మాణపు విలువలు జతపడ్డాయి. కెమెరా మాన్ హరి జాస్తి సినిమాలో లేని విషయానికి మంచి విజువల్స్ తీసి పెట్టాడు. అలాగే రవితేజ ఎడిటింగ్. సాంకేతిక నిపుణులు వాళ్ళ శాఖల్లో అప్డేట్ అవుతున్నారు. దర్శకులే  పాత చింతకాయ స్క్రిప్టులతో సాంకేతిక నిపుణుల టాలెంట్ వి వేస్ట్ చేస్తున్నారు. ముందు ఇలాటి దర్శకులని వాషింగ్ మెషిన్లో వేస్తే మెదళ్ళు వాష్ అవుతాయి. 

చివరికేమిటి 

          వారం వారం వచ్చి మాయమైపోతున్న రోమాంటిక్ కామెడీల / డ్రామాల లిస్టులో ఇది మరొకటి. కొత్త దర్శకుల ప్రేమ సినిమాలు కాలంలో ఇరవై ఏళ్ళ వెనుక ఇరుక్కున్నాయి. తెలుగు ప్రేమ కామెడీ / డ్రామా అంటే భయపడాల్సిన పరిస్థితి ఏనాడో ఏర్పడింది. అయినా ఇవి తప్ప ఇంకో సినిమాలు తీయలేని దయనీయ స్థితిలో వున్నారు. ఇవే తీస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్న నిర్మాతలకి మార్కెట్ అవగాహన అసలే లేదు. ఫ్యాషన్ కోసం ఓ సినిమా అయిందన్పించుకుంటున్నారు. ప్రేక్షకులకేం నష్టంలేదు, ఎలాగూ ఇవి చూడడం మానేశారు కాబట్టి. 

          మెగా డాటర్ నిహారిక గత రెండు సినిమాల్లో పాత్రల కన్నా బెటర్ పాత్ర ఇందులో పొందింది. ఈ కొత్త పాత్రకి ఇప్పుడెవరూ చూడని ముక్కోణ ప్రేమ కథ తోడయిందని తెలుసుకోలేక పోయింది. ముక్కోణం కూడా ఏ నేపథ్యంలో ఎలా తీస్తే హిట్టవుతుందో ఇటీవలి ‘మన్మర్జియా’ (తాప్సీ – అభిషేక్ బచ్చన్ – విక్కీ కౌశల్) అనే బాలీవుడ్ మూవీని చూసి వుంటే, అందులో విక్కీ కౌశల్ పోషించిన తన లాంటి పాత్రే ఎంత అప్డేట్ అయి వుందో తెలుసుకుని వుంటే, ఖచ్చితంగా పునరాలోచించుకునేది.   

          వెబ్ సిరీస్ దర్శకుడు కాస్త బయటి ప్రపంచాన్ని చూసి, రియలిస్టిక్ ప్రేమలు తీసి, ప్రొడక్షన్ విలువలకి న్యాయం చేయగలిగితే ఎందరికో బావుంటుంది.  

―సికిందర్