మోహన్ లాల్ ఇంత బోరా! (‘ఒడియన్’రివ్యూ)

– సికిందర్

***
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈసారి ఫాంటసీ థ్రిల్లర్ తో వస్తున్నట్టు భారీగా ప్రచారం జరిగి వంద కోట్ల బిజినెస్ అయిపోయింది. కొత్త దర్శకుడైన శ్రీకుమార్ తొలి సినిమాతోనే ఇంత విజయం సాధించడం రికార్డే. అలాగే బయ్యర్లకి అరచేతిలో వైకుంఠం చూపించడం కూడా రికార్డే. ఏమైనా ఫాంటసీ శక్తులున్నాయంటే అవి శ్రీ కుమార్ కే వుండాలి. లేకపోతే మలయాళంలో మొట్టమొదటి ఫాంటసీ థ్రిల్లర్ అని చెప్పి, సూపర్ స్టార్ ని చూపిస్తూ ఇంత బిజినెస్ చేసుకోవడం అసాధ్యం. సినిమా కెళ్ళిన వాడు ఓ మూడు గంటలు హాయిగా నిద్రపోయేలా చేయడం కూడా మామూలు టాలెంట్ కాదు. ‘ఒడియన్’ మరో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లాంటి జోక్ అయికూర్చుంది.

‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లో ఆరువందల ఏళ్ళు గడగడ లాడించిన దారిదోపిడీ కిరాతక ముఠాలైన థగ్గుల చరిత్ర అని చెప్పి ఎలా మిస్ లీడ్ చేశారో, అదే ఇప్పుడు ‘ఒడియన్’ తో కూడా చేశారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పూర్వకాలంలో ఒడియన్ లనే ఒక తెగ వుండేదనీ, వాళ్ళు తాంత్రిక విద్యలతో రూపం మార్చుకుని చీకటి రాత్రుల్లో సంచరించి చంపేవాళ్ళనీ, అతీంద్రయ శక్తుల కోసం మనుషుల్ని బలి ఇచ్చేవాళ్ళనీ కథలుగా చెప్పుకుంటారు. వాళ్ళు వివిధ జంతువుల రూపాలలోకి మరిపోయి దాడులు చేసే వాళ్ళు. కేరళ గ్రామాల్లో కరెంట్ లేనప్పుడు ఇది జరిగేదనీ, కరెంట్ వచ్చాక వెలుగులో సంచరించలేక ఈ తెగ వృత్తి మానేశారనీ అంటారు. ఇలా ఈ తెగకి చెందిన ఏకైక సంతతి మాణిక్యం కథ ఈ సినిమా అని ప్రచారం చేశారు.

కానీ సినిమాలో వున్నది పూర్తిగా వేరు. మోహన్ లాల్ ని ఒడియన్ గా నామమాత్రంగా పరిచయం చేసేసి, అతడి విద్యలు చూపించకుండా- ఓ పాత మూస ముక్కోణ ప్రేమకథ ప్రకాష్ రాజ్ తో కలిపి చూపించి నిద్రపుచ్చారు. ఇది చూస్తూంటే ఎందుకో చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ గుర్తుకొస్తుంది. చిరంజీవి వారాణసిలో టాక్సీ డ్రైవర్ గా వుంటే, అక్కడికొచ్చిన ఒక పాత్ర గుర్తుపట్టి ఫలానా కదూ అన్నప్పుడు, రాయలసీమలో చిరంజీవి ఫ్యాక్షన్ కథ ఫ్లాష్ బ్యాక్ ఓపెనైనట్టు- మోహన్ లాల్ కూడా ఓ సాధువులా వారాణసిలో వుంటే, ఒకావిడ ప్రమాదవశాత్తూ గంగలో మునిగిపోతుంది. ఆమెని కాపాడతాడు. ఆమె గుర్తు పట్టి ‘ఒడియన్ కదూ?’ అంటుంది. ఇక్కడేం చేస్తున్నావ్, నీకు జరిగిన అన్యాయం మర్చిపోయావా? అంటుంది. ఆ అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి తిరిగి కేరళలోని తన గ్రామానికి వెళతాడు.

అక్కడ అతణ్ణి ఎవరు చూసినా వాళ్ళ జ్ఞాపకాలతో ఫ్లాష్ బ్యాక్స్ వస్తూంటాయి. చిన్నప్పుడు మాణిక్యం ప్రేమకథ, ఆ స్కూలు ప్రేమకథలో ప్రభ (మంజూ వారియర్) అనే అమ్మాయి, ప్రకాష్ రాజ్ అనే విలన్. వయసొచ్చాక ప్రభ వేరే పెళ్లి చేసుకోవడం, మాణిక్యం నిరాశ, యవ్వనం లో పనిచేసుకు బతకడం, మళ్ళీ అతడి జీవితంలోకి ప్రకాష్ రాజ్ రావడం, ప్రభ మీద కన్నేయడం…ఇలా సెకండాఫ్ వరకూ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు వస్తూనే వుంటాయి. విషయమేమిటంటే, ఇలాటి ఒక ఫ్లాష్ బ్యాకులో ఫైనల్ గా రెండు హత్యలు జరిగి, ఒడియన్ విద్యతో మాణిక్యమే చంపాడని ఆరోపణ. అలా మాణిక్యం పదిహేనేళ్ళ క్రితం వూరు విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చాడు నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి.

ఈ కొత్త మలయాళ దర్శకుడు కూడా టెంప్లెట్ లోనే కథ పడేసి 1980 లలోని సినిమా చూపించాడు. ఒడియన్ తెగ గురించి ఈ కథ అన్నది అబద్ధం. ఫాంటసీ అనడం కూడా అవాస్తవం. దాదాపు సీన్లన్నీ రాత్రిపూటే జరిగి బోరు కొట్టిస్తాయి. మోహన్ లాల్ మమూలులుగానే ఫైట్స్ చేస్తాడు- ఒడియన్ శక్తులతో కాదు. ఏ సీను కూడా ఆసక్తి కరంగా వుండదు. సాంకేతికంగా కెమెరా వర్క్ బాగానే అన్పించవచ్చు, విషయపరంగా సినిమా తప్పుదోవ పట్టించేదిగా వుంటే ప్రొడక్షన్ విలువలు లెక్కలోకి రావు. ఓ పాత మూస ఫార్ములా ముక్కోణ ప్రేమ కథ కోసం ఇంత సినిమా తీశారంటే కొత్త దర్శకుడి లౌక్యం మామూలుది కాదు. ఈ వయసులో మోహన్ లాల్ తో లవ్ స్టోరీ ఏమిటి?

Rating: 1.25 /5 

Odiyan Telugu Teaser | Mohanlal | Manju Warrier | Prakash Raj | Daggubati Creations

దర్శకత్వం : వి. ఏ. శ్రీకుమార్
తారాగణం : మోహన్ లాల్, ప్రకాష్ రాజ్, మంజూ వారియర్,
రచన : హరికృష్ణన్, సంగీతం : జయచంద్రన్, సామ్, ఛాయగ్రహణం : షాజీ కుమార్
నిర్మాత : ఆంథోనీ పెరుంబవూర్
విడుదల : డిసెంబర్ 14, 2018