ఎమోషనల్ మజిలీలు: ‘మజిలీ’  (మూవీ రివ్యూ)

‘మజిలీ’ 
రచన, దర్శకత్వం : శివ నిర్వాణ 
తారాగ‌ణం: నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంశ కౌశిక్‌, రావురమేష్, పోసాని, అతుల్ కులకర్ణి, సుబ్బరాజు త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : విష్ణు శ‌ర్మ‌, సంగీతం : గోపీ సుంద‌ర్‌, త‌మ‌న్‌
బ్యాన‌ర్‌: షైన్ స్క్రీన్స్
నిర్మాతలు: హ‌రీష్, సాహు 
విడుదల : ఏప్రెల్ 5, 2019
3/5

          నాగచైతన్య –  సమంతాల పెళ్ళయిన నేపథ్యంలో కలిసి నటించిన సీరియస్ ఫ్యామిలీ డ్రామా ‘మజిలీ’ టైటిల్ బలహీనంగా వున్నా ట్రైలర్స్ తో ఆసక్తి రేపింది. రెగ్యులర్ సినిమాలా కాకుండా పెళ్లయిన జంట కథగా, గ్లామర్ కి దూరంగా తీసిన రియలిస్టిక్ మూవీకి ‘నిన్నుకోరి’ తీసిన  శివ నిర్వాణ దర్శకుడు. ఇదెలా తీశారో చూద్దాం…

కథ 
          వైజాగ్ లో పూర్ణ (నాగచైతన్య) క్రికెట్ మీద వ్యామోహంతో వుంటాడు. చదువు పెద్దగా వుండదు. తండ్రి (రావు రమేష్) రైల్వే ఉద్యోగి. అతను పూర్ణకి సెటిల్ అవడానికి సంవత్సరం టైమిస్తాడు. పూర్ణ లోకల్ క్రికెట్ టీంలో చేరతాడు. అక్కడ ఇమడలేక వచ్చేస్తాడు. ఇంతలో ఉత్తరాదికి చెందిన నేవీ అధికారి (అతుల్ కులకర్జి) కూతురు అంశూ (దివ్యాంశ కౌశిక్‌) తో ప్రేమలోపడతాడు. ఆమెకి అప్పటికే నిశ్చితార్ధం జరిగి వుంటుంది. ఒకరోజు ఆమె హఠాత్తుగా కన్పించకుండా పోతుంది. దీంట్లో ఆమె తండ్రి హస్తముందనుకున్న పూర్ణ విరక్తితో భూషణ్ (సుబ్బరాజు)  అనే పొలిటీషియన్ దగ్గర చేరిపోతాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాక తండ్రి సంబంధం చూసి శ్రావణి (సమంత) తో పెళ్లి చేస్తాడు. కానీ అంశూనే ప్రేమిస్తున్న పూర్ణ శ్రావణితో ఇమడ లేకపోతాడు. ఇంతలో వీళ్ళిద్దరి జీవితాల్లోకి మీరా అనే పదమూడేళ్ళ బాలిక వస్తుంది. ఎవరీమె? పూర్ణకేం సంబంధం? శ్రావణి దీన్నెలా తీసుకుంది? ఇదీ మిగతా కథ…

ఎలావుంది కథ

          మానసిక సంఘర్షణలతో కూడిన ఫ్యామిలీ డ్రామా. ఇలాటి కుటుంబ డ్రామాలు చాలా వచ్చాయి. అయితే దీన్ని రియలిస్టిక్ పంథాలో సెకండాఫ్ ని జీవితాలకి దగ్గరగా తీశారు. ఫస్టాఫ్ ఫార్ములా కథగానే వుంటుంది. నాగచైతన్య, సమంతలకి ఈకథ పూర్తిగా ఎమోషనల్ జర్నీ. విషాదం ఎక్కువ. పోనుపోను క్లయిమాక్స్ లో ఇక గుండెలు బరువెక్కిపోయేంత ఎమోషనల్ డ్రామా. జీవితంలో పైకి రాలేకపోతున్న భర్త, అతణ్ణి పోషించాల్సిన బాధ్యత మీదేసుకున్న భార్య – వీళ్ళిద్దరి సంఘర్షణ ఇది. ఈ సంఘర్షణని ఇంత బరువుగా తీయకుండా కాస్త తేలిక చేసి ఆలోచనాత్మకంగా తీసేవుండాల్సింది.

ఎవరెలా చేశారు 

నాగచైతన్య ఒక మూసలోంచి బయటికొచ్చి ఈ ప్రయోగాత్మకానికి కి ధైర్యం చేశాడు. ఇంతకాలం నటించలేని తను ఈసారి ఇంత బరువైన పాత్రని పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేసి మెప్పించదగ్గ స్థాయికి చేరుకున్నాడు. మొదటి ప్రేమ దూరమయిందని క్రికెట్ ని చెడగొట్టుకుని స్మోకింగ్, డ్రింకింగ్ మరిగి,  ఇంకో అమ్మాయి జీవితంలోకి ప్రవేశించి కల్లోలం రేపే పాత్ర. సమంతా సెకండాఫ్ లో వుంటుంది. భర్తని మౌనంగా భరిస్తూ, తాగుడికి సిగరెట్లకి డబ్బిస్తూ, మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ఒక నవలని గుర్తు చేస్తుంది. గ్లామర్ లేని రియలిస్టిక్ పాత్ర, ఆ మేరకు మంచి నటన. 

          వీళ్ళిద్దరి తండ్రులుగా రావురమేష్, పోసానీ వుంటారు. ఉత్తరాది అమ్మాయిగా దివ్యాంశ ఫర్వాలేదు.  సుబ్బరాజు, అతుల్ కులకర్ణిలు వున్నా అవి కొనసాగే పత్రాలు కావు. సుబ్బరాజుని అంత బిల్డప్ తో చూస్తూ అసలుకే కన్పించకుండా చేశారు. గోపీసుందర్ పాట్లు, తమన్ నేపధ్య సంగీతం, అలాగే విష్ణు శర్మ సంగీతం ఈ రియలిస్టిక్ డ్రామాకి బలం.

చివరికేమిటి 

          ఈ మధ్యతరగతి కుటుంబ డ్రామాని అంత సాఫీగా ఏమీ తీయలేదు దర్శకుడు శివ నిర్వాణ. ఫస్టాఫ్ ఫార్ములా కథ, సెకండాఫ్ వాస్తవిక కథగా తీశాడు. రెండు చోట్ల కూడా భావోద్వేగాల బరువుకింద  నడక భారంగా సాగేట్టు చేశాడు. పైగా  కొన్ని చోట్ల డ్రామా ఎలివేట్ చేసి, అయితే కొన్ని చోట్ల తేలిపోయేలా చేశాడు. చివరి అరగంట క్లయిమాక్స్ రిలీఫ్ నివ్వని అతి  సీరియస్ డ్రామా చేశాడు. ఇక డెహ్రాడూన్ లో  నడిపిన కథకి లాజిక్ లేని, నమ్మశక్యం గాని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ లోపాలతో మొత్తానికి కిందామీదా పడి కొలిక్కి తెచ్చాడు. కుటుంబ ప్రేక్షకులకి ఇది నచ్చవచ్చు.

―సికిందర్