రచన -దర్శకత్వం : నవనీత్ శ్రీరామ్
తారాగణం : ప్రియదర్శి, ఆనంది, సుమ, వెన్నెల కిషోర్, హైపర్ ఆది తదితరలు
సంగీతం : లియోన్ జేమ్స్, ఛాయాగ్రహణం : విశ్వనాథ్ రెడ్డి, కూర్పు : రాఘవేంద్ర తిరుణ్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినిమాస్
నిర్మాతలు : జాహ్నవీ నారంగ్, పుష్కర్ రామమోహనరావు
విడుదల :నవంబర్ 21, 2025
హీరో ప్రియదర్శి శరవేగంగా సినిమాలు పూర్తి చేసుకుపోతున్నాడు. కోర్ట్, 28 డిగ్రీల సెల్సియస్, మిత్రమండలి ల తర్వాత ఇప్పుడు ‘ప్రేమంటే’ అనే రోమాంటిక్ క్రైం కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి నవనీత్ శ్రీరాం కొత్త దర్శకుడు. వీళ్ళిద్దరి కలయికలో ఈ కామెడీ ఎంతవరకు నవ్విస్తుందో తెలుసుకుందాం…

కథేమిటి?
రమ్య(ఆనంది), మధుసూదన్ అలియాస్ మది(ప్రియదర్శి) ఓ పెళ్లిలో కలుస్తారు. ఈ కలుసుకోవడం ప్రేమగా మారి సరదాగా గడిచి, పెళ్ళికి దారితీస్తే, ఆ పెళ్లి హనీమూన్ కి దారితీస్తుంది. హానీమూన్ ముగిశాక కష్టాలు మొదలవుతాయి. రమ్య ఉద్యోగంలో చేరితే, మది వ్యాపారం ప్రారంభిస్తాడు. సీసీ కెమెరాలు, లాక్స్ కి సంబంధించిన వ్యాపారం అని చెప్తాడు. ఆమె ఆఫీసునుంచి సాయంత్రం ఇంటికి తిరిగొస్తే, అతను సాయంత్రం నైట్ డ్యూటీకని బయల్దేరతాడు. అతడి వ్యవహారం అనుమానాలు కల్గిస్తుంది రమ్యకి.
బయట ఎఫైర్ ఉందేమోనని డిస్టర్బ్ అవుతుంది. ఫోన్ వస్తే బయటికెళ్ళి రహస్యంగా మాటాడుతున్నాడు. అతడ్ని నిలదీస్తే అది గొడవకి దారి తీస్తుంది. ఆ గొడవలో నిజం చెప్పేస్తాడు. అదేమిటంటే, అతను తీర్చ లేని అప్పుల్లో మునిగివున్నాడు. అవి తీర్చడానికి దొంగతనాలు చేస్తున్నాడు. ఇది విని ఆమె షాక్ అవుతుంది. అయినా అతడ్ని అర్ధం జేసుకుని అతను అప్పుల్లోంచి బయటపడడానికి తనుకూడా కలిసి దొంగతనాలు చేస్తూంటుంది. ఈ విచిత్ర జంట ఆ తర్వాత ఎలాటి పరిణామాలు ఎదుర్కొన్నారు? చట్టానికి దొరికిపోయారా? దొంగతనాల కేసులు చేపట్టిన పోలీసు సుమ (సుమ) వీళ్ళని పట్టుకుందా?ఈ కథ ఎలా ముగిసింది?…ఇదీ మిగతా కథ.

ఎవరెలా చేశారు?
ఈ కథలో తన పాత్ర కొత్తగా అన్పించి ఒప్పుకున్నట్టున్నాడు ప్రియదర్శి. ప్పాత్ర కొత్తదే కానీ దానికి తగ్గ కొత్త కథ కాదుగా అసలు కథే లేదు- సెకండాఫ్ లో కొన్ని భాగాలలో తప్ప. ఇది కామెడీ కథ. కానీ ప్రియదర్శి పాత్ర చేసే కామెడీకి నవ్వురాకపోగా సహన పరీక్ష పెడుతుంది. చేస్తున్న పని చెడ్డదని తెలిసి సంఘర్షణకి లోనవడం, తనతో బాటు హీరోయిన్ ని దొంగతనాల్లోకి లాగినందుకు గిల్టీ ఫీలింగ్ వంటి డెప్త్ తో కూడిన క్యారక్టరైజేషన్ అక్కడక్కడా ఆలోచింపజేస్తుంది. హీరోయిన్ ఆనందితో రోమాన్స్ మాత్రం బాగా కుదిరింది. ఇలా అక్కడక్కడా చెప్పుకోదగ్గ ఘట్టాలున్నాయి తను నటించడానికి. దాదాపు తన గత మూవీ ‘మిత్రమండలి’ తో అయిన అనుభవమే ఈ మూవీతో కూడా ఎదురయింది. ఇకనైనా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని సినిమాలు ఒప్పుకోకపోతే ఇలాగే ఫ్లాపుల వరస కంటిన్యూ అవుతుంది.
ఆనంది నటనలో, గ్లామర్ లో ఓకే. పాత్రపరంగా చూస్తే ఆమె భర్తతో కలిసి దొంగతనాలు చేయడానికి కారణం సరైనదిగా అనిపించదు. భర్త అప్పులన్నీ తీరితే కలిసి ఆనందంగా జీవించ వచ్చన్న లాజిక్ అమెది. అందుకే అతడి అప్పులు తీరడానికి కలిసి దొంగతనాలకి పాల్పడింది. కామెడీకి ఇంతకంటే కారణాలు అవసరం లేదనుకున్నా రేమో. పాత్ర, కథ ఎలావున్నా అనంది నటనలో తను బెస్ట్ అని నిరూపించుకుంది.

ఇక పోలీసు పాత్రల్లో సుమ, వెన్నెల కిషోర్ ల కామెడీ ఏమాత్రం నవ్వించదు. ఏదో కాస్త నవ్వించడానికి మాస్ కామెడీ కూడా కాదు. అది దర్శకుడి వచ్చీ రాని క్రియేషన్. సోషల్ మీడియాలో ఇంతకంటే ఎన్నో రెట్లు బెటర్ జోకులు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో ఇదే పెద్ద మైనస్.
సాంకేతికంగా చూస్తే విశ్వనాథ్ రెడ్డి కెమెరా వర్క్ లో విజువల్స్ బ్రహ్మాండంగా వున్నాయి బ్యానర్ కి తగ్గ క్వాలిటీతో. ఇంత స్టయిలిష్ గా సినిమాలో కంటెంట్ కూడా వుంటే మంచి సక్సెస్ ని అందుకునేది. ఇదే విధంగా లియోన్ జేమ్స్ సంగీతం లో పాటలు రిలీఫ్ నిస్తాయి. రాఘవేంద్ర ఎడిటింగ్, ఇతర నిర్మాణ విలువలూ బావున్నాయి.
ఇంతకీ కథెలా వుంది?
ప్రేమంటే ఏమిటో చెప్పడం కథ. ఒకసారి ప్రేమ సంబంధంలోకి ప్రవేశించాక, బేషరతుగా ఒకరికోసం ఒకరు ఏమైనా చేయడానికి వెనుకాడక పోవడమే ప్రేమ అని అర్ధం చెప్పారు. కానీ ఒకరికోసం ఒకరు ఇద్దరూ చేసేది నేరమే, గొప్ప పనేం కాదు. కథలో ఎక్కడా లాజిక్ అనేది కనిపించదు. ఫస్టాఫ్ ఓపెనింగ్ సీను ఎంత బోరుగా ఉంటుందంటే ఇక తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేస్తుంది. ఫస్టాఫ్ అతుకుల బొంత కథనంగా సాగుతుంది. ఇంటర్వెల్ లో వచ్చే మలుపు సెకండాఫ్ మీద నమ్మకం కలిగిస్తుంది. కానీ సెకండాఫ్ ని కూడా హ్యాండిల్ చేయలేకపోయాడు దర్శకుడు.

ఇలాగే హీరో హీరోయిన్లు దొంగతనాలు చేసే కథతో హిందీ లో ‘దో చోర్’ (19 72) అనే హిట్ మూవీ వుంది. ఇందులో హీరో ధర్మేంద్ర ధనవంతుల ఇళ్లలో వరుస దొంగతనాలు చేస్తూంటాడు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్క నగను మాత్రమే తీసుకుంటాడు, కానీ నగదు ఇతర ఆభరణాలను తాకడు. మరో వైపు హీరోయిన్ తనూజ కూడా దొంగతనాలు చేస్తూంటుంది. ఆమె తండ్రి మరణం తర్వాత ఓ నలుగురు వ్యక్తులు తన తల్లిని మోసం చేసి కాజేసిన సొత్తు తన తల్లికి చెందినవి కాబట్టి, వాటిని మాత్రమే దొంగిలిస్తూ వుంటుంది. ధర్మేంద్ర ఈమె కథ తెలుసుకుని దొంగతనాల్లో సహాయం చేస్తూంటాడు. ఇలా లాజికల్ గా, హీరోయిన్ పరంగా ఎమోషనల్ గా వుంటుంది కథ.కొత్త దర్శకులు పథ సినిమాలు చూస్తూంటే ‘ప్రేమంటే’ లాంటి పొరపాట్లు జరగవు.
రేటింగ్ : 2 / 5

