(సికిందర్)
దర్శకత్వం: శశి కిరణ్
తారాగణం: అడివి శేష్, శోభితా ధూళిపాళ, సుప్రియ, మధుశాలిని, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, అనీష్ కురివెల్ల, వెన్నెల కిశోర్ తదితరులు
కథ: అడివిశేష్, స్క్రీన్‌ప్లే: అడివిశేష్, రాహుల్, శశికిరణ్, మాటలు, స్క్రీన్ ప్లే గైడెన్స్ : అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: శనీల్ డియో
బ్యానర్స్ : అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్
నిర్మాతలు: అభిషేక్ నామ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
విడుదల : ఆగస్టు 3, 2018
***
2.5 / 5
***
‘క్షణం’ ఫేం అడివిశేష్ మరో యాక్షన్ మూవీలో నటించాడు. శశికిరణ్ అనే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చాడు. ఈసారి ‘గూఢచారి’ పాత్రలో, ‘క్షణం’ కంటే ఎక్కువబడ్జెట్ తో తన సొంత కథతోనే సాహసించాడు. తారాగణంలో కూడా జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అనీష్ కురువిల్లా వంటి సీనియర్ల హంగు జోడించుకున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థతో బాటు, మరో రెండు సంస్థలు తోడయ్యాయి. మరి ఇంతకీ ‘క్షణం’ కంటే పైస్థాయిలో ఈసారి ప్రయత్నం సాగిందా, లేక గూఢచార కథతో కొత్త ప్రయత్నమంటూ ఇంకేదైనా జరిగిందా ఓసారి చూద్దాం.
కథ
ప్రాణాలర్పించిన తన తండ్రిలాగే గూఢచార సంస్థ ‘రా’ లో చేరాలని నిర్ణయించుకున్న అర్జున్ (అడివి శేష్) అనేక ప్రయత్నాల తర్వాత ‘రా’మరో అజ్ఞాత సర్వీసు (కల్పితం) అయిన ‘త్రినేత్ర’లో చేరతాడు. అలా ముజాహిదీన్ టెర్రరిస్టుల దృష్టిలో పడి టార్గెట్ అవుతాడు. అక్కడ శిక్షణ పొందుతున్న అర్జున్, పక్క ఫ్లాట్ అమ్మాయి సమీరా (శోభిత) తో ప్రేమ లో పడతాడు. ఇక శిక్షణ పూర్తయి అప్పాయింట్ అవుతూండగా, టెర్రరిస్టులు త్రినేత్ర బాసుల్ని, సమీరానీ చంపేసి, ఆ నేరం అర్జున్ మీద వేస్తారు. పారిపోయిన అర్జున్ ని పట్టుక్కోవడానికి త్రినేత్ర ఏజెంట్ (సుప్రియ) టీము వెంటబడుతుంది. తనని ఇరికించిన టెర్రరిస్టులెవరో పట్టుకోవడానికి అర్జున్ బంగ్లాదేశ్ చేరుకుంటాడు. ఇప్పుడు అక్కడ తనకి తెలియని నిజం ఒకటి తండ్రి గురించి తెలుస్తుంది. ఏమిటా నిజం, ఏమిటా కథన్నది మిగతా కతః
ఎలావుంది కథ
ఇది గూఢచార కథ అనుకుని చేశారు గానీ, నిజానికి దీనికి గూఢచార కథ అయ్యే లక్షణాలు, జానర్ మర్యాదా ఏకోశానా లేవు. ఒక యాక్షన్ కథగా మాత్రమే తీసుకుని చూడాలి. ప్రపంచంలో ఏ గూఢచారి పాత్రకి కూడా వ్యక్తిగత జీవితం, కుటుంబ సమస్యలూ వుండవు. ప్రపంచ బాధే తన బాధగా అంతర్జాతీయ సమస్య తీసుకుని, విదేశీ శక్తులతో పోరాడతాడు. అదీ విదేశాల్లో. పాత తెలుగు స్పై సినిమాలు, హిందీ స్పై సినిమాలూ చూసినా ఇలాగే వుంటాయి. కానీ ఈ గూఢచారి మాత్రం తండ్రితో చిన్నప్పటి ఎడబాటు కథతో, తండ్రీ కొడుకుల సెంటిమెంట్లుగా వుంటుంది. కనుక దీన్ని గూఢచార కథ అనకుండా, ఓ యాక్షన్ కథ అనుకుంటే, ప్రపంచ గూఢచార పాత్రల జాతి పట్ల న్యాయంగా వుంటుంది. ఒకసారి మధుబాబు తన స్పై పాత్ర షాడోకి పెళ్లి చేసి, కుటుంబ జీవితాన్ని అంటగట్టారు. తెలివైన పాఠకులు గోలగోల చేశారు.
ఎవరెలా చేశారు
యాక్షన్ హీరోగా అడివి శేష్ పాసివ్ పాత్ర చేశాడు. చూస్తే ఆసాంతం పోరాటాలు చేస్తూనే కనబతాడు గానీ, అవి నిజానికి శత్రువులు చేసే దాడులని తిప్పికొట్టే రియాక్టివ్ పోరాటాలు. అసలిదంతా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు చిట్ట చివర్లో విలన్ చెప్తే గానీ తెలుసుకోలేడు. అంటే ఇది విలన్ చేతిలో నడిచే కథ. విలన్ పన్నిన వలలో చివరిదాకా హీరో. అందుకని ఇది పూర్తి స్థాయి పాసివ్ పాత్ర. ఒకవేళ గూఢచారి పాత్రే అనుకున్నా, గూఢచారి పాత్ర ఎక్కడైనా పాసివ్ గా వుంటుందా? ఈ పాత్రకి బహుశా స్ఫూర్తి తనే నటించిన ‘క్షణం’ లో పాత్రే. ఆ పాత్ర చివర్లో అనూహ్యంగా తన కూతుర్ని కనుక్కునే పాయింటుతో వుంటుంది. దీని మీదే కథ నడుస్తుంది. ప్రస్తుతం కూడా అనూహ్యంగా తండ్రిని కనుక్కున్నాడంతే. ‘క్షణం’ ని అటూఇటూ మారిస్తే, ‘గూఢచారి’ అయిందంతే. దీనికి సీక్వెల్ ల్ కూడా చేసేందుకు అవకాశంగా ముగింపు నిచ్చామన్నాడు. ఆ సీక్వెల్ లో ఇక అనూహ్యంగా తల్లిని కనుక్కుంటాడేమో. ఈ అనూహ్యంగా కనుక్కునే కథతో 2005 లో హిందీలో ‘సాయా’ అనే హార్రర్ ఆల్రెడీ వచ్చింది. అందులో హీరో తనకి పుట్టిన పాపని ఎక్కడో దేశంకాని దేశంలో అనూహ్యంగా కనుక్కుంటాడు.
ఇతర పాత్రల్లో జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లిద్దరి ఉద్దేశాలూ బలవంతంగా అతికించినట్టు వుంటాయి. ఇందుకే జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అడివిశేష్ ల మధ్య క్లయిమాక్స్ దృశ్యాలు సాగి సాగి, ఎలా తేల్చాలో తెలీని అవస్థలో పడినట్టు, చెప్పిందే చెప్తూ ఓపికని పరీక్షిస్తాయి. యాక్షన్ కథ ఎంత స్పీడుగా సాగుతూ క్లయిమాక్స్ కి వస్తుందో, క్లయి మాక్స్ లో అంత చతికిలబడి ఎంతకీ ముగియదు.
అక్కినేని మేనకోడలు సుప్రియ త్రినేత్ర ఏజెంట్ గా నటన ప్రొఫెషనల్ అన్నటు వుంది. హీరోయిన్ సిమ్రాన్ గా శోభిత, మరో ఏజెంట్ గా మధుశాలినిలవి చిన్న పాత్రలు. వెన్నెల కిషోర్ కామెడీ ఏమీ లేదు.
దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, స్క్రీన్ ప్లే గైడెన్స్ అంటూ అడివి శేష్, రాహుల్, శశికిరణ్, అబ్బూరి రవిలు పని చేశారు. కానీ ‘క్షణం’ లాంటి క్వాలిటీ, ప్రొఫెషనల్ రైటింగ్ మాత్రం కాదిది. చాలా క్లమ్సీ గా వుంది. ఇరవై ఏళ్ల క్రితం విడిపోయిన తండ్రీ కొడుకులు తిరిగి కలుసుకునే మూస ఫార్ములా కథకే దేశభక్తిని జోడించి (ఇదింకో జానర్ మళ్ళీ), ‘గూఢచారి’ అంటూ అటు తిప్పి ఇటు తిప్పి ముస్తాబు చేశారు. దీన్నే గూఢచారి కథతో కొత్తప్రయత్న
మంటున్నారు.
పాటలకి ప్రాధాన్యం లేదు. నేపధ్య సంగీతం యాక్షన్ దృశ్యాల్లో బావుంది. ఛాయాగ్రహణం ‘క్షణం’ లో వున్నంత ఉన్నతంగా మాత్రం లేదు. ఇక కొత్త దర్శకుడి ప్రతిభ ఏమిటో తెలిసే అవకాశం తక్కువ. యాక్షన్ డైరెక్టర్ కే సీన్లు ఎక్కువ.
చివరికేమిటి
ఫస్టాఫ్ అంతా హీరో ట్రైనింగ్ గురించే. ఇంటర్వెల్లో మాత్రమే టెర్రరిస్టుల దాడితో గదిలో పడుతుంది వ్యవహారం. హీరో చిన్నప్పటి కథ స్పూన్ ఫీడింగ్ చేయడానికే పది నిముషాలు తేసుకున్నారు. అతను ఏజెంట్ గ చేరినప్పటికీ కథ మొదలవదు. రిపీట్ దృశ్యాలతో మాటిమాటికీ ట్రైనింగే జరుగుతూంటుంది. ‘రా’ డేటా టెర్రరిస్టులు హ్యాక్ చేసి హీరో చేరాడని తెలుసుకోవడం సబబేనా? ట్రైనింగ్ ఇస్తున్న హీరోకి అమ్మాయిలతో జాగ్రత్తగా వుండాలని, ప్రేమా దోమా జాంతానై అని జాగ్రత్త చెప్పరా? అమాయకం గ మోసకారి హీరోయిన్ ప్రేమలో పది నాశనం చేసుకున్నాడే. ఇందుకే టెర్రరిస్టులు ఆ ఎత్తున దాడి చేసి బాసుల్ని కూడా హతమార్చారే. వెంటనే హీరోని ఈ పాయింటు మీద పట్టుకుని లోపలెయ్యాలి కదా? ఒక టెంప్లెట్ లో వున్నట్టు ఫస్టాఫ్ లో కథ మొదలవదు. ఒక ట్రైనింగ్ సీను, ఒక లవ్ సీను, ఒక పాట… ఇలా పూరీ మార్కు టెంప్లెట్ అందంగా, తెలియకుండా ప్రవహిస్తూంటుంది. త్రీనేత్ర అనేది అజ్ఞాతంగా వుండే సంస్థ అన్నారు. దాని ఉనికి కూడా ప్రపంచానికి తెలియకూడదు. అలాంటిది టెర్రరిస్టులు దాని గుట్టు తెలుసుకుని, అంత బహిరంగంగా, భారీ ఎత్తున దాడి చేస్తే, టీవీ ఆ ప్రసారాలతో అంతా రట్టయింది కదా. పైగా హీరోని పట్టుకోవడానికి పోలీసుల సహాయం తీసుకోవడమేమిటి? గుట్టు కాపాడుకునే ప్రయత్నమే చేయకుంటే అదేం సీక్రెట్ ఏజెన్సీ? మామూలు పోలీసు శాఖే కదా. పారిపోతున్న హీరో ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ లో మారిపోతూంటాడు. నేవీ కెప్టెయిన్ గా కూడా! ఒక చోట టెకలిస్కోపిక్ రైఫిల్ తో షూట్ చేసే స్తూంటాడు. గన్ ఎక్కడిదని పక్క ప్రేక్షకుడు ఆశ్చర్యంతో అరుస్తాడు. ఇలా లాజిక్ ని, జానర్ మర్యాదనీ వదిలేసి పాసివ్ గా చూస్తే, ఇదొక మంచి యాక్షన్ థ్రిల్లర్.