(సికిందర్)
‘పేపర్ బాయ్’
దర్శకత్వం : వి. జయశంకర్
తారాగణం : సంతోష్ శోభన్, తాన్యా హాప్, రియా సుమన్, పోసాని, విద్యారామన్, జయప్రకాష్ రెడ్డి తదితరులు
రచన : సంపత్ నంది, సంగీతం : భీమ్స్, ఛాయాగ్రహణం: సౌందర రాజన్
బ్యానర్ : సంపత్ నంది టీం వర్క్స్
నిర్మాత : సంపత్ నంది
విడుదల : ఆగస్టు 31, 2018
మా రేటింగ్ 1.75 / 5
దర్శకుడు సంపత్ నంది కొత్త దర్శకులకి అవకాశమిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2014 లో నవీన్ గాంధీకి అవకాశమిస్తూ ‘గాలిపటం’ నిర్మించారు. నవీన్ గాంధీ రెండో అవకాశం కోసం బయట ఇంకా ప్రయత్నాల్లో వున్నారు. ఇప్పుడు షార్ట్ మూవీస్ మేకర్ జయశంకర్ కి అవకాశమిచ్చారు సంపత్ నంది. మూడేళ్ళకో సినిమా నటిస్తున్న హీరో సంతోష్ శోభన్, 2012 లో ‘గోల్కొండ స్కూల్’, 2015 లో ‘తను నేను’ తర్వాత ఇప్పుడు ‘పేపర్ బాయ్’ తో ప్రేక్షకులకి కాస్త కన్పిద్దామని ముందుకొచ్చాడు. షరా మామూలుగా మరో ఇద్దరు కొత్త హీరోయిన్లు పరిచయమవుతున్నారు తెలుగుకి. ఈ ‘పేపర్ బాయ్’ ప్రేమకథ నిర్మాత అల్లు అరవింద్ కి నచ్చి విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. నిర్మాతగా సంపత్ నంది ‘గాలిపటం’ తో సక్సెస్ కాలేదు. మరి ‘పేపర్ బాయ్’ తో సక్సెస్ అవుతారా? ఇదొకసారి చూద్దాం…
కథ
బీ టెక్ చదివి పేపర్ బాయ్ గా పనిచేసే పేదింటి రవి (సంతోష్ శోభన్), పేపరు వేస్తూ పెద్దింటి మేఘా (తాన్యా హాప్) మీద మనసు పడతాడు. అతడి నీతీ నిజాయితీ, మంచి సంస్కారం, అలవాట్లు, నీతులు చెప్పే పెద్ద మనసు, కుక్క గాయపడితే చూపే దయార్థ్ర హృదయం, అమ్మాయిలతో అల్లరి చెయ్యని అతి బుద్ధిమంతుడి లక్షణం, పెద్దలకి చెప్పి పెళ్లి చేసుకోవాలనే అతిమంచి గుణం, ఇత్యాది సల్లక్షణాలూ ఆమెకి విశేషంగా నచ్చి ప్రేమిస్తుంది. ఒక రోజు పార్టీకి పిల్చి మంచి బట్టలు కొనిస్తుంది. ఆ బట్టలేసుకుని పార్టీ కెళ్ళిన రవిని తన బాయ్ ఫ్రెండ్ గా అందరికీ పరిచయం చేస్తూ, పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని బిల్డప్ ఇస్తుంది. దీంతో రవి హృదయం అమితంగా గాయపడి ఆమెకి దూరమవుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా కలిసి, తమ పవిత్ర ప్రేమానుబంధాన్ని పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా పెళ్ళితో మూడేసుకున్నారన్నది మిగతా మహోజ్వల గాథ.
ఎలావుంది కథ
యూత్ అప్పీల్ కి వాస్తవ దూరమైన పాత ఫార్ములా కథ. తెర మీద చూస్తున్నప్పుడు, ఇది అచ్చులో లభిస్తే చదువుకోవడానికి బావుంటుందన్పించే కథ. షార్ట్ మూవీగా తీసినా కూడా వర్కౌట్ అవచ్చనే కథ. అచ్చులో కథలో పాత్రల్ని, షార్ట్ మూవీస్ లో పాత్రల్ని, సినిమాకి మల్చడంలో విఫలమైన కథ. సమకాలీన సినిమాకి దూరంగా పేదింటి అబ్బాయి –పెద్దింటి అబ్బాయి ‘కోటలో రాణి – పేటలో రాజా’ టైపు ఎన్నోసార్లు తెలిసితెలిసి – తెలిసీ వున్న పురాతన కథ. రోమాంటిక్ కామెడీ అవలేదు సరేకదా, వున్న కథతో రోమాంటిక్ డ్రామాగా నైనా దీనికి విలువ కన్పించడం లేదు. యూత్ కి కావాల్సింది గిటార్ ప్రేమ సినిమాలేగానీ, వీణ ప్రేమ సినిమాలు కాదనేది ఒక మార్కెట్ వాస్తవం. దీనికి దూరంగా ‘అమార్కెటీయ మర్కటం’ గా నిల్చిన కథ అని చెప్పడానికి విచారించాల్సి వస్తోంది.
ఎవరెలా చేశారు
ఇటీవలే నవయువ హీరో సంతోష్ శోభన్, ఒక యూత్ ఫుల్ రోమాంటిక్ థ్రిల్లర్ కథ విని ఎక్సయిట్ అయ్యాడు. కానీ మళ్ళీ మనసు మార్చుకుని లవ్ స్టోరీ చేస్తానన్నాడు. తన అవగాహనలో లవ్ స్టోరీ అంటే ఏమిటో, లవర్ పాత్ర అంటే ఏమిటో ఇప్పుడీ మూవీ చూస్తే అర్ధమైపోతుంది. ముందు సంతోష్ బాబు ఇప్పటి సినిమా కథంటే ఏమిటో తెలుసుకోవా
ల్సిన అవసరం చాలా వుంది.
ప్రస్తుత మూవీలో ఏమీ చెయ్యని ఒక పాసివ్ పాత్ర పోషించాడు. అందుకే ఈ పాత్ర సినిమాకి దూరంగా – అచ్చులో కథకి, షార్ట్ మూవీకీ దగ్గరగా వుంది. యూత్ కి కనెక్ట్ అయ్యే విషయం అలావుంచితే, ఎంటర్ టైన్మెంట్ కి ఏమాత్రం మ్యాచ్ అవని ‘రాముడు అతిమంచి బాలుడు’ టైపు పాత్ర చిత్రణతో, స్వగతం చెప్పుకుంటున్నట్టు వుండే డైలాగులతో, ప్రేమలో ఏ మాత్రం చైతన్యం లేని తనంతో (చూస్తూ చూస్తూ వుంటే, ముప్పావు గంటకి హీరోయిన్ ని బైక్ మీద ఎక్కించుకుని దూసుకుపోతున్నప్పుడు తీసిన షాట్స్ తో ఒక్కసారి మనకి ప్రాణం లేచివచ్చి – హమ్మయ్య ఇక హీరో యాక్టివ్ అయ్యాడనుకుంటాం. ఈ ఆనందం ఈ షాట్స్ వరకే. మళ్ళీ షరా మామూలు నీరసమే) సహనపరీక్ష పెట్టాడు. తన పోలికలు కూడా కొన్ని సార్లు శోభన్ బాబుతో కలవడం వల్ల, ‘బలిపీఠం’ లో శోభన్ బాబుని గుర్తుకు తెస్తాడు సంతోష్ శోభన్!
‘తను నేను’ లో మాంచి ఈజ్ తో, ఫుల్ యాక్టివ్ గా నటించి ఆశ్చర్య పర్చిన సంతోష్ ఇతనే అంటే నమ్మలేం. కానీ ఏం చేస్తాడు- ఇప్పుడు నటిస్తున్న పాత్ర అంత నీరసంగా వుంటే.
హీరోయిన్ పాత్ర హీరోకి మించిన పాసివ్ పాత్ర. ఈ కాలపు అమ్మాయిలు ఈ చాదస్తపు పాత్రలో హీరోయిన్ తాన్యాతో కనెక్ట్ అవడం చాలా కష్టం. అవాస్తవిక పాత్ర చిత్రణ ఇది. దాసరి నారాయణ రావు, బాలచందర్, జంధ్యాల, వంశీలు తీసిన ఆ కాలపు ప్రేమ సినిమాల్లో కూడా హీరోయిన్ పాత్రలిలా– కాలం నుంచి వేర్పడి చాదస్తపు సుత్తితో వుండరు.
హీరోయిన్ అన్నలుగా నటించిన ఇద్దరూ రాంగ్ కాస్టింగ్. ఇక చెప్పుకో దగ్గ పాత్రలు లేవుగానీ, బిత్తిరి సత్తి వున్నాడు – కామెడీ లేని కథలో కాస్సేపు కామెడీని గుర్తు చేయడానికి.
సంగీతం విషయానికి వస్తే, ఇక ప్రస్తుత సినిమాలని సంగీతమే సూపర్ హిట్ చేయాలి. కథాకథనాలు వుండని సినిమాలకి ఐదారు సూపర్ హిట్ క్యాచీ సాంగ్స్ వుంటే తప్పకుండా హిట్టయి పోతాయి. హిందీలో ఒకప్పుడు ఇదే జరిగింది. శంకర్ – జైకిషన్, లక్ష్మీ కాంత్ – ప్యారే లాల్, ఆర్డీ బర్మన్ ల వంటి ఎందరెందరో సంగీత దర్శకులు పనిచేసిన చాలా పాపులర్ హీరోల సినిమాల్లో కథలే వుండవు. కేవలం ఈ సంగీత దర్శకులు సృష్టించే ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ సాంగ్స్ కోసమే మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులు వెళ్ళేవాళ్ళు. సిల్వర్ జూబ్లీలు కూడా ఆడేవి పాటలతోనే!
ఈ పద్ధతైనా ఇప్పుడు తెలుగు సినిమాలకి వాడుకుంటే, అసలే కంటెంట్ లేకుండా పోతున్న తెలుగు సినిమాలకి కంఠంలో ప్రాణం వుండే అవకాశముంది. ప్రస్తుత మూవీలో బీమ్స్ ఇంకా ఈ పనేమీ చేయలేదు గానీ, అదేమిటో మొదటి సీను నుంచి చివరిదాకా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పేరుతో ఒకటే హెవీ ఆలాపనలు విన్పించి, ఆద్యంతం విషాద రసాన్ని రంగరించి పెట్టాడు. దీంతో సినిమా చూసే మనబోటి నిస్సహాయ ప్రేక్షకులం డార్క్ మూడ్ లోనే వుండిపోతాం యావత్తూ. పోతే సౌందర రాజన్ కెమెరావర్క్ మాత్రం బావుందని చెప్పొచ్చు.
చివరికేమిటి
సంపత్ నంది రైటర్ గా విఫలమయ్యారు. స్ట్రక్చర్ లేని స్క్రీన్ ప్లీతో ఇష్టారాజ్యంగా కథని తిప్పుకుంటూ పోయారు. ముందుగా ఆయన దర్శకత్వం వహించిన బిగ్ కమర్షియల్ మూస ఫార్ములా చిత్రణల్లోంచి బయట పడి- దీన్నొక రియలిస్టిక్ యూత్ ఫుల్ ప్రేమకథగా రచన చేయాల్సింది, చేయబోయారు – అయితే ఫస్టాఫ్ రియలిస్టిక్ చేయడానికి విఫలయత్నం చేసి, ఇక వల్ల కాక – సెకండాఫ్ లో పూర్తిగా పాత మూస ఫార్ములా బాట పట్టేశారు. ఆయనలోని బిగ్ కమర్షియల్స్ మూస ఫార్ములా రైటర్ ప్రభావం అంతగా వుంది.
కథ ఎప్పుడు ఎక్కడ ప్రారంభమవుతుందో అంతు పట్టకుండా చేశారు. ఇంటర్వెల్లో హీరో హర్ట్ అయి విడిపోయాక, సెకండాఫ్ ప్రారంభం లోనే మళ్ళీ ఆమెతో కలిసిపోతాడు. ఇంటర్వెల్ దగ్గర గోల్ గా చూపించిన అతడి ఇగో ప్రాబ్లంతోనైనా సెకండాఫ్ ఆ కథేదో నడపకుండా, ఆ గోల్ ని అప్పుడే తేల్చేశారు. ఇక హీరోయిన్ తన పేరెంట్స్ లో కలపడమూ, ఆ పేరెంట్స్ పెళ్ళికి ఒప్పుకోవడమూ జరిగాక, ఇదంతా జరుగుతూంటే, మిడిల్ లో పడ్డ స్క్రీన్ ప్లే మళ్ళీ బిగినింగ్ విభాగం కథనంలో పడినట్టయ్యింది. ఆ తర్వాత ఫారిన్ నుంచి వచ్చే ఆమె అన్నలని పెళ్ళికి అడ్డమేసి ప్లాట్ పాయింట్ వన్ సృష్టించారు. దీంతో మళ్ళీ మిడిల్ ప్రారంభించి నట్టయింది. ఇలా గజిబిజి చేస్తూ దాదాపు సెకండాఫ్ సగంలో ఈ మూస కథని ప్రారంభించడం వల్ల, స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ బారిన కూడా పడి ముక్కలైంది. దీంతో ఇక క్లయిమాక్సూ ముగింపూ ప్రేక్షకులు ముందుగానే వూహించేలా తయారయ్యాయి. అవి రెండూ చాలా హస్యస్పదంగానూ తయారయ్యాయి. సంపత్ నంది రైటర్ గా పాసివ్ పాత్రలతోనే రియలిస్టిక్ గా కథ నడపలేకపోయారు – పైగా మూస ఫార్ములా తోనూ స్ట్రక్చర్ పరంగా సిన్సియర్ గా వుండ లేకపోయారు. అందుకే ఇలా నంది అయినా, ఇంకెవరైనా స్ట్రక్చర్ ని తొక్కేసి కసి తీర్చుకోవాలనుకుప్పుడు, సూపర్ హిట్ క్యాచీ పాటలతోనైనా సినిమాల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని మాత్రం ఒక్కటే మనం కోరుకోగలం.
దర్శకుడుగా పరిచయమైన జయశంకర్, ముందుగా కొన్ని సినిమాలకి పనిచేసి మూవీ మేకింగ్ నేర్చుకోవాలన్పిస్తుంది. షార్ట్ మూవీస్ తీసి వచ్చిన తను షార్ట్ మూవీస్ కుండే స్లో నడక, సినిమాలకి వుండదని గ్రహించాలి. ఒక్క హీరో హీరోయిన్ని బైక్ ఎక్కించుకుని జామ్మని దూసుకుపోతున్నప్పుడు తప్ప, మిగతా మూవీ అంతా షార్ట్ మూవీ స్లో నడకే. విమానం లాండయ్యే సీనుకూడా నీరసమే. అలాగే, సీన్ల పరంగా కూడా సినిమా సీన్ల సన్నివేశ కల్పన వేరేగా, స్ట్రాంగ్ గా వుంటుందని కూడా గమనించాలి.