ముందస్తు ముచ్చట గుప్పిట పట్టిన కేసిఆర్.. నేతల్లో టెన్షన్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. అసలు ముందస్తు వస్తాయా రావా అన్న చర్చలు కూడా ఉన్నాయి. తెలంగాణ చర్చలన్నీ ముందస్తు చుట్టే తిప్పుతున్నారు కేసిఆర్. దీనిపై చర్చిస్తున్నారు తప్ప ఇప్పటి వరకు క్లారిటీ మాత్రం ఇవ్వడంలేదు. ఒకవైపు తామేమీ ముందస్తు అనలేదని చెబుతూనే ఆ దిశగా కలదికలు ఉంటున్నాయి. అసలు టిఆర్ఎస్ లో ఏం జరుగుతోంది అన్న చర్చలు సాగుతున్న తరుణంలో తెలంగాణ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, కీలక నేతల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సైతం కేసిఆర్ ముందస్తు ముచ్చటను తేల్చలేదు. ఇంకా తన గుప్పిట పట్టారు. అయితే తెలంగాణ భవన్ లో కేవలం గంటపాటే జరిగిన సమావేశంలో కేసిఆరే మాట్లాడారు. ప్రగతి నివేదన సభకు భారీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంకా కేసిఆర్ ఏం మాట్లాడారో చదవండి.

తెలంగాణ భవన్ లో టిఆర్ ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. దాదాపు  గంట పాటు జరిగిన సమావేశంలో పూర్తిగా కేసీఆరే మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రగతి నివేదన సభ, సభ విజయవంతంపై వ్యూహాలను నేతలకు కేసీఆర్ వివరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఎన్నికలు ఎప్పుడనేది తనకే వదిలేయాలని కేసీఆర్ అన్నారు. దీంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే మొగ్గుచూపుతున్నట్టు స్పష్టమైంది.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అలాగే సభ విజయవంతానికి ప్రతి నియోజకవర్గం నుంచి 25 వేల మంది సభ్యులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సభ్యులకు సూచించారు. హైదరాబాద్ అంతా టిఆర్ ఎస్సే గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టిఆర్ ఎస్ పార్టీ బలంగా ఉందని ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఆయన సభ్యులతో అన్నారు.

డిసెంబర్ లో ఎన్నికలు వెళ్లాలనే అంశంపై చర్చినట్టు తెలుస్తోంది. డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్తే సెప్టెంబర్ లో నే అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని ఎలా వెళ్లాలనే దానిపై ఆయన నేతలతో చర్చించారు. కేసీఆర్ డిసెంబర్ లోనే ఎన్నికలకు వెళ్లనున్నారని నేతల ద్వారా తెలుస్తోంది. టిఆర్ ఎస్ క్యాడర్ ఫుల్ జోష్ లో ఉందని మనం చేసిన అభివృద్దే మనల్ని గెలిపిస్తుందని ఆయన సభ్యులతో అన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉండటంతో గంటలోనే సమావేశం ముగిసింది. ముందస్తు విషయాన్ని వదిలేసి ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నేతలతో అన్నారు.