కెటిఆర్ మళ్లీ నెంబర్ వన్… ఈ సారి ఎందులోనో తెలుసా?

 

ఇపుడు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థుల పెట్టిన ఖర్చు వివరాలను ఎన్నికల కమిషన్ కు అందించారు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం, టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావే ఎన్నికల ఖర్చు సంబంధించి నెంబర్ వన్ అయ్యారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలోనే కాదు, ఖర్చను తగ్గించడంలో కూడా ‘దిట్ట’ అని రుజువుచేసుకున్నారు.

రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత తక్కువగా డబ్బు ఖర్చు చేసిన ‘గెల్చిన’ ఎమ్మెల్యే ఆయనే.

ఆలిండియా లెక్కలు లేవుగాని, బహుశా దేశంలోనే అంత్యంత తక్కువ ఖర్చు చేసిన గెల్చిన ఎమ్మెల్యే కూడా ఆయనే కావచ్చు. ఇదేలా సాధ్యమయిందో ఆయన దేశమంతా తిరిగి ఉపన్యాసాలివ్వాల్సిన అవసరముంది. ఇంతకీ సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నిక మీద ఆయన ఖర్చు చేసిన మొత్తం ఎంతోతెలుసా? నమ్ము, నమ్మకపోతే, అది  కేవలం 7 లక్షల 75 వేల రుపాయలు మాత్రమనని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

 

సోర్స్: టైమ్స్ ఆఫ్ ఇండియా

అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు రు 28 లక్షల దాకా ఖర్చు చేయవచ్చని ఎన్నికల కమిషన్ చెప్పింది.  ఆయిత,ఆ మొత్తం కూడా ఖర్చు చేయకపోవడమే కాదు, మినిమమ్ ఖర్చుతో ఎన్నికల్లో గెలుస్తున్నవారు మనవాళ్లు.

నిజానికి నెంబర్ వన్ స్థానం కాంగ్రెస్ కోడంగల్ అభ్యర్థి ఎ రేవంత్ రెడ్డికి దక్కాలి. అయితే, ఆయన ఓడిపోయారు. ఆయన ఖర్చు చేసింది మరీ తక్కువగా కేవలం రు. 7.44 లక్షలే.

ఎన్నికల కమిషన్ కు అందిన సమాచారం ప్రకారం తెలంగాణలో అత్యంత ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది శేరిలింగం పల్లి టిఆర్ ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ. ఆయన 23.92 లక్షల రుపాయలు ఖర్చు చేశారు.

తర్వాతి స్థానం సనత్ నగర్ టిఆర్ ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ ది. ఆయన ఎన్నికల ఖర్చు రు. 23.31 లక్షలు.

కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిరెడ్డి ఎన్నికల ఖర్చు రు. 20.58 లక్షలు.

ఈలెక్కల ప్రకారం చూస్తే, మాజీ కమ్యూనిస్టునేత, నాగార్జున సాగర్ టిఆర్ ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య కూడా బాగానే ఖర్చు చేశారు. ఆయన ఎన్నికల వ్యయం రు. 20.24 లక్షలు.

మిగతా వాళ్లెవరూ ఇంత పెద్దగా కూడా  ఖర్చు చేయకుండా నే గెల్చారు. వారి ఎన్నికల ఖర్చుల లెక్కలు : జి జగదీష్ రెడ్డి టిఆర్ఎస్ (రు.16.10 లక్షలు ), పువ్వాడ అజయ్ కుమార్ టిఆర్ ఎస్ (రు. 15.33లక్షలు),కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ (రు.14.58 లక్షలు),తమ్మల నాగేశ్వరరావు టిఆర్ ఎస్ (14.44 లక్షలు), అక్బరుద్దీన్ ఒవైసీ ఎంఐఎం (రు.12.97 లక్షలు), మాగంటి గోపీనాధ్ టిఆర్ ఎస్ (రు.12.54 లక్షలు), కెటి రామారావు టిఆర్ ఎస్ (7.75లక్షలు). పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖర్చు రు.15.33 లక్షలు.

జిల్లా అధికారులకు ఇంకా చాలా మంది అభ్యర్థులనుంచి వివరాలు అందలేదు. గజ్వేల్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎన్నికల ఖర్చు వివరాలు ఇంకా వెల్లడి కావడం లేదు. అలాగే, సిద్ది పెట్టె టిఆర్ ఎస్ అభ్యర్థి టి హరీష్ రావు ఎన్నికల ఖర్చు వివరాలు బయటకు పొక్కలేదు.