బిజెపి గూటికి తెలంగాణ జడ్జి, రాజీనామా ఆమోదమే తరువాయి

తెలంగాణ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధారిటీ కోర్టు  జడ్జి రవీందర్ రెడ్డి త్వరలో బిజెపిలో జాయిన్ కానున్నారు. మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన జడ్జి రవీందర్ రెడ్డి తెలంగాణలో హాట్ టాపిక్ గా నిలిచారు. ఆయన తీర్పుతోనే కాదు.. తీర్పు వెలువరించిన క్షణాల్లో జడ్జి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు రాజీనామా ఆమోదం పొందే వరకు తనకు సెలవు మంజూరు చేయాల్సింది హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఆయన అప్పీల్ చేసుకున్నారు.

జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా వెనుక ఏం జరిగింది? ఎందుకు రాజీనామా చేశారన్న విషయాలు పక్కన పె డితే ఆయన రాజీనామా ఆమోదం పొందిన తర్వాత తన ప్రయాణం గురించి మీడియా ముందుకు వస్తానని ప్రకటించారు. ఇటీవల కాలంలో జడ్జీల అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా ఏసిబి అధికారులు అవినీతికి పాల్పడిన ముగ్గురు జడ్జీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకే జడ్జీల మీద ఎసిబి రైడ్స్ చేసినట్లు వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులందరిని నిర్దోషులుగా తీర్పు చెప్పారు జడ్జి రవీందర్ రెడ్డి.  తీర్పు వెలువరించిన వెంటనే వ్యక్తిగత కారణాల రిత్యా తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను చీఫ్ జస్టిస్ కు పంపారు. అయితే తీర్పు నేపథ్యంలో ఏమైనా వత్తిళ్లు వచ్చాయా అన్న చర్చ కూడా జరిగింది.

జడ్జి రవీందర్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లా. ఆయన న్యాయాధికారుల సంఘంలో కీలక పాత్ర పోశిస్తున్నారు. రెండేళ్ల కిందట ఎపికి చెందిన జడ్జీలను తెలంగాణ జడ్జీలుగా నియమించొద్దంటూ తెలంగాణకు చెందిన 11 మంది న్యాయమూర్తులు ఆందోళన చేశారు. వారిలో రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆందోళన చేసిన జడ్జీలను సస్పెండ్ చేశారు. రవీందర్ రెడ్డి కూడా సస్పెండ్ అయ్యారు. రవీందర్ రెడ్డి మరో రెండు నెలల్లోనే రిటైర్డ్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన బిజెపిలో చేరనున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి.