ఖమ్మం టిఆర్ఎస్ లో ముదిరిన వివాదం… తీవ్ర వ్యాఖ్యలు చేసిన పిడమర్తి

అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా ఖమ్మం టిఆర్ఎస్ లో మాత్రం విబేధాలు రగులుతూనే ఉన్నాయి. నేతల మధ్య వర్గ పోరు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. నిత్యం హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచే టిఆర్ ఎస్ నేత పిడమర్తి రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్సదమయ్యాయి. 

సత్తుపల్లి అసెంబ్లీ నుంచి పిడమర్తి రవి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటి చేశారు. కానీ ఆయన ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మట్ట దయానంద్ విజయ్ కుమార్ కోవర్టుగా పని చేశారని అందువల్లనే తాను ఓడిపోయానన్నారు. అందుకే మట్టా దయానంద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఇప్పటికే కేసీఆర్, కేటిఆర్ లకు తాను ఫిర్యాదు చేశానన్నారు.ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గతంలో కూడా పిడమర్తి రవి దయానంద్ పై వ్యాఖ్యలు చేశారు. పిడమర్తి రవి స్థానంలో దయానందే పోటి చేసేవారని కానీ అధిష్టానం సూచనతో దయానంద్ పోటిలో లేరని కార్యకర్తలు ద్వారా తెలుస్తోంది.

పిడమర్తి రవి వ్యాఖ్యల పై దయానంద్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దయానంద్ తో వారు అప్పటికప్పుడు సమావేశమై రవి వ్యాఖ్యల పై చర్చించారు. ఇక మౌనంగా ఉండొద్దని ఎన్నాళ్లు ఈ అవమానాలు భరించాలని వారు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మౌనంగా ఉండడం వల్లనే తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఇక భరించాల్సిన అవసరం లేదని పిడమర్తితో తాడోపేడో తేల్చుకోవాలని దయానంద్ కు కార్యకర్తలు తెలిపారు.

 మట్టా దయానంద్ విజయ్ కుమార్ పిడమర్తి వ్యాఖ్యల పై మీడియా సమావేశంలో స్పందించారు. ఆయన ఏమన్నారంటే…

“ టిఆర్ఎస్ పార్టీ పిడమర్తి రవి జాగీర్ కాదు. ఆయన కూడా ఇతర పార్టీ నుంచి వచ్చి టిఆర్ఎస్ లో చేరారు. రవికి కనీసం నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియదు. నేను వైసిపి నుంచి టిఆర్ఎస్ లో చేరినప్పుడే కార్పోరేషన్ చైర్మన్ పదవితో పాటు ఎమ్మెల్యే టికెట్ హామీనిచ్చారు. అప్పటి నుంచి పార్టీ కోసం అహర్నిషలు పని చేశాను. ఇంచార్జ్ గా ఉన్న పిడమర్తి నన్ను ఎవరితో కలవకుండా చేశాడు. నాతో పాటు వచ్చిన వారికి పదవులు రాకుండా అడ్డుకున్నాడు. నా సామాజిక వర్గం పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ అవమానాలకు గురి చేశాడు.

నేను అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్దిగా పోటి చేయాలని నిర్ణయించుకోగా తుమ్మల, ఎంపీ పొంగులేటి ఆపారు. కేసీఆర్, కేటిఆర్ హామీలతో పార్టీ కోసం పని చేశాను. తాను కోవర్టును అంటూ రవి చేసిన వ్యాఖ్యల్లో అర్ధం లేదు. నేను కోట్ల రూపాయలు దండుకున్నానని అసత్య ప్రచారం చేశాడు. పిడమర్తి ద్వారా ఎన్ని గ్రామాల్లో సర్పంచ్, మండల పదవులు గెలుచుకున్నారో చెప్పాలి. నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. కేసీఆర్, కేటిఆర్ లకు అంతా తెలుసు.

పిడమర్తి రాజకీయ జీవితం, ఆయన బండారం అందరికి తెలుసు. నేను డాక్టర్ ని. ఒక్క రిమార్క్ లేకుండా పని చేశాను. పార్టీ కోసం పని చేసి నేను అప్పుల పాలయ్యాను. నా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చినా భరించుకుంటు వచ్చినా. నోర్మూసుకోని కూర్చుంటా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. త్వరలోనే పార్టీ ఎవరిని సస్పండ్ చేస్తుందో తెలుస్తది. నా అనుచరులు కూడ ఒపికతో ఉండాలి. “ అని దయానంద్ అన్నారు.  

ఖమ్మంలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను టిఆర్ఎస 1 స్థానానికే పరిమితమైంది. ఇప్పటికే ఈ జిల్లాలో జరిగిన పరిణామాల పై అధినేత గుర్రుగా ఉన్నారు. తాజాగా మళ్లీ వివాదం రగులుతుండడంతో గులాబీ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది.