ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన భారత్ రాష్ట్ర సమితి (తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారింది), కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సర్వసన్నద్ధంగా వున్నాయి. కేసీయార్‌తో అత్యంత సన్నిహితంగా వుంటోన్న మజ్లిస్ పార్టీ సంగతి సరే సరి.
చిత్రంగా, తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఫోకస్ పెట్టారు. 10 అసెంబ్లీ సీట్లలో గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట జనసేనాని. ఇదసలు సాధ్యమయ్యే పనేనా.? అన్నది వేరే చర్చ. కానీ, ఆయనా రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇంతకీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పరిస్థితేంటి.? ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారు. పార్టీ అధినేత్రి పోటీ చేసే నియోజకవర్గం పేరు ఖరారైంది తప్ప, పార్టీలో ముఖ్య నేతలనదగ్గవారెవరూ కనిపించడంలేదు.
పాలేరు కంటే సికింద్రాబాద్ నియోజకవర్గం సేఫ్ అన్న ఆలోచనలో షర్మిల వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ‘రాజశేఖర్ రెడ్డి బిడ్డ చెప్పింది.. పాలేరు నుంచే పోటీ చేస్తా..’ అంటూ షర్మిల తెగేసి చెప్పారు తాజాగా.
‘మేం అధికారంలోకి వస్తాం.. ప్రజల్లో రాజశేఖర్ రెడ్డి పట్ల అభిమానం చాపకింద నీరులా విస్తరించింది..’ అన్నది వైఎస్ షర్మిల ఉవాచ. కానీ, పార్టీ అధినేత్రి గెలవడంపైనే ఆ పార్టీ శ్రేణుల్లో అనుమానాలున్నాయి.
ఎవరో ఒకరి విజయావకాశాల్ని దెబ్బ తీయడం తప్ప, వైటీపీకి పెద్దగా వచ్చే ఎన్నికలతో ఒరిగేదేమీ లేదన్నది రాజకీయ విశ్లేషకుల భావన.