కేసీఆర్ పాలన పై సోనియా గాంధీ చురకలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మేడ్చల్ బహిరంగ సభలో సోనియా గాంధీ పాల్గొన్నారు. ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. కష్టనష్టాలకు ఓర్చి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాలు పెట్టడంతో జనాలంతా ఆసక్తిగా ఆమె రాకను స్వాగతించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియాగాంధీకి క్యాన్సర్ తీవ్రమైంది.  దీంతో ఆమె వైద్యం అనంతరం పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీకి అప్పగించారు.

అనారోగ్యం, రాహుల్ కు పగ్గాలు ఇచ్చిన కారణంగా సోనియాగాంధీ తెలంగాణ కు వచ్చే అవకాశం రాలేదు. ముందస్తు ఎన్నికలకు కేసిఆర్ తెర తీయడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీతో సభ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. దీంతో ఆమె మేడ్చల్ సభకు వచ్చి ప్రసంగించారు. కొద్దిసేపే మాట్లాడినా ఆమె కేసిఆర్ పాలనను గట్టిగానే ఎండగట్టారు. తెలుగు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో అడుగు పెడితే తల్లి బిడ్డ దగ్గరకు వచ్చినట్టుందన్నారు. ఆమె ఇంకేం మాట్లాడారంటే…. 

“తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఇది సాధ్యమయ్యే   పనేనా అనిపించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను చూసి ఉద్యమాన్ని చూసి ఆవేదన చెందాను. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి రాష్ట్రాన్ని ఇచ్చాం. ఓ వైపు ఆంద్రా ప్రజల బాగోగులు చూస్తునే తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాం. తెలంగాణ కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడే ఆంధ్రా ప్రజల బాగోగులు కూడా ఆలోచించి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడే బిల్లులో పెట్టాం. తెలంగాణ ఇవ్వడం కాంగ్రెస్ కు నష్టమని తెలిసినా కూడా ప్రజల బాగు కోసం ఇచ్చాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తెలంగాణ సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టింది.

తెలంగాణ ప్రజలు కన్న కలలు నెరవేరయా అని ప్రశ్నిస్తున్నా.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో మీరు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధిస్తే వాటిలో ఏ ఒక్క దానిని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం నిజం చేసిందా అని అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన విధానమే పూర్తిగా మర్చిపోయి కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రైతులకు బాగు చేయడం పక్కకు పెడితే కష్టపడి తీసుకొచ్చిన భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కింది తెలంగాణ ప్రభుత్వం.    

తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా ఉద్యోగాలు లేక ఏడుస్తున్నారు. ఉద్యోగాలు ఎప్పుడొస్తాయని వేడుకుంటున్నారు. నేను గతంలో తెలంగాణకు వచ్చినప్పుడు స్వయం సహాయక బృందాలను చూసి గర్వపడేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మహిళలు కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది. దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు తెలంగాణ మహిళా సంఘాల గురించి గొప్పగా చెప్పేదాన్ని. కానీ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మహిళ సంఘాలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ సమయంలో మీరు కన్న కలలు నెరవేరలేదు.

విద్యార్ధుల భవిష్యత్ , నిరుద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం వాళ్ల కుటుంబాలే బాగు పడ్డాయి. మాట మీద నిలబడని వారు, అబద్దాలు చెప్పేవారు వాళ్లు.. వాళ్లని నమ్మవద్దు. టిఆర్ఎస్ పాలనలో వాళ్ల బంధు మిత్రులు మాత్రమే బాగుపడ్డారు. చిన్న పిల్లవాడి పెంపకంలో తప్పులు ఉంటే ఎలా అయితే జీవితం నాశనం అయితదో నాలుగున్నరేళ్ల టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ పరిస్థితి అలా తయారయ్యింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా అయితే కోట్లాడిర్రో ప్రజాస్వామ్య తెలంగాణ కోసం కొట్లాడాల్సిన అవసరముంది. మళ్లీ ఉద్యమించాల్సిన అవసరముంది. మీ లోతైన విశ్లేషణతో కాంగ్రెస్, ప్రజా కూటమి అభ్యర్దులను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను”. అని సోనియా గాంధీ ప్రసంగించారు.