వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు కీలక వ్యవహారాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. జన బాహుళ్యంలోనూ ఇవే చర్చనీయాంశాలుగా మారాయి. ఒకటి హైద్రాబాద్‌కి వెళ్ళి ఓ వాలంటీరు, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడమైతే, ఇంకోటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వ్యవహారం.!
హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లబ్దిదారుడి దగ్గరకు వెళ్ళి వాలంటీరు, పెన్షన్‌ని అందించడం ఎందుకు చర్చనీయాంశమయ్యిందంటే, అంత దూరం ఖర్చులు పెట్టుకుని వెళ్ళి పెన్షన్ ఇవ్వడమెందుకు దండగ కాకపోతే.? అని.!
నిజమే మరి.! కొన్ని రోజులు ఆగొచ్చు.. లేదా, వచ్చే నెలలో ఆ వ్యక్తికి పెన్షన్ అందించొచ్చు. ఇవేవీ కాదంటే, ఆన్‌లైన్ ద్వారా చెల్లింపు చేసేసి, ఆ తర్వాత వీలు చూసుకుని, బయోమెట్రిక్ నమోదు చేయవచ్చు కదా.!
గతంలోనూ ఏపీ వాలంటీర్లు, తెలంగాణలో ఇలా పెన్షన్లు పంచడం, వాటిని వైసీపీ విపరీతంగా పబ్లిసిటీ చేసుకోవడం చూశాం. రాష్ట్రంలో వైద్యం సరిగ్గా లేకపోవడంతోనే, పొరుగు రాష్ట్రాలకు వైద్య చికిత్స నిమిత్తం ప్రజలు వెళుతున్నారనే సంకేతం ఈ వ్యవహారంతో వెళ్ళినట్లయ్యింది.
ఇంకోపక్క, వాలంటీర్ ఎలాగూ సొంత ఖర్చులు పెట్టుకోడు.. పోనీ, ప్రభుత్వం ఇచ్చే ఖర్చులా.? అంటే, మళ్లీ అది ప్రజా ధనం దుర్వినియోగం.. అన్న కోణంలోకే వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ దండగ.. అన్నది ఈ వ్యవహారంతో ప్రూవ్ అవుతోందనే వాదనా లేకపోలేదు.
ఇక, రేవంత్ రెడ్డిపై కొడాలి నాని వ్యాఖ్యల వ్యవహారాన్నే తీసుకుంటే, ‘తెలంగాణలో మాకు ఏదన్నా పని కావాలంటే సోనియా గాంధీనో, రాహుల్ గాంధీనో నేరుగా కలిసి, మాట్లాడితే సరిపోతుంది. రేవంత్ రెడ్డితో మాకు పనేంటి.?’ అని సెలవిచ్చారు కొడాలి నాని.
‘ఆయన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా నియమించిందంతే..’ అని రేవంత్ రెడ్డిపై కొడాలి నాని సెటైర్లేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా ఇలాగే కాంగ్రెస్ అధిష్టానం నియమించింది కదా.? రేవంత్ రెడ్డి మీద ఎంత తేలిక మాటలు కొడాలి నాని మాట్లాడితే, అంతలా వైఎస్సార్‌ని అవమానించినట్లే.! కాంటెక్స్ట్ అలాంటిది మరి.!