హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజస్ కంచర్ల (Hero Tejus Kancherla). తేజస్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చారు. టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచాయి. ఇక సెప్టెంబర్ 7న వినాయక చవితి స్పెషల్‌గా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో తేజస కంచర్ల మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
* హుషారు తరువాత చాలా కథలు విన్నాను. ఏదైనా కొత్తగా ఉండే కథలను చేయాలని అనుకున్నా. అందుకే చాలా రొటీన్ కథలను విన్న తరువాత ఈ పాయింట్ నాకు చాలా నచ్చింది. వివేక్ ఈ పాయింట్‌ను చెప్పినప్పుడు ఎగ్టైట్ అయ్యాను. ఆ తరువాత ఇద్దరం కలిసి కథను రాసుకున్నాం. అలా ఈ మూవీ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాం.
* కథ అయితే రెడీ అయింది.. స్క్రిప్ట్ బాగా వచ్చింది. చాలా మంది నిర్మాతల వద్దకు వెళ్లాం. కథను వినిపించాం. అందరూ బాగానే ఉందని అన్నారు. కానీ నా మీద అంత బడ్జెట్ పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్లు కూడా రైటే. అందుకే చివరకు ఈ కథను మా నాన్న విన్నారు. ఆయనకు నచ్చడంతో ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు.
* తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ ఉంటుంది. యాస అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలానే ఉంటుంది. నేను పుట్టి పెరిగింది హైద్రాబాద్‌లోనే కాబట్టి యాసతో పెద్ద ప్రాబ్లం ఏమీ రాలేదు.
* టీజర్, ట్రైలర్ చూస్తే కథ ఏంటన్నది మీకు అర్థం అవుతుంది. ప్రస్తుతం ఉన్న తరుణంలో కథ ఏంటి? సినిమా ఎలా ఉంటుంది? అనేది ఆడియెన్స్‌కు ముందే హింట్ ఇస్తే బెటర్. అందుకే మా టీజర్, ట్రైలర్ ద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతోందనేది ముందే కాస్త చెప్పేశాం.
* ట్రైలర్ చూస్తే సినిమా అంతా హీరోయిన్ చుట్టే తిరుగుతుందని అనిపిస్తుంది. కానీ సినిమాలోకి వచ్చాక వేరేలా ఉంటుంది. ఉరుకు పటేలా అనే టైటిల్ ఏంటి? ఎందుకు ఉరుకడం? అనేది జస్టిఫై చేసేలా ఉంటుంది. ఆద్యంతం నవ్వించేలానే ఈ సినిమా ఉంటుంది.
* హీరోయిన్ ఉత్తరాఖండ్‌కి చెందిన అమ్మాయి. ఆమె చేసిన ఓ రీల్ చూసి పిలిపించాడు. వర్క్ షాప్స్ పెట్టాం. చెప్పిన టైంకి వచ్చి, చెప్పినట్టుగా నటించారు. ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు.
* ఈ చిత్రం హిట్ అయి డబ్బులు వస్తే.. ఆ తరువాత మంచి కథలు దొరికితే కచ్చితంగా నిర్మిస్తాను. కానీ ఈ సారి మాత్రం నిర్మిస్తూ, నటించను. ఆ రెండూ ఒకేసారి చేయడం చాలా కష్టం.
* ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసేలా ఈ చిత్రం ఉంటుంది. ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. లాక్డౌన్‌లో ఉన్న టైంలో మూఢనమ్మకాల గురించి వార్తలు ఎక్కువగా చదివాను. అలా కొన్ని ఘటనల చుట్టూ ఈ కథను అల్లుకున్నాను. థ్రిల్లర్, కామెడీ జానర్లో అ మూవీని పూర్తి ఎంటర్టైన్మెంట్‌గా తీశాం.
* ఫ్యూచర్‌లో డైరెక్షన్ చేయాలని కోరిక ఉంది. నా వద్దకు వచ్చే కథల్లో అవసరమైతే ఇన్ పుట్స్ ఇస్తాను. నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. నాకు పాత్ర నచ్చితే, అందులో మజా ఉందనిపిస్తే స్పెషల్ రోల్స్ అయినా చేస్తాను.