కేసీయార్ ఇమేజ్‌ని రేవంత్ రెడ్డి చెరిపేస్తారా.?

తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడు సీన్ మారింది. నిజానికి, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని భారత్ రాష్ట్ర సమితిగా మార్చారో.. అప్పటినుంచే, కేసీయార్ ఇమేజ్ పలచబడిపోవడం ప్రారంభమయ్యింది.

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీయార్ పార్టీ ఓటమి పాలయ్యాక, చాలా వేగంగా కేసీయార్ ఇమేజ్ పలచబడిపోయిందనే చెప్పాలేమో.! అనారోగ్యంతో కేసీయార్ ఆసుపత్రిలో చేరినా, తద్వారా క్రియేట్ అయిన సానుభూతి చాలా చాలా తక్కువే.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం షురూ అయ్యాక, తెలంగాణలో ఎక్కడ విన్నా సీఎం రేవంత్ రెడ్డి పేరే వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ.. ఇదే ప్రస్తావన తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది.

అంతకు ముందు వరకు ఐటీ అంటే కేటీయార్.. అని వినిపించిన పేరు కూడా, ఇప్పుడు చల్లారిపోయింది. కేసీయార్ హయాంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనించిన మాట వాస్తవం. నిజానికి, ఎవరు అధికారంలో వున్నా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి.. అది అలా అలా జరుగుతూనే వుంటుంది.

‘బాపూ..’ అంటూ కేసీయార్‌ని గులాబీ శ్రేణులు కాస్త కొత్తగా పలుకుతున్నాయి. అంతకు ముందు వరకు, ‘కేసీయార్ సారు’ అని పిలుచుకునేవాళ్ళు గులాబీ నేతలు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి కేసీయార్ తిరిగి తన ఫాలోయింగ్ పెంచుకోవాల్సి వుంటుంది.

కేసీయార్ ఎలాగూ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారు. అందుకే, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా సోనియా గాంధీని తెలంగాణ నుంచి బరిలోకి దించాలని ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి చేదు అనుభవం ఎదురైతే.. ఇక, కేసీయార్ ఇమేజ్ పూర్తిగా తెలంగాణ రాజకీయాల నుంచి చెరిగిపోతుందన్నది కాంగ్రెస్ భావన.