తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోకముందే కీలక నేతలంతా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో పార్టీ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిసిసి అధ్యక్ష పదవికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఒకటి మాత్రమే గెలిచింది. మిగతా 9 చోట్ల ఓడిపోయింది. టిఆర్ఎస్ చేతిలో ఘోర పరాభవం కావడంతో నైతిక బాధ్యత వహిస్తూ డిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కు పంపుతున్నట్టు ఆయన తెలిపారు. నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటి చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఏలేటి డిసిసి పదవికి మాత్రమే రాజీనామా చేశారని పార్టీకి కాదని నేతలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు రాజీనామాలు చేశారు. వరంగల్ జిల్లాలో జడ్పీ ఫ్లోర్ లీడర్, మహబూబ్ నగర్ జిల్లాలో పిసిసి కార్యదర్శి ఇలా కీలక నేతలంతా రాజీనామాలు చేశారు. కింది స్థాయిలో క్యాడర్ కు దగ్గరగా ఉండే నేతలు కూడా రాజీనామాలు చేశారు. దీంతో పార్టీకి పెద్ద షాక్ తగిలింది.
ఓ వైపు నేతలు దూరమవుతుండగా మరో వైపు కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్లమెంటు ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలు రసాభాసాగా మారుతున్నాయి. మల్కాజ్ గిరి సమీక్ష సమావేశం రసాభాసగా మారడంతో కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ పై వేటు వేశారు. దీంతో ఉన్న నేతలను కూడా పార్టీ దూరం చేసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. ఓ వైపు నేతల రాజీనామాలు మరో వైపు నేతల పై వేటు కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది.