Mowgli Movie Review: ‘మోగ్లీ’ మూవీ రివ్యూ!

రచన –దర్శకత్వం : సందీప్ రాజ్
తారాగణం : రోషన్ కనకాల, సాక్షీ మడోల్కర్, బండి సరోజ్ కుమార్ , వైవా హర్ష తదితరులు
సంగీతం : కాలభైరవ, ఛాయాగ్రహణం
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్
విడుదల : డిసెంబర్ 13, 2025

ప్రముఖ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల నటించిన మొదటి మూవీ ‘బబుల్ గమ్’ 2023 లో విడుదలైంది. ఇప్పుడు రెండో మూవీ ‘మోగ్లీ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనికి ‘కలర్ ఫోటో’ తీసిన సందీప్ రాజ్ దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్‌లు సంయుక్తంగా దీన్ని నిర్మించారు. ప్రేమ కథగా ప్రచారమైన ఈ సినిమాలో కొత్తదనమేమిటి, అదెంత వరకూ వర్కౌట్ అయిందీ పరిశీలిద్దాం…

కథేమిటి?
మోగ్లీ అలియాస్ మురళీకృష్ణ (రోషన్ కనకాల) బాల్యంలో ఓ ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాధ. తండ్రి పోలీసుగా ఉండేవాడు. దాంతో తనూ పోలీసు కావాలని కల. సమీపంలో అడవి వుంటుంది. అక్కడ సినిమా షూటింగులు జరుగుతూంటాయి. ఆ సినిమాలకు లొకేషన్లో హెల్పర్ గా పని చేస్తుంటాడు. అలా ఓ షూటింగు కొచ్చిన సినిమా బృందంలో డూప్ గా పనిచేసే అవకాశం వస్తుంది. అదే షూటింగులో పాల్గొంటున్న మూగ –చెవిటి అయిన డ్యాన్సర్ జాస్మిన్ (సాక్షి మడోల్కర్) తో ప్రేమలో పడతాడు. మోగ్లీ తనని రాముడిగా, జాస్మిన్‌ని సీతగా వూహించుకుంటాడు. అయితే జాస్మిన్ మీద పోలీసు అధికారి క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) కన్నేసి రావణుడిలా మారతాడు. ఈ రావణుడు సీతని రాముడు నుంచి విడదీసి అపహరించాడా? తనని రాముడుగా భావించుకుంటున్న మోగ్లీ తన సీతని రావణుడు నుంచి కాపాడుకోగలిగాడా? అడవిలో ఈ సంఘర్షణలో మోగ్లీని ఆదుకోవడానికి దిగి వచ్చిన హనుమంతుడు ఎలా సహాయ పడ్డాడు? రామాయణంలా చెప్పిన ఈ ప్రీమ కథ చివరికెలా ముగిసింది? ఇదీ మిగతా కథ.

ఎవరెలా చేశారు?
మోగ్లీ అనేది ప్రసిద్ధ యానిమేషన్ చిత్రం ‘ది జంగిల్ బుక్’ లోని అడవిలో పెరిగిన బాలుడి పాత్ర పేరు. ఈ పేరే రోషన్ కనకాల పాత్రకి పెట్టి అడవి నేపథ్యపు ప్రేమ కథ నడిపారు. దీనికి పురాణాల టచ్ కూడా ఇచ్చారు. ఇంతేగాకుండా కర్మసిద్ధాంతం కూడా జోడించారు. పురాణ పాత్ర హనుమంతుడితో క్లయిమాక్స్ చేశారు. మోగ్లీ పాత్రలో రోషన్ మొదటి సినిమా ‘బబుల్ గమ్’ లో చేసినట్టు ఓవరాక్షన్ చేయకుండా చాలా ఒదిగి నటించాడు. మూగ చెవిటి అమ్మాయితో షరతుల్లేని ప్రేమికుడిగా, దుష్టుడి నుంచి ఆమెని కాపాడుకునే వీరుడిగా రెండు షేడ్స్ లో ఫర్వాలేదన్పించేలా నటించాడు. ముఖంలో పలికే భావాలపై అతను మరింత శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. యాక్షన్ సీన్స్ లో యూత్ పవర్ చూపించడం బావుంది. ఇలాగే పాత్రలో పాత్రని ఫీలయ్యి నటిస్తూంటే కెరీర్ కి డోకా వుండదు.

మూగ చెవిటి హీరోయిన్ పాత్రలో సాక్షి మడోల్కర్ కేవలం భావాలు పలికిస్తూ కష్టపడి నటించిందనే చెప్పాలి. ఈ చాలెంజింగ్ పాత్రలో ఆమె సక్సెస్ అయింది. . ఇక విలన్‌గా బండి సరోజ్ కుమార్ కూడా ప్రధానాకర్షణే సినిమాకి. హర్ష చెముడు కామెడీ పాత్రతో మరోసారి అలరించాడు. తను కనిపించినప్పుడల్లా మంచి ఎంటర్ టైన్మెంట్ ని పంచాడు.

సాంకేతికాల మాట?
ఈ స్మాల్ బడ్జెట్ సినిమాకి కెమెరా వర్క్ హై క్వాలిటీతో వుండడం విశేషం. ఫారెస్ట్ సీన్లు, హనుమంతుడి సీన్లు సినిమాకి విజువల్స్ పరంగా ప్లస్ అయ్యాయి. చిన్న సినిమా చూస్తున్న ఫీల్ కలక్కుండా చిత్రీకరణ చేశారు. కానీ కాల భైరవ సంగీతంలో పాతలేందుకో వీక్ గా వున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు. ఇతర నిర్మాణ విలువలు బ్యానర్ స్టేటస్ కి తగ్గట్టున్నాయి.

ఇంతకీ కథెలా వుంది?
గ్రామీణ ప్రాంతంలో ప్రేమించుకుంటున్న ఓ అబ్బాయి- ఓ అమ్మాయి – మధ్యలో అమ్మాయి మీద కన్నేసిన దుష్ట పాత్ర. కథగా చూస్తే కొత్తదనం లేని పాత కథే. ఇందులో అబ్బాయిని అడవిలో తిరిగే మోగ్లీగా, అమ్మాయిని మూగ చెవిటి ప్రాణిగా చేసి- ఈ అమ్మాయి మీద కన్నేసిన దుష్ట పోలీసు పాత్రతో అడవి నేపథ్యంలో పాత కథలాగే నడిపాడు దర్శకుడు. ఈ పాత్రలకి రాముడు- సీత- రావణుడుల రామాయణంగా కూడా చేసి చోపలనూకున్నాదు. పైగా మూగ అమ్మాయితో విలన్ పాత్రకి కర్మ సిద్ధాంతాన్నీ జోడించాడు. ఇన్ని చేసినా వీటిని ప్రేమ కథ స్టోరీలైన్ లో ఇమిడిపోయే విధంగా చేయలేకపోవడం ఈ సినిమాకి పెద్ద లోపం. బేసిగ్గా ప్రేమ కథలోనే బలం లేదు, భావోద్వేగాల్లేవు, దీనికి అదనపు జోడింపులతో చేసిన ప్రయోగాలు ప్రేమ కథని ఎలివేట్ చేయలేకపోయాయి.

ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగడం, ఇందులో హీరో జీవితం, హీరోయిన్ రాక, ఇద్దరి మధ్య ప్రేమ, ఈ ప్ప్రేమలో విలన్ ఈ సెటప్ అంతా పాత రొటీన్ లాగే వుంటుంది. ఇంటర్వెల్ సన్నివేశం సైతం రొటీనే.

సెకండాఫ్ లో ఫారెస్ట్ తో విలన్ తో ప్రారంభమయ్యే యాక్షన్ కూడా రొటీన్ గానే సాగుతుంది. హీరోయిన్ ని కాపాడుకునే హీరో ప్రయత్నాలూ మరీ గొప్పగా థ్రిల్ చేయవు. బలమంతా క్లయిమాక్స్ లోనే వుంది. కర్మ సిద్ధాంతంతో విలన్ చావు సన్నివేశంలో వుంది. ఇంతకి మించి చెప్పుకోవడానికి లేదు.

దర్శకుడిగా సందీప్ రాజ్ ఈ రెండో సినిమాని ఇంత బలహీనంగా తీయడం విచారకరం. కేవలం క్లయిమాక్స్ కోసం ఓపిక పట్టి మిగతా సినిమా భరించండి అన్నట్టుగా వుంది అతడి తీరు. హీరో హీరోయిన్లు, విలన్ అంత కష్టపడి నటించినప్పుడు కథతో తను చేయాల్సిన డ్యూటీ తను చేయలేదు. కథతో ఆలోచనలు బావున్నాయి గానీ, కథనంతో నేర్పు లేకపోతే ఎంత పేరున్న బ్యానర్ మాత్రం ఏం చేయగలదు. పేరున్న బ్యానర్ తో మంచి అవకాశాన్ని చేజార్చుకోవడం తప్ప!

రేటింగ్: 2 / 5

దువ్వాడ దివ్వెల || Cine Critic Dasari Vignan About Duvvada Srinivas & Divvela Madhuri Arrest || TR