బడి పోరగాళ్లూ… సెలవుల్లో లక్నవరం టూర్ రాండ్రి

పండుగ సెలవుల్లో విహారం, వినోదం

కొత్త హంగులతో ముస్తాబైన లక్నవరం ఫెస్టివల్

నైట్ క్యాంపింగ్, ప్రకృతితో మమేకం సూపర్ ఫీల్

ఆకర్షణీయమైన ఏర్పాట్లు చేసిన అటవీశాఖ

అడుగడుగునా అడ్వెంచర్ తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీశాఖ వినూత్న శైలితో ఎన్నో అడ్వెంచర్ ఆక్టివిటీస్ ని వివిధ పర్యాటక ప్రదేశాలలో ప్రవేశపెట్టింది. రాక్ క్లింబింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్, నైట్ క్యాంపింగ్, జంగల్ సఫారీ, ఎడ్లబండి యాత్ర ఇలాంటివి మరెన్నో జయశంకర్ జిల్లా అడవుల్లో ప్రకృతి పర్యటకులతో సందడిగా మారాయి అందులో లక్నవరం ఒకటి.

లక్నవరం చెరువు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోవిందరావు పేట మండలంలోని లక్నవరం గ్రామంలో ఉంది. లక్నవరం చెరువు మంచి పర్యాటక కేంద్రం. పదివేల ఎకరాలలో ఈ చెరువు వ్యాపించి ఉన్నది. ఈ చెరువులోనే 13 ఐలాండ్స్ (చిన్న చిన్న ద్వీపాలు కలవు) పర్యాటకుల కోసం ఈ చెరువు మీదుగా 160 మీటర్ల అద్భుతమైన సస్పెన్షన్ (వేలాడే) బ్రిడ్జ్ కలదు. ఈ వేలాడే వంతెనను చూడటానికి రాష్ట్రం నలుమూలలనుండి పర్యాటకులు వస్తారు. కాకతీయుల కాలం నాటి ఈ చెరువు కొన్నివేల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది.

లక్నవరం వంతెన

కేరళ తరహాలో ఉన్న హౌసింగ్ బోటు కలదు. సరస్సు మధ్యలో కాకరకాయల బోడుపై నిర్మించిన రెస్టారెంట్‌లో ఘుమఘుమలాడే వంటకాలను ఆస్వాదించవచ్చు. ఎత్తయిన కొండల మద్య రూపుదిద్దుకొన్న ఈ చెరువు కాకతీయల సాంకేతికకు నిదర్శనం. ఆధునిక ఇంజనీరింగ్ ను గుర్తుకు తెస్తుంది. 9 తూములతో రూపొందించిన ఈ చెరువు ద్వారా నీరు సమీపంలోని సద్దిమడుగు రిజర్వాయర్ కు మళ్లించబడి అక్కడనుండి కాలువల ద్వారా వ్యవసాయభూములకు నీరు అందించబడుతుంది. తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పూర్తి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నది.

క్రీ.శ. 1312వ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయరాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. కోనేరు, దేవాలయం, నగరం అనే పద్ధతిలో సరస్సు సమీపంలో శివాలయం, నగరాన్ని స్థాపించే కాకతీయులు లక్నవరంలో మాత్రం దానికి భిన్నంగా సరస్సును మాత్రమే నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ సరస్సుకు తొమ్మిది ప్రధాన తూములు ఉన్నాయి. కాంక్రీటు, ఇనుము వాడకం లేకుండా కట్టిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకపోవటం విశేషంగా చెప్పవచ్చు.

ఫారెస్ట్ లో ప్రయాణం

ఇలా పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన లక్నవరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీశాఖ వినూత్న రీతిలో లక్నవరం ఫెస్టివల్ నిర్వహణతో దూసుకెళ్తుంది, ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు (24 గంటలు) లక్నవరంలో లక్నవరం ఫెస్టివల్ నిర్వహించబడుతుంది.

నిరంతరం పరీక్షలు, సెమిస్టర్లు, లాబ్లతో ఒత్తిళ్లకు గురయ్యే విద్యార్థులకు లక్నవరం ఫెస్టివల్ ధ్యారా నూతనోతేజం పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ , రాష్ట్రంలో వివిధ కళాశాలలకు చెందిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ విద్యార్థి విద్యార్థినిలు మరియు వివిధ రాష్ట్రాల నుండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రకృతి పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు.

లక్నవరం టూర్ లో రిచ్ లొకేషన్స్

ఈ యొక్క ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వచ్చే పర్యాటకులు సాయంత్రం 4 గంటలకు లక్నవరం కి చేరుకోగానే వీరికి ముందుగా లక్నవరంలో ప్రకృతి పర్యాటకం ఏ విధంగా ఉంది, అక్కడ వారు ఏ ఏ కార్యక్రమాలలో పాల్గొననున్నారు, 24 గంటల పాటు వారి ప్లాన్ ఏ విధంగా ఉందని వారికి డిటైల్డ్ గా వివరించటంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది.

ముందుగా పచ్చని చెట్ల మధ్య ఎడమ వైపు గుట్టలు, కుడి వైపున లక్నవరం సరస్సు మధ్యపో సైక్లింగ్ చేసేందుకు అనువుగా చేసిన మట్టి రోడ్డులో లేక్ వ్యూ సైక్లింగ్ చూపరులను కనువిందు చేస్తుంది, ఇలా 2.6 కిలోమీటర్ల మేర సైక్లింగ్ 2 గంటల్లో పూర్తవుతుంది.

సైక్లింగ్ పూర్తయిన పిమ్మట, లక్నవరం లోని నాలా ప్రక్కన అడవిలో గుడారాలలో నైట్ క్యాంపింగ్ విడిది అడ్వెంచరెస్ గా చేసి, ఆడుతూ పాడుతూ హుషారుగా గడిపి మంత్రముక్తులు అవుతున్నారు పర్యాటకులు.

లక్నవరం ప్రకృతి ఒడి విహారం

పచ్చని చెట్ల మధ్య పక్షుల కిల కిల రాగలతో పొద్దున్నే లేచి బర్డ్ వాచింగ్ చేస్తున్నారు, సరస్సుల్లో మరియు అడవిలో సంచరించేటువంటి వివిధ రకాల పక్షులు హంస, గ్రద్ద, కోయిల, పిచ్చుక, చిలుక, కొంగ, డేగ, చెకుముకి పిట్ట, పికిల పిట్ట, ఒక జాతి పావురము మొదలగు పక్షులను వీక్షిస్తూ పులకరిస్తున్నారు ప్రకృతి పర్యాటకులు. పిమ్మట ఈ ఫెస్టివల్ లో భాగంగా బ్రేక్ ఫాస్ట్ కూడా అటవీశాఖ పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తుంది.

పిమ్మట ఎత్తయిన కొండల మధ్య లక్నవరం సరస్సులో గల ఐలాండ్, మధ్యలో దాటడానికి ఉయ్యాల వంతెన ఆ ఉయ్యాల వంతెన మీద నడుస్తూ ఫొటలు దిగుతూ, బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తారు, అక్కడ కాకరకాయల గూడు అనే ఐలాండ్ దగ్గర్నుండీ, బోటింగ్ చేస్తూ మధ్యలోగల ఐలాండ్ లను వీక్షిస్తూ జోరుగా సాగిపోతారు, అలా కాకరకాయ బొడు ఐలాండ్ నుండి అటవీప్రాంతంలో నది ఒడ్డుకు చేరుకుని అక్కడ నుండి తూముల వరకు 5 కిలోమీటర్ల మేర గుంట నక్క, కుందేలు, జింక, మనుబొగ్గు, చుక్కల దుప్పులు, మోరిగే లేడి సంచరించేటువంటి దట్టమైన అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తారు.

లక్నవరం టూర్ లో రాత్రి గుడారాల్లో బస

తూముల వరకు చేరుకోగానే అక్కడ అటవీశాఖ ఈ ఫెస్టివల్ లో భాగంగా వారి కోసం మధ్యన్న వన భోజన సౌకర్యం కల్పిస్తుంది. కొంచెంసేపు హాయిగా తూముల వద్ద గడిపి, అక్కడి నుండి ఒక పల్లెటూరి వాతావరణం కనబడేలా ఎడ్లబండి మీద అడవి యాత్రలో విహరిస్తారు, ఈ అడవి యాత్ర పిమ్మట లక్నవరం సరస్సుని ప్రకృతిని పచ్చని చెట్లను ఆస్వాదించడానికి లేక్ వ్యూ సఫారీ ఉంటుంది, ఈ యొక్క సఫారితో లక్నవరం ఫెస్టివల్ ముగుస్తుంది.

ఈ ఫెస్టివల్ లో పాల్గొనే వారికి ఒక్కరికి రూ. 2,000/- , రాత్రి వేళ గుడారాలలో బస, భోజన సౌకర్యం అటవీశాఖ ఈ ఫెస్టివల్ లో పాల్గొనే వారికి భాగంగా కల్పిస్తుంది. ఈ యొక్క లక్నవరం ఫెస్టివల్ లో పాల్గొనాలంటే, ముందుగా ఆన్లైన్ లో www.ecotourism.bhupalpally.com లో బుక్ చేసుకోవాలి లేదా లక్నవరం ఎకో టూరిజం ప్రమోటర్ వంశీ ని 9502853154 ఈ నెంబర్ లో సంప్రదించండి. మరియు ఏదైనా సలహాలకు, సూచనలకు, ప్రోబ్లేమ్స్ వస్తే ఎకో టూరిజం కోఆర్డినేటర్ కళ్యాణపు సుమన్ ని 7382619363 ఈ నెంబర్ లో సంప్రదించగలరు.

 

(నోట్ : తెలంగాణ టూరిజం శాఖ వారు వెలువరించిన పత్రికా ప్రకటనను యదాతదంగా మీకు అందజేస్తున్నాం.)