కాంగ్రెస్ తో దేశం దోస్తీ ! ఎవరి కొంపలు మునుగునో?

(యనమల నాగిరెడ్డి) 

*కార్యకర్తలకు జీర్ణం కాని పొత్తులు
*కక్కలేక మింగలేక నాయకులు

1983లో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ శూన్యం నుండి టీడీపీ ఆవిర్భవించింది. అప్పటికి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉండి, కార్యకర్తల సమూహంతో బలంగా ఉన్న కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీల బలాన్ని లాగేసింది.
అలాగే 1983 నాటికి రాష్ట్రంలో సుమారు 16 నుండి 18 శాతం ఓటర్లపై పట్టు సాధించిన బీజేపీతో 1985, 1994, 2014 ఎన్నికలలో పొత్తు పెట్టుకుని, రాష్ట్రంలో ఆ పార్టీ అస్తిత్వానికి ముప్పు తెచ్చిందనేది రాజకీయ వాస్తవం. ఈ దెబ్బకు ఆ మూడు పార్టీలు నేటికి పూర్వపు ఆంధ్రప్రదేశ్ లో కొలుకోడానికి ఆపసోపాలు పడుతున్నాయి. ఇపుడు టిడిపి కాంగ్రెస్ తో చేతులు కలుపుతూ ఉంది. కాంగ్రెస్ మునుగుతుందో, తెలుతుందో చూడాలి.

 

రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ ఉండదనేది రాజకీయ ఉద్ధండులు చెప్పిన నీతి.
అలాగే రాజకీయాలలో హత్యలుండవు… ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అన్నది రాజకీయపండితులు చెప్పిన వేదం.
ప్రస్తుతం దేశంలోను, రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఈ సూత్రాలు నిర్ద్యంధంగా వర్తిస్థాయి. ప్రస్తుతం వార్తలలో ఉన్న టీడీపీ కాంగ్రెస్ పార్టీల దోస్తీ ఎవరిని తేల్చి, ఎవరిని ఆత్మహత్యకు పురికొల్పుతాయో చూద్దాం.

కాంగ్రెస్ .. తెలుగుదేశం దోస్తీ

రాష్ట్ర రాజకీయాలలో జన్మ విరోధులు కాంగ్రెస్ టీడీపీ. ఈ రెండు పార్టీలు ఇటీవల ఎన్నికల పొత్తు ఏర్పరచు కోవడం జనంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పండితులలో కలకలం లేపింది. అవకాశవాద రాజకీయాలకు దర్పణం పట్టే ఈ అక్రమ కలయిక తెలుగు రాష్ట్రాలలో చరిత్రను తిరగరాస్తుందా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది

కాంగ్రెస్ పతనం కోసమే పుట్టింది టీడీపీ

రాస్త్రంలో కాంగ్రెస్ అవినీతి పాలనను అంతం చేయడం లక్ష్యంగా స్వర్గీయ ఎన్.టి. రామారావు 1983 లో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ వారి అవినీతి, ఆశ్రీత పక్షపాతం వలన రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు అలమటిస్తున్నారని, “కాంగ్రెస్ కుక్క మూతి పిందెల పాలనను అంతం చేయడమే” తన ధ్యేయమని ఎన్.టి.ఆర్. ప్రకటించారు.

నాదెండ్ల భాస్కరరావు, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటివారు పార్టీలోచేరడం, ఒక ప్రముఖ దినపత్రిక టీడీపీకి సంపూర్ణ సహకారం అందించడం జరింగింది. ప్రజా భాహుళ్యంలో తనకున్న విశేషమైన గ్లామర్ పెట్టుబడిగా రామారావు 9 నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి 1984 ఎన్నికలలో కాంగ్రెస్ ను తుడిచిపెట్టారు.

ఆ తర్వాత గవర్నర్ రాంలాల్ టీడీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం, అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం, పోలీసు కాల్పులలో రాయలసీమ వాసులు (మాత్రమే) ప్రాణాలు బలిపెట్టారు. అదే సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు, బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టీడీపీనిభుజాల కెత్తుకుని ఉద్యమించారు. దీనితో దిగివచ్చిన కేంద్రం తిరిగి రామారావును ముఖ్యమంత్రి చేయడం, శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లిన ఎన్.టి.ఆర్ ఘనవిజయం సాధించారు.

ఆ తర్వాత 1989లో టీడీపీ పై కాంగ్రెస్ విజయం సాధిస్తే, 1994లో టీడీపీ ప్రతీకారం తీర్చుకుంది. ఆ తరువాత 1996లో చంద్రబాబు ఎన్.టి.ఆర్ ను గద్దె దించి ముఖ్యమంత్రి కావడం, 1999 లో కాంగ్రెస్ ను ఓడించగా, 2004, 2009 ఎన్నికలలో వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీపై విజయం సాధించింది.

రెండు పార్టీలకు జన్మ విరోధం

టీడీపీ ఆవిర్భావం నుండి 2014 లో రాష్ట్ర విభజన వరకు జరిగిన ప్రతి ఎన్నికలో టీడీపీ, కాంగ్రెస్ లే పోటీ పడ్డాయి. ఈ రెండు పార్టీలు అవసరాన్ని పట్టి బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎం), పార్టీలతో జత కట్టారు. ఆతర్వాత పుట్టిన టి.ఆర్.ఎస్. కూడా ఈ ఆటలో భాగమైంది. ఈ రెండు ప్రధాన పార్టీలు తమ తక్షణ రాజకీయ అవసరాలకు అనుగుణంగా అనేక పార్టీలతో కలవడం విడిపోవడం ఆటగా సాగించాయి.

ఈ రెండు పార్టీల విరోధం జాతీయ స్థాయిలో కూడా కొనసాగింది. టీడీపీ ఎన్.డి.ఏ కూటమిలో ప్రధాన పాత్ర పోషించగా, కాంగ్రెస్ యూ.పి.ఏ. కూటమికి నేతృత్వం వహించింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ “నీకంటే చవటాయిని” నేను అన్నట్లు ప్రవర్తిస్తూ విమర్శలు, ప్రతివిమర్శలే ఊపిరిగా వీరు నాలుగు దశాబ్దాలుగా రాజకీయ పోరాటం చేసారు. గత 36 సంవత్సరాలుగా ఈ రెండు పార్టీల అధినేతలు తమ అధికారం కోసం అనుసరించిన విధానాల వల్ల క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా జన్మ విరోధులుగా మారారు. అలాగే గ్రామసీమలలో ప్రజల మధ్య రాజకీయ విరోధాలను, వ్యక్తిగత కక్ష్యలను కూడా ఈ ప్రభువులు(తమ కోసం) పెంచి పోషించారు.

పొత్తు ఎవరి కొంప ముంచుతుందో?

ఈ నేపథ్యంలో తక్షణ తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం తెలంగాణ లో కుదిరిన కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగుతుందా? లేదా? ఫలితం ఎలా ఉంటుందో ? ఎవరి కొంప ముంచుతుందో అర్థం కావడంలేదని రెండు పార్టీలకు చెందిన పాతతరం నాయకులు, గ్రామస్థాయి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఈ పొత్తుల ప్రతిపాదన మింగుడు పడటం లేదు.

తెలంగాణాలో కె.సి ఆర్ ఓటమి లక్ష్యంగా…

తెలంగాణలో ఈ రెండు పార్టీలకు మింగుడుపడని టి.ఆర్.ఎస్. అధినేతపై నేతలకు తీరని కక్ష ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టి.ఆర్.ఎస్.ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కె.సి.ఆర్. ఆ తర్వాత మాట మార్చి మోసం చేసారనేది కాంగ్రెస్ ఆరోపణ. ఏ.పిలో గెలిచిన టీడీపీకి పొగ పెట్టి హైదరాబాదు నుంచి “పరుగు” పెట్టించారనే ఆక్రోశం టీడీపీది.
తెలంగాణా “తెచ్చేది మేమే! అన్న భరోసా ఇచ్చి, నానా పాట్లు పడి రాష్టాన్ని తెచ్చింది తామే కాబట్టి 2014లో అధికారం తమదే అన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ నాయకత్వ ఆశలకు కె.సి.ఆర్ గండి కొట్టి అధికారం కైవసం చేసుకోవడం వారికి మింగుడు పడలేదు.

ఇకపోతే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి సెగ పెట్టి రాజధాని నుంచి ఏ.పి.ప్రభుత్వాన్ని (తొందరగా) సాగనంపినందుకు, ఓటుకు నోటు కేసులో చంద్రబాబును అడ్డంగా ఇరికించినందుకు, రాజకీయ నిర్ణయాలతో టీడీపీకి ఊపిరి సలపకుండా చేసినందుకు తెలుగు తమ్ముళ్లు టి.ఆర్.ఎస్ పై మండిపడుతున్నారు.
ఇక్కడ కొన ఊపిరితో ఉన్న టీడీపీ తనకున్న బి.సి.బలాన్ని, కాంగ్రెస్ కు అందించి ఉనికిని కాపాడుకుంటూ, ఇరువురికి “కంట్లో నలుసులా తయారైన” కె.సి.ఆర్ ను సాగనంపడమే లక్ష్యంగా టీడీపీ కాంగ్రెస్ లు దోస్తీకి సై అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.జగన్ టార్గెట్

తమ పార్టీ ముఖ్యమంత్రిగా వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అన్ని పథకాల వల్ల వై.ఎస్.ఆర్ వీరాభిమానులుగా మారిన కాంగ్రెస్ ఓటర్లను, వై.ఎస్.ఆర్ మరణంతో ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి వైస్సార్ కాంగ్రెస్ ఓటర్లుగా మార్చుకున్నారు. అలాగే రాష్ట్రాన్ని చీల్చాలన్న నిర్ణయంతో కాంగ్రెస్ “రాజకీయ ఆత్మహత్య”కు పాల్పడింది.

జగన్ పార్టీ పెట్టకపోతే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించేదే కాదని, తమపార్టీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో భూస్థాపితమై, 2014 ఎన్నికలలో పార్టీ అడ్రస్ గల్లంతు కావడానికి “జగనే కారణమన్నది” కాంగ్రెస్ ఆగ్రహానికి కారణం.

కాగా గత ఎన్నికలలో బీజేపీ, జనసేన మద్దతుతో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు గట్టెక్కామని, 2019 ఎన్నికలలో తమకు జగన్ ముప్పు పొంచి ఉందనేది టీడీపీ ఆందోళన.

ప్రస్తుతం జగన్ పాదయాత్ర, పవన్ పర్యటన, కాపు ఉద్యమ సెగ, బీజేపీ, జనసేన లతో బంధం తెగిపోవడం లాంటి అంశాలు చంద్రబాబు ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో “శత్రువు శత్రువు మిత్రుడు” అనే సూత్రాన్ని అమలు చేయడం కోసం, ఇప్పటికి కాంగ్రెస్ కు ప్రజలలో ఉన్న అరకొర బలము అండగా గట్టెక్కాలనేది టీడీపీ ఎత్తుగడ. అలాగే జాతీయ రాజకేయ అవసరాల పేరుతో కాంగ్రెస్ తో దోస్తీ కడితే, ప్రజలు అంగీకరిస్తారని, తద్వారా జగన్ కు చెక్ పెట్టగలమని టీడీపీ అధినేత ఆలోచన.

అంపసయ్యపై ఉన్న కాంగ్రెస్ సంగతి తరువాత చూడవచ్చు అనేది బాబు గారి ఎత్తుగడ అంటున్నారు పండితులు
అలాగే గత 6 సంవసత్సరాలుగా జగన్ పోరాటానికి అండగా నిలిచిన కార్యకర్తలు, నాయకులు అన్ని విధాలా పూర్తిగా అలసిపోయారని, 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రాలేకపోతే పార్టీ ముక్కలు కాక తప్పదని, అపుడు వారందరు కాంగ్రెస్ వైపు వస్తారని కాంగ్రెస్ బాస్ ల ఆలోచన. ప్రస్తుతానికి ఆక్సిజన్ పెట్టుకుంటే ఆ తర్వాత టీడీపీ సంగతి చూడవచ్చు అన్న వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు ముందుకు వెళుతున్నారనేది పరిశీలకుల అంచనా.

రాజకీయ ఎత్తుగడలు

కాంగ్రెస్, టిడిపి, బీజేపి, టి. ఆర్.ఎస్. మిగిలిన అన్ని పార్టీల అదినేతలు వేస్తున్న ఎత్తుగడలు, రాజధానిలో కూర్చుని తీసుకుంటున్న పొత్తుల నిర్ణయాలు నియోజకవర్గ స్థాయిలోను, గ్రామస్తాయిలోను ఎలాంటి ఫలితమిస్తాయో అంచనా వేయడం లేదని, తమ ఆజ్ఞలను క్రింది స్థాయి వారు (పవర్ పాలిటిక్సులో భాగంగా) చచ్చినట్లు పాటిస్తారనే ధీమాతోనే అగ్రనాయకులు ఇలాటి ఆలోచనలు చేస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు.
“నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా”. ఈ నానుడి ప్రకారం తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఎవరు గాలివానో ఎసరు రాబందులో 2019 ఎన్నికల తర్వాత కానీ తెలిదు. ఈ (అనైతిక) పొత్తులు ఎవరిని ముంచుతాయో, ఎవరిని తెలుస్తాయో వేచిచూద్దాం. అలాగే ఎవరి ఎత్తుగడ ఆత్మహత్యా సదృశమౌతుందో కాలం నిర్ణయిస్తుంది