చంద్రబాబు బిజెపి వ్యతిరేక కూటమి కూడ గట్ట గలరా?

(వి శంకరయ్య)

ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు. గత అనుభవం మన కళ్ల ముందు వుంది. కాంగ్రెస్ కు బిజెపి కి వ్యతిరేకంగా కూటములు పురుడు పోసుకున్నాయి. అవి తుదకు ఏలా విచ్ఛిన్నం అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు విచ్ఛిన్నం అయ్యాయో తెలుసు కోవలసి వుంది.

కేవలం అధికార దాహంతోనూ లేదా ఒకరిని దించి మరొకరిని గద్దె ఎక్కించాలనే ధోరణితో ఏర్పాటు జరిగే ఏ కూటమి ఎక్కువ కాలం బతికి బట్టకట్ట లేవు . వీరిలో ప్రజల ప్రయోజనాల అంశంలో ఏకీభావం చాలా తక్కువ. సిద్దాంత రీత్యా భావ సారూప్యత వుండదు. కేవలం అధికార దాాహంమాత్రమే వీరిని కలుపుతుంది. కొంత కాలం గడచిన తర్వాత ఎవరి ప్రయోజనాల కోసం వారు పరుగులు తీయడంతో కూటమి ముక్కు చెక్కలౌతుంది. గతంలో ఈ లాంటి అనుభవాలు చాలా వున్నాయి. . రెండు నెలల క్రితం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేర నాలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. తుదకు అలసి సొలసి తత్వం బోధ పడి చాలించు కున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వంతు వచ్చింది. ఇప్పుడైనా బిజెపి ని దాని మతోన్మాద విధాల గురించి పల్లెతు మాట అనడం లేదు. కొంత కాలం దానితో కాపురం చేసినపుడు మాట్లాడ లేక పోయినా ప్రస్తుతం గతంలో తను చేసిన తప్పుల గురించి పల్లెతు మాట అనడంలేదు.

తను బిజెపితో జట్టు కట్టిన రోజులలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులపై మైనారిటీల పై దాడులు జరిగాయి. పశు మాంసం తిన్నారని తుదకు చనిపోయిన పశువులను తొలగించ లేదని అతి క్రూరంగా దాడులు చేయబడ్డాయి. అంతేగాదు. ఎపి కి చెందిన దళిత విధ్యార్ధి వేముల రోహిత్ సంఘ్ పరివార శక్తుల వత్తిడికీ ఆత్మ హత్య చేసుకొంటే చంద్రబాబు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఆ మధ్య స్వామి అగ్నివేశ్ పై బిజెపి దాని సంఘ్ పరివార శక్తులు దాడి చేస్తే అది వాజ్ పాయ్ పార్థివ దేహం చూచేందుకు వెళ్లితే చంద్రబాబు మాట వరసకు ఖండించ లేదు. బిజెపి విధానాన్ని కాకుండా తనకు సహరించ లేదని మాత్రమే రోడ్డె క్కారు.

బిజెపికి చెందిన మతోన్మాద దురహంకార విధానాల యెడల తన వైఖరి ఏమిటో ఇంత వరకు చంద్రబాబు స్పష్టం చేయలేదు. ఈ రోజు చంద్రబాబు బిజెపి కి వ్యతిరేకంగా తీసుకోనే వైఖరికి రాష్ట్రంలో గాని దేశంలో గాని ప్రజాస్వామ్య ప్రజాతంత్ర శక్తులు చేపట్టే విధానాలకు సంబంధములేదు.ఈరోజు చంద్రబాబు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పెడ బొబ్బలు పెడుతున్నారు. అయితే తనురాష్ట్రంలో చేసిన పని ఏమిటి? ప్రజాస్వామ్య బద్దంగాతమ డిమాండ్లు తెలుపు కొనేందుకు వచ్చిన ఉపాధ్యాయుల యెడల వ్యవహరించిన తీరు ఏ రకమైన ప్రజాస్వామ్యం? నిన్న గాక మొన్న మధ్యాహ్నం భోజన కార్మికులు అమరావతి రానీయ కుండా ఎక్కడి కిక్కడ అడ్డు కోవడం మోడీ అవలంబించే విధానాలకు తక్కువగా వున్నాయా?

కేంద్రంలో ప్రధాని మోడి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న మాట నిజం. మరి రాష్ట్రంలో ఎన్నికైన సర్పంచ్ లువుండగా వారిని కాదని టిడిపి నేతలను జన్మ భూమి కమిటీ సభ్యులుగా నియమించడం ప్రధాని మోడి విధానాల కన్నా క్రూరంగా లేదా? అందుకే చంద్రబాబు బిజెపి కి వ్యతిరేకంగా ఎంత మొత్తు కొంటున్నా రాష్ట్రంలో స్పందన కనిపించడం లేదు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసిన సందర్బం లేదు. ఎవరి అండతో ఒకరి అండ కావాలి. దానికీ చారిత్రక ఆవశ్యకత అనే లాంటి ముద్దు పేరులు పెట్టడంలో దిట్ట. రాష్ట్ర విభజన సమయంలో బిజెపితో కలవడం అప్పట్లో చారిత్రక ఆవశ్యకత నేడు కాంగ్రెస్ తో కలవడం మరో చారిత్రక ఆవశ్యకత. అంటే అధికారంలో కొనసాగేందుకు ఎత్తుగడలు మాత్రమే. పార్టీ ప్రయోజనాలను ప్రజల ప్రయోజనాలుగా చూపిస్తున్నారు.
ఇంత వివరణ ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు బిజెపి కి వ్యతిరేకంగా కూడ గట్ట నున్న వివిధ రాష్ట్రాలలో గల వివిధ పార్టీలు చంద్రబాబు లాగే గతంలో వ్యవహరించాయి. మున్ముందు అదే విధంగా వ్యవహరించే అవకాశం వుంది. మాయావతి మమత కాంగ్రెస్ తోనూ బిజెపికి తోనూ చంద్రబాబు లాగా జట్టు కట్టిన రోజులునాయి

తమ రాష్ట్రంలో తమ పార్టీకి నష్టం జరుగుతుందని భావించితే జెండా పీకి తమ దారి తాము చూచు కుంటారు. ఇదిలా వుండగా కాంగ్రెస్ కు మాయావతి కి ఉప్పు నిప్పు గావుంది. మమత వుండే ఏ కూటమిలో వామపక్షాలు వుండవు. అంతేకాదు
.భావ సారూప్యత లేని కూటములలో పైగా ఎన్నికల ముందు ఏ కూటమిలో వామపక్షాలు చేరే అవకాశం లేదు. బిజెపి కి వ్యతిరేకంగా వామపక్ష ప్రజాతంత్ర శక్తులు సాగించే పోరాటం వేరు. చంద్రబాబు లాంటి నేతలు సాగించే పోరాటం వేరు.

అందుకే కాబోలు ఒక రకమైన జాతీయ మీడియా చంద్రబాబు ఊహించుతున కూటమిని కిచిడి కింద అభివర్ణించాయి. రామ చంద్ర గుహ లాంటి జాతీయ స్థాయి విశ్లేషకులు ప్రతి పక్షాల బలహీనత బిజెపి కి బలంగా భావిస్తున్నారు.

జాతీయ స్థాయిలో బిజెపి అధికారంలో వుండినా లేక కాంగ్రెస్ వున్నా కొన్ని సందర్భాల్లో ప్రతి పక్షాలు బలహీనతల పైనే బతుకు సాగిస్తాయి. మరి కొన్ని సమయాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఏదో ఒక పార్టీకి లాభించుతుంది. ఈ పద్ధతి లోనే మోడి గద్దె ఎక్కారు.

రాష్ట్రంలలో కూడా ఇదే పునరావృత్తం అవుతుంది. ప్రస్తుతం ఎపి చంద్రబాబు తను గెలుపొందుతామనే ధైర్యం వుంటే కాంగ్రెస్ వెంట పడేవారు కాదు. 2014లోబిజెపి తో కలిసే వారు కాదు. ఇచ్చట భావ సారూప్యత ప్రజల ప్రయోజనాల ఎడల ఏకీభావం లేదు. కేవలం అధికారం నిల బెట్టుకోవడం ముఖ్యం. ..

బెంగాల్ లోనూ త్రిపుర లోనూ మమత దానితో పాటు బిజెపి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే చంద్రబాబు తన రాష్ట్రంలో కూడా అదే పద్ధతి అవలంభించడం వలన వీటిని ఖండించ లేక పోతున్నారు. పైగా వారితోనే ప్రజాస్వామ్య బద్దంగా బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తానని చెప్పడం అపహాస్యంగా వుంది
ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్రంలో పాశవిక విధానాలకు స్వస్తి చెప్పి బిజెపి కి వ్యతిరేకంగా సూత్ర బద్ద వైఖరి తీసుకొంటే తను ఆశించిన ఫలితాలు దక్కుతాయి. జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య ప్రజాతంత్ర శక్తుల అండ లభిస్తుంది. అయితే ఇది ఎండ మావే.

 

(వి శంకరయ్య, రాజకీయ వ్యాఖ్యాత, విశ్లేషణలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. తెలుగురాజ్యం.కామ్ కు సంబంధలేదు)