ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్షేత్రస్థాయిలో పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రచార హోరు ఒకెత్తయితే.. అనేక చోట్ల సొంత కుటుంబాల నుంచే ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్న నేతల మధ్య పోరు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయ విభేదాలు, సిద్ధాంతపరమైన లంకెలు తోడై “ఫ్యామిలీ ప్యాక్డ్ పాలిటిక్స్” రూపంలో అత్తాకోడళ్లు, తోటికోడళ్ల మధ్య ముఖాముఖీ సమరాలు తెరపైకి వచ్చాయి.
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం జరుగుతున్న పోరు రాష్ట్రస్థాయిలోనే చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా ప్రత్యూష బరిలో నిలవగా, వైఎస్సార్సీపీ నుంచి సుశీల పోటీపడుతున్నారు. వరుసకు అత్తాకోడళ్లైన వీరిద్దరూ పరస్పరం భీకరంగా పోటీకి దిగడం కర్నూలు నగర రాజకీయాల్లో సరికొత్త రసవత్తర వాతావరణాన్ని సృష్టించింది. కుటుంబ సంబంధాలను పక్కనబెట్టి సొంత ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఇరు వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.అటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ ఛైర్పర్సన్ పీఠం కోసం తోటికోడళ్ల మధ్య సమరం తారస్థాయికి చేరింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి టీడీపీ తరఫున కూటమి అభ్యర్థిగా బరిలో నిలవగా, ఆయన సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు సతీమణి అనిత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు తోటికోడళ్లు మున్సిపల్ పీఠం కోసం తలపడుతుండటంతో నర్సీపట్నం ఓటర్లలో ఆసక్తి నెలకొంది. కేవలం కర్నూలు, నర్సీపట్నం మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లోనూ ఇలాంటి కుటుంబ పోటీలు స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత గ్లామర్, ఉత్కంఠను తెచ్చిపెడుతున్నాయి. గెలుపే లక్ష్యంగా బంధుత్వాలను, కుటుంబ సమీకరణాలను దాటి రాజకీయ సిద్ధాంతాలకే ప్రాధాన్యత ఇస్తూ బరిలోకి దిగుతున్న అభ్యర్థులకు ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.