తెలుగుదేశం పార్టీకి మళ్లీ చిక్కులు మొదలయ్యాయి. అవి కూడా పాతవే. అవే మళ్లీ తిరగబడుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబుకు అన్ని వైపుల దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్న తరుణంలో ఈ చిక్కు ఆయన్ను మరింత ఇబ్బంది పెడుతోంది.
అసలు విషయం ఏంటంటే.. గుంటూరు జిల్లాలోని ఆత్మకూరులో టీడీపీ కార్యాలయం ఉంది. అక్కడ నిర్మించిన టీడీపీ కార్యాలయంపైనే ఈ వివాదం. ఈ వివాదం ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఉంది. దీనికి సంబంధించి.. ఏపీ హైకోర్టులో దాఖలు అయిన పిటిషన్ ను కొట్టేయడంతో… మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేశారు.
అక్కడ నిర్మించిన టీడీపీ కార్యాలయం కోసం అక్రమంగా భూమిని కేటాయించి నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆళ్ల సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జూన్ 2017లో ఆత్మకూరులో ఉన్న పోరంబోకుకు చెందిన మూడు ఎకరాల 65 సెంట్ల భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 228ను సవాలు చేస్తూ ఆళ్ల తరుపు లాయర్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.
ఆ పోరంబోకులో ఉన్న సర్వే నెంబర్ 392లో అప్పటి టీడీపీ ప్రభుత్వం టీడీపీ కార్యాలయం కోసం 99 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తూ దాన్ని కేటాయించిందని… ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్మాణం అని ఆళ్ల తరుపు లాయర్ కోర్టుకు విన్నవించారు.
ఇది చట్టవిరుద్ధమే కాదు.. రాజ్యాంగ విరుద్ధం. నీటి వనరులు ఉన్న ప్రాంతంలోని భూములను నిర్మాణాల కోసం కేటాయించడం నేరం అని తెలిసినప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ గత టీడీపీ ప్రభుత్వం అక్కడ నిర్మాణం చేపట్టిందని స్పష్టం చేశారు.
ఇప్పటికే హైకోర్టు ఈవిషయంపై తీర్పు చెప్పింది. చట్ట ప్రకారం దీనిపై తగిన చర్యలు తీసుకోవడానికి ఇప్పటి ప్రభుత్వానికి స్వేఛ్ఛ ఉందంటూ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా… అక్కడ చేపట్టిన టీడీపీ కార్యాలయ నిర్మాణాన్ని కూల్చడానికి మాత్రం అనుమతులు ఇవ్వలేదు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా కేసును ముగించేయడంతో.. ఆళ్ల సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
దీంలో ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1994లోని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ వాళ్లు సుప్రీం కోర్టును కోరారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే. ఈ సమయంలో ఇది టీడీపీకి మరో అగ్ని పరీక్షలా మారింది.