మన రాష్ట్రంలోని సామాజికవర్గాలన్నీ రాజకీయ పార్టీల మధ్యన చీలిపోయి చాలా కాలమే అయింది. ఎన్నికలంటూ వస్తే ఆయా వర్గాలు తన అభిమాన పార్టీలకు తప్ప వేరొకరికి ఓట్లు వేయరు. దీన్నే ఓటు బ్యాంక్ రాజకీయం అంటారు చాలామంది. సామాజికవర్గాలు సైతం ఏ పార్టీ అయితే తమకు మాత్రమే ప్రత్యేకంగా మేలు చేస్తుందో ఆ పార్టీకే మద్దతిస్తూ వస్తున్నారు. అలా తెలుగుదేశం పార్టీకి బీసీలు ప్రధాన బలంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అయితే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అండగా ఉంటూ వస్తున్నాయి. వైఎస్ జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెల్లాచెదురవడంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు వైసీపీ టర్న్ తీసుకున్నాయి.
2014, 2019 ఎన్నికల్లో ఆ మూడు వర్గాలు దాదాపు పూర్తిగా జగన్ పక్షానే నిలబడ్డాయి. బీసీలు కూడా ఎన్టీఆర్ హయాం నుండి టీడీపీనే ఆదరిస్తూ వచ్చారు. రాజకీయాల్లో ఎన్ని మార్పులు జరిగినా 2019 ముందు వరకూ ఈ సామాజికవర్గ సమీకరణాలు మాత్రం తప్పలేదు. అందుకే చంద్రబాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి అయినా బలమైన ప్రతిపక్షంగా నిలబడగలిగారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అధికారానికి దూరమైనా టీడీపీ హుందాగా అసెంబ్లీలో, పార్లమెంటులో చెలామణీ కాగలిగింది అంటే అది బీసీల చలవే. అందుకే టీడీపీకి బీసీలను దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాల జరిగాయి.
స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం బీసీ వర్గాలను టీడీపీ నుండి తనవైపుకు తిప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన వలన కాలేదు. అయితే ఆ పనిని 2019లో వైఎస్ జగన్ చేసి చూపించారు. చంద్రబాబు నుండి బీసీ వర్గాలను తనవైపుకు తిప్పుకున్నారు. అయితే అది పూర్తిస్థాయిలో కాదు కానీ కొద్ది శాతం మాత్రమే. అయినా అది గొప్ప విషయమనే అనాలి. ఎవ్వరి వలనా కానిది చేసి చూపించారు జగన్. ఎన్నికల్లో కొంతమందినే ఆకర్షించిన ఆయన వచ్చే ఎన్నికల నాటికి మెజారిటీ బీసీలను వైసీపీ పక్షాన ఉండేలా చేయడం కోసం సంక్షేమ పథకాలను అమలుచేయడంతో పాటు వాసుపల్లి గణేష్ లాంటి బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు.