ప్రకాష్ రాజ్ పట్ల ఎందుకింత వ్యతిరేకత.?

ప్రకాష్ రాజ్ కాకుండా, బరిలో ఇంకెవరు నిలిచినా ‘మా’ ఎన్నికల వ్యవహారంలో ఇంత ‘రచ్చ’ జరిగి వుండేది కాదేమో. అసలు ప్రకాష్ రాజ్‌కి మెగా కాంపౌండ్ నుంచి మద్దతు ఎందుకు లభిస్తోందో ఎవరికీ అర్థం కావడంలేదు. నిన్న మొన్నటి పరిస్థితులు వేరు, తాజా పరిస్థితులు వేరు.

మంచు కుటుంబం అత్యంత వ్యూహాత్మకంగా తెరవెనుక పావులు కదుపుతోంది. ప్రకాష్ రాజ్ స్థానికుడు కాదనీ, ప్రకాష్ రాజ్ సినిమా షూటింగులకు ఆలస్యంగా వస్తాడనీ, ప్రకాష్ రాజ్ అసలు బాధ్యత తెలిసిన వ్యక్తి కానే కాదనీ.. అన్నిటికీ మించి ప్రకాష్ రాజ్ అహంకారి అనీ.. ఇలా చాలా విమర్శలు వస్తున్నాయి, వాటి తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది.

తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్‌కి వ్యతిరేకంగా మాట్లాడారు. తాను ప్రకాష్ రాజ్‌తో కలిసి 15 సినిమాలు చేశాననీ, ఏనాడూ ఆయన షూటింగ్‌కి సరైన సమయానికి రాలేదని కోట విమర్శించారు. మంచు విష్ణుకి ఓటెయ్యమని ఎవరూ అడగాల్సిన అవసరం లేదనీ, ఓటు మంచు విష్ణుకే పడుతుందని చెప్పారు కోట.

ఇటు పొలిటికల్ సపోర్ట్, అటు సినిమా సపోర్ట్.. ఇలా మంచు విష్ణు అనూహ్యంగా అత్యద్భుతమైన మద్దతుని కూడగట్టుకున్నట్లే కనిపిస్తోంది. అయినాగానీ, ప్రకాష్ రాజ్ పట్ల ఎంత నెగెటివిటీ వున్నాగానీ.. మెగా కాంపౌండ్ సపోర్ట్ ఒక్కటీ.. ప్రకాష్ రాజ్‌ని గెలిపించేయొచ్చన్నది మెజార్ట అభిప్రాయం.