Jagan’s New Cabinet : వైఎస్ జగన్ మంత్రి వర్గంలో కొనసాగేది వీళ్ళేనా.?

Jagan’s New Cabinet : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గం నుంచి పలువురు మంత్రులు ఔట్ అయిపోనున్నారు. కొందరేంటి.? అందరి రాజీనామాల్నీ ముఖ్యమంత్రి తీసుకున్నారు. మొత్తం 24 మంది మంత్రులూ ‘ఆనందంగా’ తమ రాజీనామాల్ని ముఖ్యమంత్రికి సమర్పించారు.

మంత్రి పదవులు ఇచ్చినప్పుడే, ‘పదవులు కేవలం రెండున్నరేళ్ళు మాత్రమే’ అని వైఎస్ జగన్ చెప్పారు గనుక, ఇప్పుడెవరూ మారాం చేయడానికి వీల్లేదు.

అయితే, అనుభవం అలాగే సమర్థత కోణంలో కొందర్ని కొనసాగించవచ్చనీ, నలుగురైదుగురు కొనసాగే అవకాశం వుందనీ తాజా మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఆ కొందరు సమర్థులు, అనుభవజ్ఞులు ఎవరన్నదానిపై మీడియాలో స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి.

నిజానికి, మంత్రి వర్గం రాజీనామా చేయకముందు.. చాలా రోజుల్నుంచే ఎవరెవర్ని వైఎస్ జగన్ కొనసాగిస్తారు.? అన్నదానిపై విశ్లేషణలు జరిగాయి.. ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజా ఊహాగానాల సారాంశమేంటంటే, ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ, రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ రెండిటి మధ్యన అన్నట్టు పేర్ని నానినీ వైఎస్ జగన్ తదుపరి మంత్రి వర్గంలోనూ మంత్రులుగా కొనసాగించబోతున్నారట.

‘నాకు అవకాశాలైతే చాలా తక్కువ..’ అని కొడాలి నాని తేల్చి చెప్పినప్పటికీ, ఆయన అవసరం వుందనే భావనలో వైఎస్ జగన్ వున్నారని సమాచారం. అయితే, అందుకు అవకాశాలు చాలా చాలా తక్కువే. ఆ విషయమై కొడాలి నానికి కూడా ఓ స్పష్టత వుంది.

కొనసాగే మంత్రులెవరన్నదానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సస్పెన్స్ కొనసాగించడం పట్ల వైసీపీలో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎటూ తిరిగి తీసుకుంటారు గనుక, సస్పెన్స్ ఎందుకన్నది వారి వాదన.

ఈ హైడ్రామా ఏంటోగానీ.. ఇలా సమర్థులు, అనుభవజ్ఞులనడం ద్వారా తాజా మాజీల్లో కొందరు అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.