నందమూరి బాలకృష్ణ ఎవరు.? ప్రశ్నిస్తోన్న కోలీవుడ్.!

నందమూర బాలకృష్ణ ఎవరు.? అని ప్రశ్నిస్తున్నారు కోలీవుడ్ అభిమానులు.. కాదు కాదు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ అభిమానులు ఈ ప్రశ్నను సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నారు. అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. ఎ.ఆర్.రెహమాన్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ వ్యాఖ్యానించడమే అందుక్కారణం. ఈ మధ్య రాజకీయాల్లో గజినీలు ఎక్కువైపోయారు. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు.. అంటూ టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఓ సందర్భంలో ప్రశ్నించారు. కేసీయార్ కూడా ఇలాంటి ప్రశ్నే వేశారు. మొన్నీమధ్యన వైఎస్ షర్మిల, తనకు కేటీయార్ ఎవరో తెలియదన్నారు. అలాగే, ఇప్పుడు ఎమ్మెల్యే బాలకృష్ణ తనకు ఎ.ఆర్.రెహమాన్ అంటే ఎవరో తెలియదని సెలవిచ్చారు. తెలియదని ఊరుకోలేదు కదా.? ఆస్కార్ అవార్డులొస్తే గొప్పోడా.? పదేళ్ళకో సినిమా చేస్తే గొప్పోడా.? అని ప్రశ్నించేశారు బాలకృష్ణ.

అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంగీతానికి గుర్తింపు తెచ్చిన ఘనుడు ఏ.ఆర్. రెహమాన్. అలాంటి గొప్ప సంగీత దర్శకుడెవరో తెలియదని ప్రముఖ సినీ నటుడు అయిన బాలకృష్ణ అనడం హాస్యాస్పదం. ఇక్కడ బాలయ్య వెటకారం వికటించింది. కోలీవుడ్ అందుకే ప్రశ్నిస్తోంది, బాలకృష్ణ ఎవరు.? అని. ఆ పరిస్థితిని బాలయ్యే స్వయంగా కొనితెచ్చుకున్నారు. అంతేనా, శ్రీదేవి పిర్ర మీద కొట్టి నటన నేర్పించారు స్వర్గీయ ఎన్టీయార్.. అని గొప్పగా చెప్పేసుకున్నారు బలయ్య. శ్రీదేవి కుటుంబ సభ్యులకు తెలుగు వచ్చి వుండదు. వచ్చి వుంటే, బాలయ్య వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించేవారే. స్వర్గీయ ఎన్టీయార్ జీవించి వున్నా, బాలయ్యకు దబిడి దిబిడి అయిపోయేదే. ఏ గొప్ప కోసం బాలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారోగానీ.. పాపం బాలయ్య అభిమానులు తమ అభిమాన నటుడ్ని కవర్ చేసుకోలేక నానా తంటాలూ పడాల్సి వస్తోంది.