ఉత్తర తెలంగాణను టార్గెట్ చేసిన కేటిఆర్..?

తెలంగాణ రాజకీయాల్లో గులాబీ దళం మరోసారి దూకుడు పెంచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై పోరాడే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉద్యమాలను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా ఉత్తర తెలంగాణ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఈ నవంబర్ నెలలో నాలుగు భారీ బహిరంగ సభలకు వ్యూహాత్మక ప్లాన్ వేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ పర్యటనలు సాగనున్నాయి.

ఉత్తర తెలంగాణలోని కీలక జిల్లాలను కవర్ చేస్తూ కేటీఆర్ ఈ పర్యటనల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. నవంబర్ 1న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో “రైతు గర్జన” భారీ బహిరంగ సభతో ఈ రణభేరి ప్రారంభం కానుంది. ఆ తర్వాత నవంబర్ 11న నిర్మల్ పట్టణంలో రెండో విడత సభ, నవంబర్ 19న నిజామాబాద్ జిల్లాలో మూడో భారీ సభను నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 29న కరీంనగర్ లో ప్రతిష్టాత్మక “దీక్షా దివస్” సభను భారీ ర్యాలీతో నిర్వహించి ఈ పర్యటనలను ముగించనున్నారు.

ఈ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ పక్కా పొలిటికల్ అజెండాను సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రైతాంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న కరెంట్ కోతలు, సకాలంలో ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల కాకపోవడంతో ఎండిపోతున్న సాగునీటి కష్టాలు, గ్రామాల్లో తలెత్తుతున్న తాగునీటి సమస్యలనే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ ఎంచుకుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాలను, వ్యవసాయ రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని కేటీఆర్ ఈ వేదికల ద్వారా ప్రజల ముందు ఉంచనున్నారు.

కేటీఆర్ ఈ పర్యటనలలో కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్న బాధిత రైతు కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శించనున్నారు. సభల అనంతరం స్థానిక నియోజకవర్గాల ముఖ్య నేతలు, మాజీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఉత్తర తెలంగాణ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను కూడగట్టాలనే బీఆర్ఎస్ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.